Nara Lokesh Comments on RGV: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) తీసిన 'వ్యూహం' (Vyuham) సినిమాపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) స్పందించారు. మంగళగిరి (Mangalagiri) పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. వ్యూహం చిత్రానికి ప్రతి వ్యూహం ఉండకూడదంటే ఎలా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా దర్శకుడు ఆర్జీవీపై సెటైర్లు వేశారు. ఎన్నికల ముందు ఈ తరహా సినిమాలు తీయడం ఓ ఫ్యాషన్ అయిపోయిందని మండిపడ్డారు. ఇలాంటి సినిమాలను సీఎం జగన్ ప్రోత్సహిస్తూ, డబ్బులు పంచుతున్నారని విమర్శించారు. 'దర్శకుడు ఆర్జీవీ తరఫున కోర్టుల్లో వాదిస్తున్నదీ వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డే. ఆ న్యాయవాదులను చూస్తేనే ఆ సినిమా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. న్యాయపరంగా మాకు ఉన్న హక్కుల కోసమే పోరాడుతున్నాం. ఆర్జీవీ నిజంగా సినిమా తీయాలనుకుంటే హూ కిల్డ్ బాబాయ్, కోడి కత్తి, ప్యాలెస్ లో జరుగుతున్న అవినీతిపై సినిమా తియ్యొచ్చు కదా.' అంటూ సలహా ఇచ్చారు.
రెడ్ బుక్ పై ఏమన్నారంటే.?
రాష్ట్రంలో చట్టాన్ని ఉల్లంఘించిన అధికారుల పేర్లు మాత్రమే రెడ్ బుక్ లో రాస్తున్నామని లోకేశ్ తెలిపారు. తప్పు చేసిన వారి గురించి మాట్లాడితే తప్పేంటని ప్రశ్నించారు.?. 'అధికారులు తప్పు చేసినా మాట్లాడకూడదా.? సీఐడీనే స్క్రిప్ట్ రాసివ్వమనండి. అదే చదువుతా. లేదా సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వాళ్లు స్క్రిప్ట్ రాసిస్తే అదే చదువుతా. కొల్లి రఘురామిరెడ్డి, పీఎస్సార్ ఆంజనేయులు వంటి వారు తప్పు చేసినట్లు అంగీకరిస్తున్నారా.? రెడ్ బుక్ లో ఎవరి పేర్లున్నాయో వారికెలా తెలుసు.?' అంటూ ప్రశ్నించారు.
వైసీపీపై విమర్శలు
రాబోయే ఎన్నికల్లో ఓడిపోయే స్థానాల్లోనే వైసీపీ, బీసీలకు సీట్లు ఇస్తోందని లోకేశ్ విమర్శించారు. వైసీపీలో తమకు గుర్తింపు లేదని స్వయంగా ఆ పార్టీ బీసీ ఎమ్మెల్యే పార్థసారథి చెప్పారని అన్నారు. మంగళగిరిలో ఓడిపోతున్నామనే తెలిసే ఇప్పుడు బీసీలకు ఇచ్చారని, గతంలో రెండుసార్లు రెడ్డిలకు ఇచ్చారని గుర్తు చేశారు. కడప ఎంపీ స్థానం, పులివెందుల సీటు బీసీలకు ఇవ్వాలని సవాల్ విసిరారు. 'చిలకలూరిపేటకు పనికి రాని మంత్రి విడదల రజనీ గుంటూరు వెస్ట్ లో ఎలా పనికొస్తారు.?. ఓ నియోజకవర్గంలో చెత్త, మరో చోట బంగారం అవుతుందా.?' అని నిలదీశారు.
జనవరి 4 నుంచి 'జయహో బీసీ'
రాష్ట్రంలో జనవరి 4 నుంచి 'జయహో బీసీ' కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు నారా లోకేశ్ (Nara Lokesh) తెలిపారు. సీఎం జగన్ (CM Jagan) బీసీల ద్రోహి అని, వైసీపీ హయాంలో బీసీలకు జరిగిన అన్యాయాలపై వారిలో చైతన్యం కల్పించేందుకే ఈ కార్యక్రమం అని చెప్పారు. 2 నెలల పాటు 'జయహో బీసీ' (Jayaho BC) కొనసాగుతుందని, తొలి విడతలో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలు, మండలాల్లో పర్యటిస్తామన్నారు. అనంతరం రాష్ట్ర స్థాయిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీసీల కోసం ప్రత్యేక మేనిఫెస్టో రూపొందిస్తామని స్పష్టం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, బటన్ నొక్కితే బీసీ సర్టిఫికెట్ అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. బీసీలకు అవసరమైన ఇన్ పుట్ సబ్సిడీ, వారికి అనుకూల విధానాలు రూపొందిస్తామన్నారు.
Also Read: Andhra News: జనవరి 4 నుంచి 'జయహో బీసీ' - బీసీల కోసం ప్రత్యేక మేనిఫెస్టో ప్రకటిస్తామన్న నారా లోకేశ్