నటుడుగా సక్సెస్ సాధించి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన్ను ఫ్యాన్స్ దేవుడిలా చూస్తారు. డిప్యూటీ సీఎం అయ్యాక ఆయన చేసే ప్రతి చిన్న పని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ ‘అరకు కాఫీ’ అని రాసిఉన్న టీషర్ట్ ధరించి, కాఫీ కప్ పట్టుకుని ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఒక ఫేస్‌బుక్ యూజర్ ఈ ఫొటోను షేర్ చేస్తూ, “ఒక్క యాడ్ చేస్తే కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. కానీ వ్యవస్థ బాగుంటే అన్ని బాగుంటాయ్ అని.. ఒక్కరోజులో అరకు కాఫీకి ఎప్పుడు రానంతగా పబ్లిసిటీ వస్తుంది” అని పవన్ కళ్యాణ్ ఫొటోను ఉద్దేశించి క్యాప్షన్ ఇచ్చారు. (Archive) . అలాంటి మరికొన్ని పోస్టులు ఇక్కడ, ఇక్కడ ,ఇంకా ఇక్కడ మీరు చూడవచ్చు. (Archive link1, Archive link2, Archive link3)
ఫ్యాక్ట్ చెక్
ఈ క్లెయిమ్ తప్పు అని న్యూస్‌మీటర్ నిర్ధారించింది. ఈ ఫొటోను AI సాయంతో తయారు చేశారని గుర్తించారు. ఈ ఫొటో పోస్టుకు సంబంధించిన కీవర్డ్స్‌ను ఉపయోగించి పవన్ కళ్యాణ్ అరకు కాఫీకి ప్రచారం చేస్తున్నట్లు చూపించే వార్తలను సెర్చ్ చేయగా, అందుకు సంబంధించిన సమాచారం దొరకలేదు.

వైరల్ ఫొటోను జాగ్రత్తగా పరిశీలించగా, AI- ఫొటోలకు సాధారణంగా కొన్ని లోపాలు కనిపించాయి. ఎడమ చేతి, కాఫీ కప్ హ్యాండిల్ కలయిక అంత సహజంగా అనిపించడం లేదు. అలాగే కప్ పట్టుకున్న తీరు గమనిస్తే కొంచెం తేడాగా అనిపించింది. ఇంకా, ఫొటోలో కుడివైపు దిగువన ‘గ్రోక్’ అనే వాటర్‌మార్క్, లోగో కనిపించాయి. ‘గ్రోక్ ఇమేజ్ జనరేటర్’ అనే AI టూల్ మనం ఇచ్చే సమాచారాన్ని ఇన్‌పుట్‌గా తీసుకుని ఫొటోలు, వీడియో తయారుచేసేందుకు ప్రత్యేకంగా రూపొందించారు. ఈ వైరల్ ఫొటోను AI డిటెక్షన్ టూల్ Hive Moderation ద్వారా విశ్లేషించగా, 98.2 శాతం AI-జనరేట్ చేసిన ఫొటోగా నిర్ధారణ అయింది.
2024 అక్టోబర్ 9న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారిక సోషల్ మీడియా ఖాతా లోషేర్ చేసిన పోస్టును న్యూస్‌మీటర్ ఫ్యాక్ట్ చెక్ టీమ్ గుర్తించింది. ఆ పోస్ట్‌లో పవన్ కల్యాణ్ తన కార్యాలయంలో గిరిజన సహకార సంఘం నిర్వహించిన ప్రదర్శనను సందర్శించినట్లు తెలిపారు. ఈ ప్రదర్శనలో కరకాయలు, తేనె, కాఫీ బీన్స్, కుంకుడు కాయలు, నన్నారి వంటి 50కి పైగా గిరిజన ఉత్పత్తులను ప్రదర్శించారు.
ప్రదర్శనలో పవన్ కళ్యాణ్ స్టాళ్లను పరిశీలిస్తున్న ఫోటోలు ఆ పోస్ట్‌లో ఉన్నాయి. ఆ ఫొటోలో ఒకదానిలో పవన్ కళ్యాణ్ అరకు కాఫీ ప్యాకెట్‌ను పట్టుకుని ఉన్నారు. కానీ, అరకు కాఫీపై ఎలాంటి ప్రత్యేక ప్రచార కార్యక్రమం లేదా వైరల్ ఫొటోలో ఉన్న టీ షర్ట్ గురించి సమాచారం కనిపించలేదు.
ఇక డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారిక సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించగా, వైరల్ క్లెయిమ్‌కు మద్దతు ఇస్తూ ఎలాంటి పోస్టులు లేదా ఫొటోలు వీరికి లభించలేదు. కనుక పవన్ కల్యాణ్ అరకు కాఫీకి ప్రచారం చేస్తున్నారని పేర్కొన్న వైరల్ ఫొటో AI సాయంతో క్రియేట్ చేసిన ఫొటో అని నిర్ధారణ అయింది.
Claim Review: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ‘అరకు కాఫీ’ ప్రమోషన్ చేస్తున్నారని ఫోటో వైరల్.
Fact: ఈ క్లెయిమ్ తప్పు. పవన్ కళ్యాణ్ అరకు కాఫీ అనే టీషర్ట్ ధరించలేదు. ఎలాంటి ప్రమోషన్లు చేయలేదు. ఆ ఫొటోను AI ద్వారా క్రియేట్ చేశారు.
This story was originally published by Newsmeter as part of the Shakti Collective. Except for the headline/excerpt/opening introduction, this story has not been edited by ABP DESAM staff.