చలికాలంలో సూర్య కాంతి ఎక్కువగా ప్రకాశించదు. వర్షాకాలంలో కూడా ఎండ ఎక్కువగా ఉండదు. పైగా వచ్చే నాలుగు రోజుల్లో వర్షం వచ్చే అవకాశముందని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. ఆ సమయంలో దుస్తులు ఆరబెట్టుకోవడం చాలా కష్టం. వర్షం పడని ప్రాంతంలో వాటిని వేసినా అవి చల్లగానే ఉంటాయి. అందుకే చాలామంది తడి ఆరేందుకు ఇంట్లో ఫ్యాన్ కింద బట్టలు ఆరేస్తారు. కొందరు దుస్తులు ఆరేసేందుకు సరైన ప్లేస్ లేక.. ఇంట్లోనే ఫ్యాన్ కింద ఆరోస్తారు. అయితే గదిలో తడి దుస్తులు ఆరేయడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే అవి ఇంటి లోపల తేమను పెంచడమే కాకుండా, ఇంట్లో ఫంగస్ సహా అనేక రకాల ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని కూడా పెంచుతుందని సూచిస్తున్నారు. చిన్న పిల్లలలో సైనస్, అలెర్జీలు న్యుమోనియాకు కారణమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
దుస్తులను ఎండలో కాకుండా ఇంటి లోపల తరచుగా ఆరబెట్టినట్లయితే.. అది ఊపిరితిత్తుల ఆరోగ్యానికి ముప్పుగా మారే అవకాశం ఉందని ఓ అధ్యయనం తెలిపింది. మాంచెస్టర్‌లోని నేషనల్ ఆస్పెర్‌గిలోసిస్ సెంటర్‌లోని పరిశోధకులు తమ అధ్యయనం ఆధారంగా, తడి దుస్తులను ఇంటి లోపల ఆరబెట్టే వ్యక్తులకు కొన్ని రకాల ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. పరిశోధన ప్రకారం, దుస్తులు లోపల ఆరబెట్టడం వల్ల గదిలో తేమ 30 శాతం పెరుగుతుంది. ఇది ఆర్స్పెగిల్లస్ ఫ్యూమిగేటస్ స్పోర్స్ అనే ఫంగస్ వృద్ధికి కారణమవుతుంది. ఇది శ్వాసకోశ ప్రక్రియను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా శ్వాసనాళాలు, సైనస్, ఊపిరితిత్తులు దీనికి ప్రభావితం అవుతాయి. ఒకవేళ ఇంట్లో దుస్తులను ఆరేయాల్సిన పరిస్థితి వస్తే.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
దుస్తులు ఇంట్లో ఆరవేసినప్పుడు దుర్వాసన రాకుండా ఉండాలంటే.. గదిలో ఒక మూల అగరబత్తులు వెలిగించండి. కానీ దుస్తుల నుంచి దూరంగా వెలిగించండి. అగరబత్తుల నుంచి వచ్చే పొగ.. అవి త్వరగా ఆరిపోవడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా మంచి వాసన కూడా వస్తాయి. అలాగే ఉతికేటప్పుడు 2 టేబుల్ స్పూన్ల వెనిగర్ ని నీళ్లలో వేయాలి. ఇది ఇంట్లో దుర్వాసన రాకుండా చేస్తుంది. దుస్తులకు మృదుత్వాన్ని కూడా ఇస్తుంది.
ఉప్పుతో తేమకు చెక్..
దుస్తులు తడిగా ఉన్నప్పుడు.. వాటిలోని తేమ స్థాయిని తగ్గించడానికి ఉప్పు మంచి మార్గం. దీనికోసం బ్యాగ్‌లో ఉప్పు నింపి గదిలో ఒక మూల ఉంచండి. ఉప్పు తేమను గ్రహిస్తుంది. తద్వార ఫంగస్ కంట్రోల్ అవుతుంది.
నీరు లేకుండా దుస్తులను పిండండి..
ఎండలో అయినా.. నీడలో అయినా దుస్తులు ఆరవేయాల్సి వస్తే.. ముందే వాటిని బాగా పిండండి. అనంతరం వాటిని హ్యాంగ్ చేయండి. దుస్తులను ఇంట్లో ఆరవేసినప్పుడు కిటికీలు బాగా తెరిచి ఉంచండి. వెంటిలేషన్ బాగా ఉంటే.. దుస్తుల నుంచి దుర్వాసన రాకుండా ఉంటుంది.
హ్యాంగర్లు ఉపయోగించండి
దుస్తులు త్వరగా ఆరేందుకు మీరు హ్యాంగర్లు ఉపయోగించవచ్చు. ఇవి దుస్తులు కలిసిపోకుండా.. వదులుగా ఉండి త్వరగా ఆరేందుకు వీలవుతుంది.
Also Read : పైనాపిల్ జ్యూస్ ఉపయోగాలు తెలిస్తే, డాక్టర్ అవసరం ఉండదేమో!
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.