AP News: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పులను వేగంగా విభజించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21లలో పొందు పరిచిన హక్కులతో పాటు విభజన అనంతరం తమకు దక్కాల్సిన ప్రయోజనాలను రక్షించాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరింది. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకు సమానంగా, న్యాయమైన పద్ధతిలో వేగంగా ఆస్తులు, అప్పులను విభజించాలని పిటిషన్ లో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ విభజన హక్కు చట్టం - 2014 ప్రకారం రాష్ట్రం విడిపోయి ఎనిమిది ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆస్తుల విభజన ప్రారంభం కాలేదు. సమస్యను వేగంగా పరిష్కరించాలని పదే పదే కోరుతున్నా ప్రయోజనం లేకుండా పోయిందని తెలిపింది. షెడ్యూల్-9లో పేర్కొన్న 91 సంస్థలు, షెడ్యూల్-10లో చెప్పిన 142 సంస్థలతో పాటు చట్టంలో లేని 12 సంస్థల్లో ఏ ఒక్కదాన్నీ రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయలేదని, ఈ కారణంగా తెలంగాణకే ప్రయోజనం కల్గుతుందని రిట్ పిటషన్ లో వివరించింది. అయితే వీటి విలువ రూ.1,42,601 కోట్ల మేరకు ఉంటుందని స్పష్టం చేసింది.
ఎక్కువ శాతం ఆస్తులన్నీ తెలంగాణలో ఉన్నాయి...!
ఆస్తుల్లో అత్యధికంగా ఒకప్పటి సమైక్య రాష్ట్ర రాజధాని, ప్రస్తుత తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్ లోనే ఉన్నాయి. రాజధాని కచ్చితంగా అభివృద్ధి చేయాలన్న కారణంగా.. హైదరాబాద్ తో పాటు దాని చుట్టు పక్కల ప్రాంతాలు చాలా వరకు అభివృద్ధి చెందాయి. ఉమ్మడి రాష్ట్రంలోని నిధులతో ప్రజా సంక్షేమ, మౌలిక వసతుల కల్పన కార్యక్రమాలు పూర్తిగా అక్కడి నుంచే అమలు అయ్యాయి. ఫలితంగా అది ఆర్థిక పవన్ హౌజ్ గా మారింది. షెడ్యూల్-9లో పేర్కొన్న సంస్థల ప్రధాన కార్యాలయాల విలువ దాదాపు రూ.24,018.53 కోట్లు ఉంటుంది. వీటిలో రూ.22,556.45 కోట్ల విలువైనవి తెలంగాణలోనే ఉన్నాయి. షెడ్యూల్-10లో పేర్కొన్న ఆస్తుల విలువ రూ.34,642.77 కోట్లు కాగా... అందులో రూ.30,530.86 కోట్ల విలువైన ఆస్తులు తెలంగాణలో ఉన్నాయని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.
ఆస్తులు, అప్పుల విభజన త్వరగా చేయండ: ఏపీ సర్కారు
ఈ రెండు షెడ్యూళ్లతో పాటు చట్టంలో చూపని 12 సంస్థల ఆస్తుల విలువ రూ.1,759 కోట్ల వరకు ఉంటుంది. అవి కూడా తెలంగాణలోనే ఉన్నాయని పేర్కంది. ఇప్పటికీ వీటి విభజన జరగని కారణంగా ఏపీ ప్రాథమిక, రాజ్యాంగ హక్కులను భంగం కల్గుతోందని ఏపీ సర్కారు పిటషన్ లో వివరించింది. ఉద్యోగ విమరణ చేసిన చాలా మందికి విమరణ ప్రయోజనాలు దక్కడం లేదని తెలిపింది. ప్రభుత్వ రోజు వారీ పనుల కోసం అవసరమైన ఈ సంస్థలను విభజంచకపోవడంతో సర్కారు పని తీరు బలహీన పడుతోంది. అది ప్రజలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతోంది. అందువల్ల ఆస్తుల విభజనలో తెలంగాణ ప్రదర్శిస్తున్న అలసత్వాన్ని ప్రజల ప్రాథమిక హక్కుల ఉల్లంఘనగా ప్రకటించడంతో పాటు, ఆస్తుల విభజనలను వేగంగా చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం తెలిపింది.