Sabitha Indra Reddy: తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎస్కార్ట్ అధికారి ఫజన్ అలీ ఆత్మహత్యకు పాల్పడ్డారు. మంత్రి ఎస్కార్ట్‌ విధులు నిర్వహిస్తున్న ఏఎస్‌ఐ తపాకీతో కాల్చుకుని బలన్మరణానికి పాల్పడ్డాడు. ఉదయం కూతురుతో కలిసి ఫజన్ అలీ డ్యూటీకి వచ్చారు. తరువాత శ్రీనగర్ కాలనీలోని మణికంఠ హోటల్‌కు వెళ్లారు. కూతురు కళ్ల ముందే తుపాకీతో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నారు. లోన్ రికవరీ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. 


ఘటనపై ఫజల్ కూతురు మాట్లాడారు. తన తండ్రి ఓ ప్రైవేటు బ్యాంకు నుంచి రూ.3 లక్షల రుణం తీసుకున్నట్లు తెలిపారు. వాటిని చెల్లించే క్రమంలో బ్యాంకు రికవరీ ఏజెంట్ల నుంచి వేధింపులు ప్రారంభమయ్యాయని, వాటిని తట్టుకోలేక తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. ఫజన్ అలీ ఆత్మహత్య గురించి తెలుసుకున్న సబితా ఇంద్రారెడ్డి, వెస్ట్‌జోన్‌ డీసీపీ జోయల్‌ డేవిస్‌తో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి ఫజల్ కూతుర్ని ఓదార్చారు. అధికారి బలన్మరణం బాధాకరమన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


ఆర్థిక కారణాలతోనే ఆత్మహత్య - డీసీసీ వివరణ
ఫజల్ అలీ ఆత్మహత్య ఘటనపై వెస్ట్ జోన్ డీసీపీ జోయెల్ డేవిస్ స్పందించారు. ఎస్కార్ట్ డ్యూటీలో ఉన్న ఫజల్ అలీ ఈ రోజు ఉదయం 6 గంటలకు రిలీవర్‌కు రిలీవింగ్ ఇచ్చినట్లు చెప్పారు. కూతురిని కూడా డ్యూటీకి తీసుకొచ్చినట్లు తెలిపారు. అనంతరం హోటల్ వద్ద ఆమెతో మాట్లాడి తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పారు. ఆర్ధిక సమస్యలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు  ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు.