Tatkal Tickets Timing: గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో తత్కాల్ రైల్వే టికెట్ల బుకింగ్ టైమింగ్స్ మార్చారంటూ హోరెత్తిస్తున్న ప్రచారంపై రైల్వే శాఖ క్లారిటీ ఇచ్చింది. ఆ ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని తత్కాల్ టికెట్లు ట్రైన్ బయలుదేరడానికి ముందు రోజు మాత్రమే తీసుకోవాలని చెప్పింది. ఏసీ టికెట్లు ఉదయం 10 గంటల నుంచి నాన్ -ఏసీ టిక్కెట్లు ఉదయం 11:00 నుంచి అందుబాటులో ఉంటాయని ఆ టైమింగ్స్ ఏమీ మారలేదు అంటూ స్పష్టత ఇచ్చింది.

జరిగిన ఫేక్ ప్రచారం ఇదే రైల్వే తత్కాల్ టికెట్స్ బుకింగ్ టైమింగ్స్ ఈనెల 15 నుంచి మారిపోతున్నాయని ఏసీ క్లాస్ టికెట్లు ఉదయం 10 గంటలకు బదులుగా 11 గంటలకు, నాన్-ఏసీ టికెట్లు ఉదయం 11 గంటలకు బదులుగా 12 గంటలకు ఒకరోజు ముందుగా తీసుకోవచ్చు అంటూ ఒక ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. చాలామంది దానిని నిజమే అనుకుని వాట్సప్ ఫార్వార్డ్లు చేసుకున్నారు. కానీ ఆ వార్తలో ఎలాంటి నిజం లేదని కేంద్రం స్పష్టత ఇచ్చింది.

తాత్కాల్ టికెట్ల టైమింగ్స్‌  ఏంటీ?

తత్కాల్ పథకం ద్వారా టికెట్లు పొందే సౌకర్యాన్ని 1997లో ప్రవేశపెట్టింది రైల్వే శాఖ. ప్రయాణతేదీకి ఒక్క రోజు ముందుగానే టికెట్‌ బుక్ చేసుకోవచ్చు. స్లీపర్ క్లాస్, ఏసీ, ఎగ్జిక్యూటివ్ అన్ని బోగీల టికెట్లు పొందవచ్చు. ఏసీ క్లాస్ టికెట్లు ఉదయం పది గంటలకు బుకింగ్స్ ఓపెన్ అవుతాయి. నాన్‌ ఏసీ క్లాస్ టికెట్లు ఉదయం 11 గంటలకు బుకింగ్స్ ఓపెన్ అవుతాయి.  తత్కాల్ టికెట్ బుకింగ్ ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ ద్వారా లేదా నేరుగా రైల్వే స్టేషన్‌కు వెళ్లి బుక్ చేసుకోవచ్చు. ఒక పీఎన్‌ఆర్‌పై గరిష్టంగా నలుగురుకి మాత్రమే టికెట్లు మాత్రమే బుక్ అవుతాయి. 

తత్కాల్‌లో బుక్ చేసుకున్న టికెట్లు రద్దు చేసుకోవచ్చు కానీ, డబ్బులు మాత్రం వాపస్ రావు. వెయిటింగ్ లిస్ట్‌లో ఉండి టికెట్‌ కన్ఫామ్‌ కాకుంటే ఆటోమెటిక్‌గా క్యాన్సిల్ అవుతాయి. డబ్బులు కూడా వాపస్ వచ్చేస్తాయి.  తత్కాల్‌ టికెట్ల విషయంలో ఏ రాయితీలు వర్తించవు.