తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తూ, నేతలు, సామాన్యులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి వాహనాన్నీ క్షుణ్ణంగా సోదా చేస్తున్నారు. రూ.50 వేలకు మించి నగదును తీసుకెళ్తే తమ వెంట నగదుకు సంబంధించిన పత్రాలు తీసుకెళ్లాలని స్ఫష్టం చేస్తున్నారు. అక్టోబర్ 9 నుంచి ఇప్పటి వరకూ రూ.480.25 కోట్లకు పైగా విలువైన నగదు, బంగారం, మద్యం, డ్రగ్స్ సహా ఇతరత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఇప్పటివరకూ రూ.3 కోట్ల విలువైన అక్రమ మద్యం స్వాధీనం చేసుకుని, 88 కేసులు నమోదు చేసి 23 మందిని అరెస్ట్ చేశామని సరూర్ నగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవీందర్ రావు వెల్లడించారు. దాదాపు 84,400 లీటర్ల మద్యం, 75 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు.


మేడ్చల్ జిల్లా బాచుపల్లి ప్రగతినగర్ లో అక్రమంగా తరలిస్తోన్న మద్యాన్ని ఆదివారం పట్టుకున్నారు. లిక్కర్ ఏపీలో అమ్మేందుకు తరలిస్తున్నట్లు గుర్తించిన అధికారులు, 75 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, సంగారెడ్డి జిల్లా చిరాగ్ పల్లి అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద కారులో తరలిస్తోన్న రూ.19.90 లక్షల నగదు పట్టుకున్నారు. సరైన పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసినట్లు చెప్పారు. 


ముమ్మరంగా సోదాలు


యాదాద్రి జిల్లా ఆలేరు చెక్ పోస్ట్ వద్ద ఓ జాతీయ బ్యాంకుకు చెందిన వాహనాన్ని తనిఖీ చేయగా, వాహనం నెంబర్ సహా, నగదు రవాణాకు సంబంధించి పత్రాల్లో తేడా ఉండడంతో రూ.77 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, కరీంనగర్ లో రూ.2.36 కోట్లు, మియాపూర్ లో 17 కిలోల బంగారం, కవాడిగూడలో రూ.2.09 కోట్ల నగదు, వాడపల్లి చెక్ పోస్ట్ వద్ద రూ.3 కోట్లు, మరో చోట రూ.6 లక్షలు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మర తనిఖీల్లో పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. సరైన పత్రాలు లేకుండా ఎవరు నగదు తరలించినా ఉపేక్షించడం లేదు. అంతే కాకుండా పార్టీల నేతలు అందించే బహుమతులు, చివరకు వారు అందించే కండువాలకు బిల్లులు లేకపోయినా సీజ్ చేస్తున్నారు. 


మంత్రులైనా సరే


తనిఖీల సందర్భంగా మంత్రులు, ఇతర పార్టీల నేతల వాహనాలపైనా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. సీఎం కేసీఆర్ కాన్వాయ్ సహా మంత్రి కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, రఘునందన్ రావు, కాంగ్రెస్ నేతల వాహనాలు సైతం తనిఖీ చేశారు. ఎన్నికల ప్రచారంలో నేతలు బిజీగా ఉన్నా, విస్తృత పర్యటనల నేపథ్యంలో ఈ సోదాలు విస్తృతం చేశారు. 


అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల్లో నిఘా తీవ్రం


ఎన్నికల నేపథ్యంలో పొరుగు రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి వస్తోన్న వాహనాలతో పాటు మనుషుల కదలికలపైనా ప్రత్యేక నిఘా ఉంచారు. ఈ నేపథ్యంలో తెలంగాణ - కర్ణాటక సరిహద్దుల్లో 9 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు సంగారెడ్డి ఎస్పీ చెన్నూరి రూపేశ్ తెలిపారు. ఈ చెక్ పోస్టుల వద్ద సీసీ కెమెరాలతో ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు చెప్పారు. ఎప్పటికప్పుడు పోలీసులను అప్రమత్తం చేస్తున్నట్లు వివరించారు. ఎన్నికలు పూర్తయ్యే వరకూ గట్టి నిఘా ఉంచుతామన్నారు.


Also Read: మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్ మేన్ సూసైడ్, పాయింట్ బ్లాంక్‌లో తుపాకీతో కాల్చుకొని