Claim: కన్న తండ్రి కాళ్ళ మీద పడి ప్రాధేయపడినా వినకుండా ప్రియుడితో వెళ్లిపోతున్న కూతురిని చూపిస్తున్న వీడియో.
Fact: ఈ క్లెయిమ్ తప్పు. ఈ వీడియో కల్పితం, ఒక యూట్యూబ్ ధారావాహికలోని సన్నివేశం.
కన్న కూతురు తాను ప్రేమించిన యువకుడితో వెళ్లిపోతుంటే వద్దని ప్రాధేయపడుతున్న తండ్రిని చూపిస్తున్న ఓ వీడియో గత రెండు, మూడు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో యువతీ, యువకుడు కలిసి వెళ్తుంటే ఒక వ్యక్తి 'అమ్మ,' అమ్మ' అంటూ వెనకాల నడుస్తున్నట్లు కనిపిస్తుంది. ఆ వ్యక్తి వారి కాళ్ల మీద పడినా ప్రయోజనం లేకపోయింది.
కూతురు తన జీవితంలో నుండి తండ్రిని దూరంగా ఉండమని అడుగుతోంది. ప్రియుడు తాను గత నాలుగు సంవత్సరాలుగా ఆమెను ప్రేమిస్తున్నానని, ఆమెను వదిలి వెళ్ళలేనని ఆ తండ్రికి చెబుతున్నట్లు వినిపిస్తోంది. దీనికి ప్రతిస్పందనగా, తండ్రి తన కుమార్తె కోసం నిర్ణయం తీసుకునే హక్కు తనకుందని, ప్రియుడి ఆర్థిక స్థిరత్వం గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఈ సంభాషణ తమిళంలో జరుగుతోంది.
ఈ వీడియో షేర్ చేస్తూ శీర్షికలో ఈ విధంగా రాశారు, "పరుగు సినిమాలో దృశ్యం.. తమిళనాడు లో ప్రత్యక్షం! కన్న కూతురు ప్రేమించిన యువకుడితో వెళ్లిపోతుంటే వెళ్ళొదని ప్రాధేయ పడుతున్న తండ్రి.. విడియో వైరల్" (ఆర్కైవ్)
ఇదే క్లెయిమ్ ఉన్న మరో పోస్ట్ ఇక్కడ చూడవచ్చు. (ఆర్కైవ్)
ఈ పోస్ట్‌లో "నాకు తమిళం రాదు. అంత ప్రాధేయపడే బదులు పెళ్లి చేస్తానంటే ఆగిపోతుంది కదా?" అని ఒకరు అన్నారు. "కన్న తండ్రి అమ్మ! అమ్మ! అని ఆర్తిగా పిలుస్తూ కాళ్లు పట్టుకుని బ్రతిమాలు కుంటున్నా కనికరం లేదు దరిద్రపు కూతురికి," అని ఇంకొకరు కామెంట్ చేశారు.
Fact Check
న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్ తప్పు అని నిర్ధారించింది. వైరల్ వీడియో ఒక కల్పిత స్క్రిప్ట్ ఆధారంగా చేయబడింది. ఇది నిజ జీవిత సంఘటనను చూపించడం లేదు.
వైరల్ వీడియోలో 'Sai Vijay' అని లోగో కనిపిస్తుంది. అలాగే వీడియోలో జరిగిన సంఘటనలు నాటకీయంగా అనిపిస్తున్నాయి. కాబట్టి ఈ వీడియోలో కనిపిస్తున్న విషయాలు అసలు నిజంగా జరిగాయా అనే సందేహం కలుగజేశాయి.
వైరల్ వీడియో కీ ఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా పరిశీలించగా, యూట్యూబ్‌లో అప్లోడ్ చేసిన వీడియో ఒకటి దొరికింది. "దయచేసి నాకు కూడా సహాయం చేయండి నాన్న" అనే శీర్షికతో 2025 మార్చి 20న అప్లోడ్ చేయబడినట్లు గుర్తించం. ఈ వీడియోను అప్లోడ్ చేసిన ఛానల్ పేరు 'SAIVIJAYOFFICIAL.'
ఇదే ఛానెల్లో కనిపిస్తున్న మరికొన్ని షార్ట్స్ పరిశీలిస్తే, వైరల్ వీడియోలో కనిపిస్తున్న జంట పెళ్లి చేసుకున్నట్టు, అంతక ముందే తండ్రితో వాగ్వివాదం జరుగుతున్నట్టు మరికొన్ని వీడియోలు కనిపించాయి.
ఈ ఛానల్లో ఇటీవల షేర్ చేసిన వీడియోల్లో "ఆ తండ్రి కాళ్ళపై పడి ఏడ్చాడు. పెళ్లి చేసుకోని స్త్రీ | పార్ట్-7 | రన్నింగ్ కపుల్ | సాయివిజయ్" అనే శీర్షికతో 13 నిమిషాల నివిడి ఉన్న వీడియో దొరికింది. ఈ వీడియోలో 10:16 నిమిషాల మార్కు వద్ద వైరల్ వీడియో కనిపించింది. ఈ వీడియో కల్పితమని తేలింది.
"ఈ వీడియో మీకు నచ్చితే Like కొట్టండి... ఈ వీడియో కేవలం వినోదం కోసం మాత్రమే, సంబంధిత వ్యక్తుల అనుమతితో తయారు చేయబడింది/అప్‌లోడ్ చేయబడింది," అని వీడియో వివరణలో రాశారు. కాబట్టి వైరల్ అవుతున్న వీడియో కల్పితమని, 'పారిపోతున్న జంట' అనే యూట్యూబ్ ధారావాహికలో భాగం అని ధృవీకరించబడింది.
హిందూ వ్యక్తిని ఇఫ్తార్ విందు నుండి బయటకు పంపమని ముస్లింలు కోరారు, రోడ్డుమీద వెళ్తున్న శారీరక వైకల్యం ఉన్న ముస్లిం వ్యక్తిని వేధించారు అని చూపిస్తున్న స్క్రిప్ట్ చేయబడిన వీడియోల గురించి గతంలో న్యూస్‌మీటర్ రాసింది. అయితే ఈ వీడియోలు కల్పితం అని తెలియజేయకుండా షేర్ చేయడం వల్ల, నిజంగా జరిగిన సంఘటనలుగా వైరల్ అవుతూ ఉంటాయి. వైరల్ అవుతున్న వీడియో కూడా కల్పితమే అని న్యూస్‌మీటర్ నిర్ధారించింది.
Claim Review: కన్న తండ్రి కాళ్ళ మీద పడి ప్రాధేయపడినా వినకుండా ప్రియుడితో వెళ్లిపోతున్న కూతురు అని వీడియో వైరల్ అయింది.
Claim Fact Check: False
Fact: ఈ క్లెయిమ్ తప్పు. ఈ వీడియో కల్పితం, ఒక యూట్యూబ్ సిరీస్‌లోని ఓ ఎపిసోడ్ సన్నివేశం అది.
This story was originally published by Newsmeter as part of the Shakti Collective. Except for the headline/excerpt/opening introduction, this story has not been edited by ABP DESAM staff.