‘స్వర్ణకమలం’లో ఛాలెంజింగ్ పాత్రతో ప్రేక్షకులను మెప్పించినా, ‘చంటి’ సినిమాతో అమాయకుడిగా అలరించినా, ‘సూర్యవంశం’లో డబుల్ రోల్ తో మెస్మరైజ్ చేసినా, ‘నువ్వు నాకు నచ్చావ్’లో నవ్వులతో ఆకట్టుకున్నా, ‘మల్లీశ్వరి’లో ఆద్యంతం పంచులు వేసినా అది ఆయనకే సాధ్యం. విజయాలకు కేరాఫ్ అడ్రస్ గా పేరు తెచ్చుకున్న ఆ కథానాయకుడే విక్టరీ వెంకటేశ్.
విక్టరీ వెంకటేశ్. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర ఆయనది. 1960 డిసెంబర్ 13న ఆయన జన్మించారు. అత్యధిక చిత్రాల నిర్మాతగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిన డి.రామానాయుడు రెండో కుమారుడే వెంకటేశ్. ఇప్పటి వరకు దాదాపు 70కి పైగా సినిమాలలో నటించారు. చక్కటి నటనకు గాను 7 నంది అవార్డులు గెలుచుకున్నారు. మూడు దశాబ్దాల ప్రస్థానంలో ఎన్నో మరుపురాని చిత్రాలు, గుర్తుండిపోయే పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు వెంకటేశ్.
వెంకటేష్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు
⦿ విక్టరీ వెంకటేష్ ప్రముఖ నిర్మాత, మూవీ మోఘల్ డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు కుమారుడు.
⦿ వెంకటేష్ U.S.A లో M.B.A చదివారు.
⦿ చదువు పూర్తయ్యాక అప్పుడప్పుడు సెలవుల కోసం ఇండియాకు వచ్చేవారు. అప్పట్లో రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో సూపర్ స్టార్ కృష్ణ సినిమాని నిర్మించాలని రామానాయుడు ప్లాన్ చేశారు. కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా కృష్ణ ఆ సినిమాను పూర్తి చేయలేదు. అప్పుడు రాఘవేంద్రరావు వెంకటేష్‌ని ఆ సినిమా చేయమని అడిగారు. అదే ‘కలియుగ పాండవులు‘ సినిమా. వెంకటేష్‌కి మొదటి సినిమాకే నంది అవార్డు వచ్చింది.
⦿ నిజానికి కలియుగ పాండవులు సమయంలో వెంకటేశ్ కు తెలుగు భాషపై అంత పట్టులేదు. చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం పైగా విదేశాల్లో ఎంబీఏ చదవడంతో తెలుగు ఆయన అంతగా మాట్లాడేవారు కాదు. అందుకే కలియుగ పాండవులు సమయంలో కొంత ఇబ్బంది పడ్డారు. కానీ ఆయన నటనకు అదేమీ అవరోధం కాలేదు. అద్భుతమైన నటనతో కలియుగ పాండవులతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు వెంకటేశ్.
⦿ ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు కుమారుడైనా ఎప్పుడూ వెంకటేశ్ మాత్రం సింపుల్ గా ఉండేవారు. ఇప్పటికీ అలానే ఉంటారు కూడా. ఎవరితోనూ ఆయనకు గొడవలు లేవు. ఇప్పటిదాకా రాలేదు. వివాదాలకు ఆయన ఎప్పుడూ దూరంగానే ఉంటారు.
⦿ మీడియాలోనూ, ఫిలిం సర్కిల్ లోనూ వెంకటేశ్ తప్ప ఆయన కుటుంబసభ్యుల హడావిడి ఉండదు. అంతగా ఆయన లోప్రొఫైల్ లో ఉంటారు.
⦿ వెంకటేష్ కు సినిమాలతో ప్రయోగాలు అంటే ఎంతో ఇష్టం. ఎన్నో సినిమాల్లో ప్రయోగాలు చేశాడు. ఇటీవలి కాలంలో ‘గురు’తో ప్రయోగం చేసి సక్సెస్ అయ్యారు.
⦿ వెంకటేష్, నీరజా దగ్గుబాటిని వివాహం చేసుకున్నారు. 25 సంవత్సరాల వయస్సులో వివాహం చేసుకున్న ఈ దంపతులకు 4 పిల్లలున్నారు. వీరిలో ముగ్గురు కుమార్తెలు కాగా, ఓ కుమారుడు ఉన్నారు.
⦿ నటుడు నాగార్జున తన సోదరి లక్ష్మిని తొలి వివాహం చేసుకున్నందున వెంకటేష్ మాజీ బావ. నటులు రానా దగ్గుబాటి, నాగచైతన్య అతడి మేనల్లుళ్ళు.
⦿ అతను సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో టాలీవుడ్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలుగు వారియర్స్ కెప్టెన్ గా ఉన్నారు.
⦿ వెంకటేశ్ కు తొలి సినిమా ‘కలియుగ పాండవులు‘తోనే నంది అవార్డ్ లభించింది. ఆతర్వాత ప్రేమ, ధర్మచక్రం, చంటి, స్వర్ణకమలం, గణేష్, కలిసుందాం రా, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే సినిమాలకు నందులను అందుకున్నారు వెంకటేశ్. ఇప్పటికే ఆయన నటప్రస్థానం నిర్విరామంగా కొనసాగుతోంది. ఈ విక్టరీ వెంకటేశ్ నట ప్రస్థానం ఇలాగే దిగ్విజయంగా కొనసాగాలని తెలుగు సినీ అభిమానులు కోరుకుంటున్నారు.
Read Also: తాతను కాబోతున్నా - ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన మెగాస్టార్!