బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే మనీ లాండరింగ్ కేసులో బుక్కై నానా తిప్పులు పడుతుండగా, తాజాగా మరో కేసు మెడకు చుట్టుకుంది. మరో బాలీవుడ్ నటి నోరా ఫతేహి, జాక్వెలిన్ పై పరువు నష్టం కేసు పెట్టింది. ఈ మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ కు మరో షాక్
ఆర్థిక నేరానికి పాల్పడిన సుఖేష్ చంద్రశేఖర్ పై ఈడీ మనీ లాండరింగ్ కేసు ఫైల్ చేసింది. ఈ కేసుకు సంబంధించి సుఖేష్ ను ప్రధాన నిందితుడిగా ఈడీ అధికారులు ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. ఇదే కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ను నిందితురాలిగా చేర్చారు. అనుబంధ చార్జ్ షీట్ లో ఆమె పేరును ప్రస్తావించారు. దీంతో గత కొద్ది రోజులుగా విచారణల పేరుతో పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఈడీ కేసులో సతమతం అవుతున్న ఆమెకు తాజాగా మరో షాక్ తగిలింది. మూలిగే నక్కపై తాటి పండు పడిన చందంగా ఆమెపై మరో కేసు బుక్ అయ్యింది. బాలీవుడ్ నటి నోరా ఫతేహి ఆమెపై కేసు పెట్టింది. తనకు సంబంధం లేని విషయాన్ని ఆపాదించి చెప్పడం వల్ల తన పరువు ప్రతిష్టలకు ఇబ్బంది కలిగిందని ఫిర్యాదులో పేర్కొంది.
నోరా కేసు ఎందుకు పెట్టిందంటే?
ఇంతకీ నోరా, జాక్వెలిన్ పై కేసు ఎందుకు నమోదు చేసిందంటే.. సుఖేష్ చంద్రశేఖర్ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ విచారణ కొనసాగింది. ఇందులో నిందితురాలిగా ఉన్న జాక్వెలిన్ ను కూడా విచారించారు. ఎంక్వయిరీలో భాగంగా కీలక విషయాల వెల్లడించింది. సుఖేష్ కు తనతో పాటు చాలా మంది బాలీవుడ్ నటీమణులకు సంబంధాలు ఉన్నాయని చెప్పింది. అందులో నోరా ఫతేహి చాలా ముఖ్యమైన ఫ్రెండ్ అని చెప్పింది.
జాక్వెలిన్ తో పాటు మీడియా సంస్థలపైనా కేసు
ఈడీ విచారణలో తన పేరును ప్రస్తావించడం పట్ల జాక్వెలిన్ పై నోరా తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. సంబంధం లేని కేసులో తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నట్లు మండిపడింది. జాక్వెలిన్ తో పాటు తన గురించి తప్పుడు వార్తలు ప్రసారం చేసిన పలు వార్తా చానెళ్లపై పరువు నష్టం కేసు వేసింది. కొంతమంది తనను కావాలని మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించింది. తనకు సుఖేష్ తో ఎలాంటి స్నేహం లేదని మరోసారి తేల్చి చెప్పింది. ఇప్పటికే నోరా నుంచి పోలీసులు ఫిర్యాదు తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. త్వరలో ఆమెను విచారించి, చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
జాక్వెలిన్ లాయర్ ఏమన్నారంటే?
నోరా ఫతేహి పరువు నష్టం కేసుకు సంబంధించి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ లాయర్ స్పందించారు. నోరా గురించి జాక్వెలిన్ ఎప్పుడూ కించపరిచే వ్యాఖ్యలు చేయలేదని వెల్లడించారు. ఈ కేసుపై తాము కోర్టులో పోరాడతామని చెప్పారు. ఇక సుఖేష్ కేసుకు సంబంధించి ఇప్పటికే జాక్వెలిన్ కు చెందిన రూ.7 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.
Read Also: విక్టరీ వెంకటేష్ జీవితంలోని ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?