Just In





Tajmahal History: తాజ్ మహల్ నిర్మించిన కార్మికుల చేతులను షాజహాన్ నరికేశాడా? చరిత్ర ఏం చెబుతోంది?
Tajmahal : తాజ్ మహల్ నిర్మించిన కార్మికుల చేతులను షాజహాన్ నరికేశాడా? చరిత్ర ఏం చెబుతోంది? ప్రపంచంలోని వివిధ ప్రదేశాల నుంచి వచ్చిన వాళ్లు ఊరుకున్నారా?

Tajmahal: ప్రపంచ ప్రఖ్యాత మొగల్ కట్టడం 'తాజ్ మహల్ ' నిర్మాతగా షాజహాన్ చక్రవర్తి పేరు చరిత్రలో నిలిచిపోయింది. తన ప్రియ భార్య ముంతాజ్ బేగం అకాల మరణంతో దిగులుపడ్డ షాజహాన్ ఆమె గుర్తుగా తాజ్ మహల్ నిర్మించాడు. యమునా నది ఒడ్డున ఆగ్రాలో తెల్లటి పాల రాయితో నిర్మించిన తాజ్ మహల్ నిర్మాణానికి అప్పట్లోనే 50 లక్షల రూపాయలు ఖర్చయిందని రికార్డ్స్ చెప్తున్నాయి. ఇప్పటి లెక్కల ప్రకారం అది 3500కోట్లపై మాటే.
తాజ్‌మహాల్ చూడ్డానికి దేశ విదేశాల నుంచి ఎంతోమంది పర్యాటకులు వస్తూ ఉంటారు. ఇంత ప్రసిద్ది చెందిన తాజ్ మహల్ చుట్టూ చాలా కథలు- కట్టు కథలు ప్రచారంలో ఉన్నాయి. అలాంటి వాటిలో ముఖ్యమైనది తాజ్ మహల్ నిర్మాణం కోసం కష్టపడిన కార్మికుల చేతులను షాజహాన్ చక్రవర్తి నరికించేసాడని. తాజ్ మహల్ లాంటి మరొక కట్టడం నిర్మించకుండా ఉండడానికి చక్రవర్తి ఈ పని చేశాడని ఒక కథనం ప్రచారంలో ఉంది. దీనిలో నిజం ఎంతో ఇప్పుడు చూద్దాం..?
ఆధారాలు లేని ప్రచారం
ఎప్పుడు ఈ కథ ప్రచారంలోకి వచ్చిందో గాని ఇప్పటికీ దీనిని నిజమైన నమ్మే వాళ్ళు చాలామందే ఉన్నారు. ఆగ్రాలో 1631 నుంచి 1653 వరకూ తాజ్ మహల్‌తోపాటు దాని చుట్టూ ఉన్న ఉద్యానవనాల నిర్మాణం కొనసాగింది. 22 సంవత్సరాలు పాటు రెండు తరాల కార్మికులు దాదాపు 20 వేల మంది తాజ్ మహల్ నిర్మాణం కోసం పని చేశారు. చీఫ్ ఆర్కిటెక్ట్‌గా "ఉస్తాద్ అహ్మద్ లహోరీ " పని చేశారు. రాజస్థాన్ నుంచి పాలరాయిని, శ్రీ లంక, చైనా, టిబెట్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి ఇతర ప్రాంతాల నుంచి నిర్మాణ సామగ్రి తెప్పించారు. సరకు రవాణా కోసం 1000కిపైగా ఏనుగులను వినియోగించారు.
తాజ్ మహల్ (1631-1653 )తోపాటు ఢిల్లీలోని ఎర్రకోట (1639-1648), జామా మసీద్( 1650-1656) నిర్మాణం కూడా ఇంచుమించు ఒకే సమయంలో జరిగింది. వీటన్నిటి నిర్మాణంలో పాలుపంచుకున్న కార్మికులు, ఉద్యోగులు ప్రపంచంలోని విభిన్న ప్రాంతాలకు చెందిన వాళ్ళు. దక్షిణ భారతదేశంతోపాటు భూఖారా( ఉజ్బెకిస్తాన్ ), సిరియా, పర్షియా, బెలూచిస్థాన్ నుంచి వచ్చిన కార్మికులు తాజ్ మహల్ నిర్మాణం కోసం పని చేశారు. ఒకవేళ తాజ్ మహల్ నిర్మాణంలో పాల్గొన్న కార్మికుల చేతులు షాజహాన్ నరికించి ఉంటే తర్వాత పూర్తయిన జామా మసీద్ నిర్మాణంలో కార్మికులు ఎలా పాల్గొనేవారు?
Also Read: మావోయిస్టు ప్రస్థానం పూర్తయినట్టేనా? - టాప్ లీడర్లు అవుట్, సాయుధ ఉద్యమం క్లైమాక్స్‌కు చేరిందా!
పోనీ వాళ్లు.. వీళ్ళు వేరే అనుకున్నా జామా మసీద్ నిర్మాణంలో భారతీయులతోపాటు, అరబ్బు, పర్షియన్‌లు, టర్కులు సహా యూరోపియన్లు పాల్గొన్నట్టు మొఘల్ రికార్డు చెబుతున్నాయి. తాజ్ మహల్ కార్మికుల చేతులు నరికించారని తెలిసి వీళ్లు ఎలా పని చేసి ఉంటారు. అయా దేశాలు అధినేతలు ఎలా ఊరుకుని ఉంటారు అనేది ఇర్ఫాన్ హబీబ్, రానా సఫవి వంటి పాపులర్ చరిత్రకారులు వెళ్లబుచ్చే ప్రశ్న?
చారిత్రిక ఆధారాల్లో కనపడని కథ ఇది
మొగల్ కాలంలో మూడు రకాల చారిత్రక ఆధారాలు ఉండేవి. ఒకటి ఆయా చక్రవర్తులకు సంబంధించిన ఆత్మకథ, రోజువారి రాజాస్థాన వ్యవహారాలకు సంబంధించిన రికార్డ్, దేశ విదేశాల నుంచి వాళ్ళ కాలంలో వచ్చే పర్యటకులు /వ్యాపారుల రికార్డ్స్/నోట్స్. వీటిలో దేనిలోనూ షాజహాన్ కార్మికుల చేతులు నరికించిన ఘటన గురించిన వివరాలు లేవు. పైపెచ్చు మరో ఆసక్తికరమైన విషయం నమోదై ఉంది.
తాజ్ కార్మికుల కోసం ఏర్పాటైన ప్రాంతమే 'తాజ్ గంజ్ '
తాజ్ మహల్ నిర్మాణం 22 సంవత్సరాల వరకూ సాగింది. అంతకాలం కార్మికులు నివాసం ఉండడానికి తాజ్ మహల్‌కి మూడు కిలోమీటర్ల దూరంలో ఒక ప్రాంతాన్ని షాజహాన్ కేటాయించారు. దానినే 'తాజ్ గంజ్ ' అని పిలిచేవారు. తాజ్ నిర్మాణం పూర్తయిన తర్వాత వారు అక్కడే నివాసం ఏర్పరచుకున్నారు. ఇప్పటికీ వారి వారసులు అక్కడే నివసిస్తున్నారు. తమ తాత ముత్తాతల నాటి నిర్మాణ కళనే ఇప్పటికీ వారు కాపాడుతూ వస్తున్నారు. అయితే షాజహాన్ తాజ్ మహల్ కార్మికుల చేతులు నరికించారు అనే కట్టుకథ 1960ల ప్రాంతంలో మొదలైంది. తాజ్ మహల్ లాంటి నిర్మాణం మరొకటి కట్టొద్దని ఆ కార్మికులతో షాజహాన్ ఒక కాంట్రాక్ట్ చేసుకుని వారి జీవితానికి సరిపడా డబ్బు ఇచ్చాడని.. తర్వాత కాలంలో ఆ నిబంధన ఆధారంగా చేసుకుని ఈ కట్టు కథ పుట్టుకొచ్చింది అనేది చరిత్రకారుల అంచనా.
Also Read: భారత రత్న నుంచి శౌర్యచక్ర వరకు దేశంలో అత్యున్నత పురస్కారాలు ఎవరికి ఎప్పుడు ఎందుకు ఇస్తారు?