Republic Day 2025 : భారత రత్న నుంచి శౌర్యచక్ర వరకు దేశంలో అత్యున్నత పురస్కారాలు ఎవరికి ఎప్పుడు ఎందుకు ఇస్తారు?

Republic Day 2025 : భారత రత్న నుంచి శౌర్యచక్ర వరకు దేశంలో చాలా అవార్డులు కేంద్రం ప్రకటిస్తుంది. ఇంతకీ ఈ అవార్డులు ఎన్ని రకాలు.. ఇవి ఎవరికి ఇస్తారు వీటి మధ్య ఉన్న తేడా ఏంటీ?

Continues below advertisement

Republic Day 2025 : దేశంలో వివిధ రంగాల్లో చేసిన సేవలకు గానూ కేంద్రం కొన్ని అవార్డులు ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. గౌరవ సూచకంగా అందించే ఈ అవార్డుల్లో ముఖ్యంగా రెండు రకాలుంటాయి. అందులో ఒకటి పౌర పురస్కారాలు. వీటినే సివిలియన్ అవార్డ్స్(Civilian Awards) అంటారు. ఇవి దేశ పౌరులు పలు రంగాల్లో చేసిన సేవలు, విజయాలకు అందిస్తారు. మరొకటి సైనిక పురస్కారాలు. వీటిని గ్యాలంట్రీ అవార్డ్స్(Gallantry Awards) అంటారు. ఈ అవార్డ్స్ ను దళాలలో సిబ్బంది ధైర్య సాహసాలకు అందిస్తారు. పౌర పురస్కారాల్లో ప్రధానంగా 4 రకాల అవార్డ్స్ ఉంటాయి. అవి భారత రత్న, పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ, ఇక సైనిక పురస్కారాల విషయానికొస్తే స్వాతంత్ర్యం తర్వాత ఉనికిలోకి వచ్చిన తర్వాత పరమవీర చక్ర, మహావీర చక్ర, వీరచక్రను ప్రారంభించారు. ఆ తర్వాత 1952లో అశోక్ చక్ర, కీర్తిచక్ర, శౌర్యచక్రను ప్రవేశపెట్టారు. ఈ అవార్డులను గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర్య దినోత్సవరం సందర్భంగా సంవత్సరానికి రెండుసార్లు ప్రదానం చేస్తారు. 

Continues below advertisement

భారతరత్న(Bharat Ratna)

భారతదేశ అత్యున్నత పురస్కారంగా పేరొందిన భారతరత్న అవార్డ్ ను సైన్స్, సాహిత్యం, కళలు, ప్రజా సేవ వంటి రంగాలలో అత్యున్నత కృషి చేసిందుకు అందిస్తారు. 2013లో ఈ అవార్డు కేటగిరీలో క్రీడలను కూడా చేర్చడం చెప్పుకోదగిన విషయం. ఈ పురస్కారాన్ని 1954లో ప్రారంభించగా.. మొదటిసారి సర్వేపల్లి రాధాకృష్ణన్, చక్రవర్తుల రాజగోపాలచారి, డాక్టర్ సీవీ రామన్ అందుకున్నారు. ఈ అవార్డు పీపల్ లీఫ్ ఆకారంలో కాంస్య రంగులో ఉంటుంది. మధ్యలో సూర్యుని చిహ్నం, కింది భాగంలో దేవనాగరి లిపిలో భారతరత్న పదం ఉంటుంది. అవార్డ్ వెనుక భాగంలో మూడు సింహాల గుర్తును చూడొచ్చు. ఈ అవార్డు గ్రహీతకు రాష్ట్రపతి సంతకం చేసిన సర్టిఫికేట్ తో పాటు పతకాన్ని ప్రదానం చేస్తారు. 

పద్మవిభూషణ్(Padma Vibhushan)

పద్మవిభూషణ్ అనేది దేశంలో ఆయా రంగాల్లో విశేషమైన సేవలందించినందుకు గానూ ఇచ్చే రెండో అత్యున్నత పౌర పురస్కారం. ఈ పురస్కారాన్ని 1954 జనవరి 2న ప్రారంభించారు. దీన్ని సాహిత్యం, కళలు, సైన్స్ వంటి రంగాల్లో విశేష విజయాలు సాధించిన వారికి ప్రదానం చేస్తారు. పద్మ విభూషణ్ వృత్తాకారంలో, మధ్యలో తామర పూల రెక్కలను పోలిన డిజైన్ తో ఉంటుంది. 

పద్మభూషణ్ (Padma Bhushan)

దేశంలో మూడో అత్యున్నత పురస్కారం పద్మభూషణ్. దీన్ని వైద్యులు, శాస్త్రవేత్తలతో సహా ప్రభుత్వ ఉద్యోగులు చేసిన సేవలకు అందిస్తారు. అయితే దీన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేసే వారు పొందలేరు. ఇది కూడా పద్మవిభూషణ్ లాగే ఉంటుంది. కానీ దీనిపై కొంచెం బంగారు పూతలా కనిపిస్తుంది.

పద్మశ్రీ (Padma Shri)

ఈ పురస్కారాన్ని 1954లో ప్రారంభించగా.. కళలు, విద్య, పరిశ్రమలు, సాహిత్యం, శాస్త్రం, క్రీడలు వంటి పలు రంగాల్లో సేవలందించిన వారికి ప్రదానం చేస్తారు. ఇది దేశంలో 4వ అత్యున్నత పౌర పురస్కారంగా పేరొందింది. మొదటిసారి ఈ అవార్డును 18 మంది అందుకున్నారు.  

దేశంలో అందించే అత్యున్నత పురస్కారాల మాదిరిగా కాకుండా పద్మ పురస్కారాల గ్రహీతలకు నగదు అలవెన్సులు, ప్రయోజనాలు లేదా రైలు/విమాన ప్రయాణంలో ప్రత్యేక రాయితీలు ఉండవు. ఇక భద్రతా దళాల్లో ధైర్యసాహసాలు ప్రదర్శించే వారి కోసం అందించే శౌర్య పురస్కారాల్లో 6 రకాలు అవార్డ్స్ ఉంటాయి.

పరమవీర చక్ర (Param Vir Chakra)

త్రివిధ దళాల్లో పనిచేసే సైనికులకు ఇచ్చే అత్యున్నత సైనిక పురస్కారాల్లో మొదటిది పరమ వీరచక్ర. ఈ పురస్కారాన్ని 1950, జనవరి 26 (1947, ఆగస్టు 15 నుంచి అమల్లో తెస్తూ చట్టం చేశారు)న ప్రారంభించారు. యుద్దం సమయంలో సైనికులు ప్రదర్శించే ధైర్య సాహసాలకు గుర్తుగా ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ఈ పురస్కారం అమెరికాకు చెందిన మెడల్ ఆఫ్ ఆనర్, బ్రిటన్‌కు చెందిన విక్టోరియా క్రాస్‌కు సమానం. దీన్ని "వీల్ ఆఫ్ ది అల్టిమేట్ బ్రేవ్" అని కూడా పిలుస్తారు.

మహావీర్ చక్ర (Mahavir Chakra)

ఇది రెండవ అత్యున్నత సైనిక పురస్కారం మహావీర్ చక్ర. భూమిపై, సముద్రంలో లేదా గాలిలో శత్రువులకు ఎదురొడ్డి పోరాడిన సైనికులకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు.

వీర చక్ర (Veer Chakra)

సైనిక పురస్కారాలలో ఇది మూడవ అత్యున్నత సైనిక పురస్కారం. యుద్దభూమిలో శత్రువలకు ఎదురు నిలిచి, ధైర్యసాహసాలు ప్రదర్శించినందుకు దీన్ని అందిస్తారు.

అశోక చక్ర (Ashoka Chakra)

యుద్ధభూమిలో లేనప్పటికీ ధైర్యసాహసాలు ప్రదర్శించి పరాక్రమం చూపించిన లేదా దేశం కోసం ప్రాణాలర్పించిన సైనిక సిబ్బందికి ఈ అవార్డు అందిస్తారు.

Also Read: ఆండ్రాయిడ్ ఫోన్ కు ఓ రేటు.. ఐఫోన్ కు మరొకటి.. ఉబెర్, ఓలాకు కేంద్రం నోటీసులు

కీర్తి చక్ర (Kirti Chakra)

ఈ అవార్డును యుద్ధ రంగానికి దూరంగా ఉన్న శౌర్యం, సాహసోపేతమైన చర్య లేదా ఆత్మబలి దానం చేసినందుకు ప్రదానం చేస్తారు. దీన్ని పౌరులు, సైనిక సిబ్బందికి అందిస్తారు. 1967కి ముందు, ఈ అవార్డును అశోక చక్ర (క్లాస్ II) అని పిలిచేవారు.

శౌర్య చక్ర

1967కి ముందు ఈ అవార్డును  అశోక చక్ర (క్లాస్ II) అని పిలిచేవారు.  ధైర్యసాహసాలు, సాహసోపేత పనుల్లో భాగమైనందుకు దీన్ని అందిస్తారు.

Also Read : Republic Day 2025 : ఈ ఏడాది 76వ రిపబ్లిక్ డేనా? లేక 77వ సెలబ్రేషనా? అసలు గణతంత్ర దినోత్సవాన్ని ఎందుకు చేసుకుంటామో తెలుసా?

Continues below advertisement