Aadhaar Mobile Number Email ID Verification: మీ ఆధార్‌ నంబర్‌తో ఏ మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ అనుసంధానం అయివుందో మీకు తెలిస్తే, అవసరమైన సందర్భంలో ఆధార్‌ ధృవీకరణ (aadhaar authentication) చాలా సులభం అవుతుంది. ఏ మొబైల్ నంబర్‌, ఈ-మెయిల్ ఐడీతో మీ ఆధార్‌ లింక్ అయిందో మీకు తెలియకపోయినా, లేదా మరిచిపోయినా ఆధార్‌ ధృవీకరణ సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ ఇబ్బందిని తొలగించడానికి, ఆధార్‌ జారీ సంస్థ UIDAI (Unique Identification Authority of India) ఒక కొత్త సదుపాయాన్ని ప్రారంభించింది. 


చాలామంది ఆధార్ కార్డ్‌హోల్డర్లు, తమ ఆధార్‌ నంబర్‌తో ఏ మొబైల్ నంబర్, ఈ-మెయిల్‌ ఐడీ లింక్‌ అయిందో తెలీడం లేదని ఉడాయ్‌కి (UIDAI) ఫిర్యాదులు, విజ్ఞప్తులు చేస్తున్నారు. ఆధార్‌ను ధృవీకరించే OTP ఏ నంబర్‌కు, ఏ ఈ-మెయిల్‌ ఐడీకి వెళ్తుందో అర్ధం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా కొత్త సదుపాయం తీసుకొచ్చింది ఉడాయ్‌. ఈ సదుపాయంతో, ఆధార్ కార్డ్‌హోల్డర్లు తమ ఆధార్‌ ఏ మొబైల్ నంబర్‌, ఈ-మెయిల్‌ ఐడీతో లింక్ అయిందో సులభంగా తెలుసుకోవచ్చు.


మీ ఆధార్‌తో లింక్‌ అయిన మొబైల్ నంబర్‌ను ఇలా కనిపెట్టండి
మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ ధృవీకరించడానికి, UIDAI అధికారిక వెబ్‌సైట్ https://myaadhaar.uidai.gov.in లేదా mAadhaar యాప్‌ని సందర్శించాలి. దానిలో, 'Verify Email/Mobile' మీద క్లిక్ చేయాలి. ఇక్కడ, మీ ఆధార్‌ నంబర్‌ ఏ మొబైల్ నంబర్ లేదా ఈ-మెయిల్‌ ఐడీతో లింక్ అయివుందో తెలుసుకోవచ్చు. మీకు సంబంధం లేని ఇతర నంబర్‌తో ఆధార్‌ అనుసంధానమై ఉంటే దానిని సులభంగా గుర్తించొచ్చు. ఆ నంబర్‌ తీసేసి, మీ నంబర్‌ను అప్‌డేట్‌ చేయొచ్చు.


మీ మొబైల్ నంబర్‌ను ఇప్పటికే ధృవీకరించి ఉంటే, "నమోదు చేసిన మొబైల్ నంబర్ ఇప్పటికే మా రికార్డ్‌ల్లో ధృవీకరించాం" అన్న సందేశం స్క్రీన్‌ మీద కనిపిస్తుంది. ఆధార్ కోసం ఎన్‌రోల్‌మెంట్ సమయంలో ఏ మొబైల్ నంబర్ ఇచ్చారో గుర్తు లేకపోతే, https://myaadhaar.uidai.gov.in పోర్టల్‌ లేదా mAadhaar యాప్‌లోకి వెళ్లాలి. 'Verify Aadhaar' ఆప్షన్‌లోకి వెళ్లి, ఆధార్‌ నంబర్‌ను నమోదు చేయాలి. ఇప్పుడు, మీరు ఏ మొబైల్‌ నంబర్‌ ఇచ్చారో, ఆ నంబర్‌లోని చివరి మూడు అంకెలు కనిపిస్తాయి.


ఆధార్‌ వివరాలను ఉచితంగా అప్‌డేట్‌ చేసే గడువు పెంపు (Last date for free update of Aadhaar Details)
మీ ఆధార్ వివరాల్లో తప్పులుంటే వాటిని ఉచితంగా మార్చుకునే సదుపాయం ఉంది. ఆన్‌లైన్‌ పద్ధతిలో ఆధార్‌ వివరాలను ఉచితంగా మార్చుకునే గడువు డిసెంబర్ 14, 2023తో ముగిసింది. ఇప్పటికీ భారీ సంఖ్యలో ప్రజలు తమ వివరాలను అప్‌డేట్‌ చేయలేదు. దీంతో, ఉచిత అవకాశం ఉపయోగించుకోని వారి కోసం ఉడాయ్‌ కీలక నిర్ణయం తీసుకుంది, ఆ గడువును మరో 3 నెలలు పొడిగించింది. ఇప్పుడు, 2024 మార్చి 14 వరకు, మీ ఆధార్‌ కార్డ్‌ వివరాలను ఉచితంగా నవీకరించవచ్చు.


మీ ఆధార్‌లో తప్పులు ఉంటే లేదా మీ ఆధార్‌ను అప్‌డేట్‌ చేసి 10 సంవత్సరాలు అయితే కచ్చితంగా ఆధార్‌ వివరాలను నవీకరించాలి, ఇది పౌరుల బాధ్యత. మైఆధార్ పోర్టల్ https://myaadhaar.uidai.gov.in ద్వారా ఉచిత అప్‌డేషన్‌ సదుపాయాన్ని ప్రజలు ఉపయోగించుకోవచ్చు. 


ఆన్‌లైన్‌ ద్వారా ఆధార్‌ను అప్‌డేట్‌ చేయడం తెలీకపోతే, మీకు దగ్గరలోని ఆధార్‌ కేంద్రానికి వెళ్లి వివరాలు మార్చుకోవచ్చు. దీనికి కొంత ఫీజు చెల్లించాలి.


మరో ఆసక్తికర కథనం: పీపీఎఫ్ ఇన్వెస్టర్లకు ఈ ఏడాదీ నిరాశే, 2024లో రాబడి భారీగా పెరిగే ఛాన్స్‌!