ఏడాది దర్శకుడు రాజమౌళి బాగా కలిసి వచ్చింది. ఆయన కెరీర్ లోనే 2022 స్పెషల్ గా చెప్పుకోవచ్చు. ఆయన తెరకెక్కించిన ‘RRR’ చిత్రం ఎన్నో సంచలనాలను సృష్టించింది. అనేక అవార్డులను అందుకుంది. గోల్డెన్ గ్లోబ్స్ నామినేషన్లు, ఆస్కార్స్ 2023 సందడితో పశ్చిమ దేశాలలో ప్రశంసలు అందుకుంటోంది. మరోవైపు బాలీవుడ్ సినిమాలు పాన్ ఇండియా మూవీస్ ముందు చతికిలపడ్డాయి. ‘భూల్ భూలయ్యా-2’, ‘ది కాశ్మీర్ ఫైల్స్’, ‘గంగూబాయి కతియావాడి’, ‘దృశ్యం 2’, ‘బ్రహ్మాస్త్ర’ వంటి కొన్ని బాలీవుడ్ సినిమాలు మినహా మిగతా సినిమాలేవీ పెద్దగా సక్సెస్ కాలేదు. ఆశించిన స్థాయిలో బిజినెస్ చేయలేదు. 


బాలీవుడ్ సినిమాలు ఎందుకు సక్సెస్ కావట్లేదంటే?


ఇదే అంశం గురించి దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ లో సినిమాలు ఎందుకు పతనం అవుతున్నాయో? వాటి వెనుకున్న కారణం ఏంటో? వివరించారు. “టాలీవుడ్ లో సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బాగా ఆడిన తర్వాత చిత్రనిర్మాతలు సంతృప్తి చెందుతారు. అయితే, బాలీవుడ్ లో పరిస్థితి వేరేలా ఉంది. కార్పొరేట్లు హిందీ సినిమాల్లోకి వచ్చారు. అప్పటి నుంచి  నటీనటులు, దర్శకులకు కంపెనీలు అధికంగా రెమ్యునరేషన్ ఇవ్వడం మొదలు పెట్టాయి. సినిమాలు సక్సెస్ అయినా, కాకున్నా డబ్బులు వస్తున్నాయి కాబట్టి వారిలో సినిమాలు అద్భుతంగా రావాలనే కోరిక తగ్గింది. ఈ కారణంగానే బాలీవుడ్ లో సినిమాలు సక్సెస్ కాలేకపోతున్నాయి” అని రాజమౌళి తెలిపారు.


అంతర్జాతీయ స్థాయిలో ‘RRR’ సత్తా


ఇక రాజమౌళి సినిమా ‘RRR’ ప్రతిష్టాత్మక 2023 గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల్లో రెండు విభాగాల్లో నామినేట్ చేయబడింది. ఉత్తమ చిత్రం, ఆంగ్లేతర భాష విభాగంలో ఈ సినిమా తొలి నామినేషన్స్ పొందింది. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ – మోషన్ పిక్చర్ విభాగంలో 'నాటు నాటు'  పాట రెండవ నామినేషన్ దక్కించుకుంది. అటు  2023 ఆస్కార్‌ల పరిశీలన కోసం 15 కేటగిరీలలో అప్లై చేశారు. ఉత్తమ చలనచిత్రం, ఉత్తమ దర్శకుడు (S.S. రాజమౌళి), ఉత్తమ నటులు(రామ్ చరణ్‌, Jr. NTR), ఉత్తమ సహాయ నటుడు (అజయ్ దేవగన్), ఉత్తమ సహాయ నటి (ఆలియా భట్), ఉత్తమ ఒరిజినల్ సాంగ్ 'నాటు నాటు', ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే (ఎస్.ఎస్. రాజమౌళి, వి. విజయేంద్ర ప్రసాద్, సాయి మాధవ్ బుర్రా), ఉత్తమ ఒరిజినల్ స్కోర్ (M.M. కీరవాణి), ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్ (శ్రీకర్ ప్రసాద్), ఉత్తమ సౌండ్, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్, ఉత్తమ మేకప్, హెయిర్ స్టైలింగ్,  ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో నామినేషన్స్ కోసం అప్లై చేశారు.






Read Also: బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ కు మరో షాక్, పరువు నష్టం కేసు పెట్టిన నోరా ఫతేహి