టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ రీసెంట్ గా నటిస్తోన్న సినిమా ‘ఖుషి’. ఈ సినిమా ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ పూర్తి చేసుకుంది. లవ్ అండ్ రొమాంటిక్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో టాలీవుడ్ బ్యూటీ సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందా అని గత కొన్ని వారాలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇటీవల సమంత అనారోగ్యానికి గురవడంతో సినిమా షూటింగ్ కూ బ్రేక్ పడింది. దీంతో ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుంది అనేది ప్రశ్నార్థకంగా మారింది. సమంత మళ్లీ ఎప్పుడు షూటింగ్ లో పాల్గొంటుందో క్లారిటీ లేకపోవడంతో విజయ్ పునరాలోచనలో పడ్డాడట. ఈ సినిమా పూర్తవ్వకముందే తరువాత ప్రాజెక్టు ను మొదలు పెట్టాలని చూస్తున్నాడట రౌడీ హీరో. 


‘లైగర్’ సినిమాతో విజయ్ దేవరకొండకు ఊహించని షాక్ తగిలింది. ఈ సినిమాను భారీ స్థాయిలో ప్రచారం కూడా చేశారు. కానీ ప్రచారానికి సినిమాకు అసలు పొంతన లేకపోడంతో ‘లైగర్’ బాక్స్ ఆఫీసు వద్ద పత్తా లేకుండా పోయింది. దానికి తోడు సినిమా ప్రమోషన్స్ లో విజయ్ తీరు పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ కూడా జరిగింది. ఇవన్నీ ‘లైగర్’ సినిమా వసూళ్ల పై ప్రభావం చూపడంతో మూవీ డిజాస్టర్ గా మిగిలింది. దీంతో దర్శకుడు పూరీ జగన్నాథ్ తో పాటు విజయ్ కూడా కొన్నాళ్లు అజ్ఞాతం లోకి వెళ్లిపోయారు. అయితే ఇప్పుడు మళ్లీ విజయ్ ఫామ్ లోకి రావాలని తెగ ప్రయత్నిస్తున్నాడట. వెంటనే ఓ హిట్ కొట్టాలని చూస్తున్నాడని సమాచారం.


అందుకే ఇటీవల మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కూడా చర్చించినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ ఇప్పుడు మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు. ఆ సినిమా పూర్తయి, విజయ్  సినిమాపై క్లారిటీ రావడానికి  చాలా సమయం పడుతుంది. గతంలో విజయ్ దర్మకుడు గౌతమ్ తిన్ననూరి తో ఓ సినిమా చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. అయితే మళ్లీ ఇప్పుడు విజయ్ కు అన్ని విధాల గ్యాప్ రావడంతో గౌతమ్ తో సినిమాను పట్టాలెక్కించాలని చూస్తున్నాడట.




గౌతమ్ తిన్ననూరి తన మొదటి సినిమా ‘మళ్లీ రావా’తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సినిమా తర్వాత హీరో నాని హీరోగా, శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్ గా ‘జెర్సీ’ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా 2019లో విడుదలై భారీ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టడమే కాకుండా ఆ ఏడాది బిగ్గెస్ట్ హిట్ లలో ఒకటిగా నిలిచింది. దీంతో గౌతమ్ కు విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. ఆ సినిమాల తర్వాత గౌతమ్ నుంచి వస్తోన్న సినిమా కావడంతో  ఈ మూవీ పై భారీ అంచనాలే ఉన్నాయి. 


Read Also: బాలీవుడ్ సినిమాల పతనానికి కారణం వాళ్లే, దర్శకుడు రాజమౌళి సంచనల వ్యాఖ్యలు