Anantapur Crime News: ఏ పనీ చేయకూడదు. తొందరగా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చనే ఆశతో మొదలు పెట్టిన ఆటే.. వారి ఆయువు తీసింది. ఇలాంటి ఆటల వల్ల చాలా మంది అప్పుల పాలై.. వారి ప్రాణాలను తీసుకుంటూ కుటుంబ సభ్యులను అనాథలను చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనలే అనంతపురం జిల్లాలో చోటు చేసుకున్నాయి. జిల్లాలోని గుత్తికి చెందిన ఓ వ్యక్తి ప్రైవేటు ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఖర్చులు, అవసరాలు పెరగడంతో అప్పు చేశాడు. అవి సరిపోవన్నట్లు చైనాకు చెందిన ఓ రుణ యాప్ నుంచి అప్పు తీసుకున్నాడు. వాటితో ఆన్ లైన్ గేమ్ ఆడి, సుమారు 3 లక్షల రూపాయల వరకు పోగొట్టుకున్నాడు. అప్పులు ఇచ్చిన ప్రైవేటు వ్యక్తులు, రుణయాప్ నిర్వాహకుల నుంచి ఒత్తిడి పెరిగింది. వారం రోజుల క్రితం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. 


మరో యువకుడి ఆత్మహత్యాయత్నం..!


కల్యాణ దుర్గం నియోజకవర్గంలోని ఓ మండలానికి చెందిన సురేష్ అనే యువకుడు బీటెక్ పూర్తి చేసి రెండేళ్లుగా ఇంటి వద్దే ఉంటున్నాడు. ఓ ఆన్ లైన్ గేమ్ కు అలవాటు పడ్డాడు. 12 రోజుల క్రితం లక్ష రూపాయల వరకు గెలుపొందాడు. ఆదాయం ఊరించేలా ఉండడంతో తన వద్ద ఉన్న డబ్బు బెట్టింగ్ లో పెట్టాడు. ఒకే రోజు సుమారు రూ.7 లక్షలు పోగొట్టుకున్నాడు. పోగొట్టిన డబ్బు తన వద్ద దాచుకున్న రైతులకు చెందినది కావడంతో తప్పించుకుని తిరిగాడు. కుటుంబ సభ్యులు మందలించడం, నువ్వు చేసేది తప్పని చెప్పడంతో ఆత్మహత్యాయత్నం చేశాడు. 


ముందుగా అనేక లాభాలను చూపిస్తూ.. ఆశ పెడుతుంటారు. ఆపై జనం జేబులకు చిల్లు కొడుతూ.. ఇళ్లు గల్ల చేస్తున్నారు. ముఖ్యంగా యువత ఈ ఆటకు బానిసలు అవుతున్నారు. కొత్తగా ఆడే వారిని మొదట్లో కొంత సొమ్ము గెలుచుకునేలా చేసి ఆకర్షిస్తుంటాయి. ఆ తర్వాత వారు డబ్బులు పోగొట్టుకోవడం సాధారణంగా మారుతోంది. ఒక దశ దాటాక చేతిలో డబ్బు లేకపోతే అధిక వడ్డీలకు అప్పు తెచ్చి పందేలు కాస్తున్నారు. ఆన్ లైన్ జూదంలో డబ్బులు పోగొట్టుకున్న వారికి అప్పులు ఇవ్వడానికి అంతర్జాలం ద్వారానే రుణాలు ఇచ్చే యాప్ లు కూడా అందుబాటులోకి రావడం గమనార్హం. 


ఏడాదలోనే పది మంది ఆత్మహత్య..


ఆన్ లైన్ బెట్టింగ్ వ్యసనానికి బానిసై పలువురు ఆర్థికంగా చితికిపోగా.. మరికొందరు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ ఏడాదిలో పది మంది యువత, మధ్య వయస్కుల మృతికి ఆన్ లైన్ బెట్టింగ్ కారణం అని పోలీసులు చెబుతున్నారు. జిల్లాలో దొంగతనం కేసుల్లో పట్టుబడిన చోరుల్లో అధిక శాతం బెట్టింగుల్లో నష్టపోయిన వారేనని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అందుకే తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలనే ఆశను వదులుకోవాలని.. ముఖ్యంగా ఆన్ లైన్ లో బెట్టింగ్ లు, రుణాలు తోసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. బెట్టింగ్, రుణ్ యాప్ ల పేరుతో ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకెళ్లారని వివరిస్తున్నారు.