దివంగత కథానాయకుడు, డీఎండీకే పార్టీ వ్యవస్థాపకుడు 'కెప్టెన్' విజయకాంత్ (Vijayakanth) గురువారం ఉదయం కన్ను మూసిన సంగతి తెలిసిందే. ఈ రోజు (శుక్రవారం, డిసెంబర్ 29న) చెన్నైలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఐలాండ్ మైదానంలో ఆయనకు తుది వీడ్కోలు పలుకుతున్నారు. తమిళ చలన చిత్ర పరిశ్రమ ప్రముఖులు ఆయనకు నివాళి అర్పించడానికి వచ్చారు. అందులో దళపతి విజయ్ కూడా ఉన్నారు. అయితే... అనుకోని ఘటన ఆయనకు ఎదురైంది.
విజయ్ మీద చెప్పు విరిసిన ఆగంతకుడు!
విజయకాంత్ అంత్యక్రియలకు వచ్చిన విజయ్ మీద గుర్తు తెలియని వ్యక్తి ఒకరు షూ విసిరిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కారు వద్దకు విజయ్ వెళుతుండగా ఎవరో షూ విసిరారు. అది ఆయనకు వెనుక నుంచి తగిలింది. ఈ ఘటనను పలువురు ఖండిస్తున్నారు.
కెరీర్ ప్రారంభంలో విజయకాంత్‌కు ఫ్లాప్స్ వచ్చినప్పటికీ... విజయ్ తండ్రి ఎస్ఎ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన 'దూరతు ఇడి ముళక్కం', 'సత్తం ఓరు ఇరుత్తరై' సినిమాలతో బ్రేక్ అందుకున్నారు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
Also Read: డెవిల్ రివ్యూ: నందమూరి కళ్యాణ్ రామ్ సినిమా హిట్టా? ఫట్టా?
వెండితెరపై విజయకాంత్ ప్రయాణం విజయవంతంగా సాగింది. ఆయన 150కు పైగా సినిమాలు చేశారు. హీరోగా ఆయన వందో సినిమా 'కెప్టెన్ ప్రభాకరన్'. ఆ సినిమా తర్వాత నుంచి విజయకాంత్ (Vijayakanth)ను తమిళ ప్రేక్షకులు అందరూ 'కెప్టెన్ విజయకాంత్' అని పిలవడం ప్రారంభించారు. అంతకు ముందు 'పురట్చి కలైంజర్' (విప్లవ కళాకారుడు) అని పిలిచేవారు.
Also Read: బబుల్‌గమ్ రివ్యూ: రాజీవ్, సుమ కనకాల కుమారుడు రోషన్ హీరోగా పరిచయమైన సినిమా... బావుందా? సాగిందా?
ఐదు దశాబ్దాల సినీ ప్రయాణంలో విజయకాంత్ కేవలం తమిళ చిత్రాలు మాత్రమే చేశారు. ఆయన సినిమాలు తెలుగుతో పాటు హిందీలోనూ అనువాదం అయ్యాయి. ఎక్కువగా పోలీస్, దేశభక్తి కథాంశాలతో రూపొందిన సినిమాలు చేయడంతో ఆయనను విప్లవ చిత్రాల కథానాయకుడిగా, విప్లవ కళాకారుడిగా ప్రేక్షకులు చూసేవారు. విజయకాంత్ 20కు పైగా సినిమాల్లో పోలీస్ రోల్స్ చేశారు. 'ఇనిక్కుమ్ ఇలమై'తో విజయకాంత్ వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ సినిమాలో ఆయనది విలన్ రోల్.
విజయకాంత్ వారసులు ఎంత మంది?
Vijayakanth family details: విజయకాంత్ అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అళగర్ స్వామి. చిత్రసీమలోకి వచ్చిన తర్వాత తన పేరును 'విజయకాంత్'గా మార్చుకున్నారు. ఆయనకు జనవరి 31, 1990లో వివాహం అయ్యింది. ఆయన భార్య పేరు ప్రేమలత. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు.
విజయకాంత్ నటించిన ఆఖరి సినిమా 'సప్తగం'. అందులో ఆయన అతిథి పాత్రలో మెరిశారు. ఆ సినిమాతో విజయకాంత్ కుమారుడు షణ్ముగ పాండియన్ హీరోగా తమిళ సినిమా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయ్యారు. ఈ సినిమాకు విజయకాంత్, ఆయన బావ కె.ఎల్. సుధీశ నిర్మాతలు. ఆ తర్వాత 'మధుర వీరన్' అని మరో సినిమా చేశారు షణ్ముగ పాండియన్.