Devil Movie Review
సినిమా రివ్యూ: డెవిల్!
రేటింగ్: 2.5/5
నటీనటులు: నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్తా మీనన్, మాళవికా నాయర్, సీత, 'స్వామి రారా' సత్య, అజయ్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు 
కథ, స్క్రీన్ ప్లే, మాటలు: శ్రీకాంత్ విస్సా
ఛాయాగ్రహణం: సౌందర్ రాజన్!
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్! 
నిర్మాణం, దర్శకత్వం: అభిషేక్ నామా!
విడుదల తేదీ: డిసెంబర్ 29, 2023


Devil Movie Review In Telugu: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా సినిమా 'డెవిల్'. ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్... అనేది ఉపశీర్షిక. విడుదలకు ముందు ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్ని ఆకర్షించాయి. అంచనాలు పెంచాయి. మరి, సినిమా ఎలా ఉంది? మిస్టరీ థ్రిల్లర్ మూవీ మెప్పిస్తుందా? లేదా?


కథ (Devil Movie Story): రాసపాడులో జమీందారు కుమార్తె హత్యకు గురవుతుంది. ఆ కేసును తమ ఏజెంట్ డెవిల్ (నందమూరి కళ్యాణ్ రామ్)కు అప్పగిస్తుంది బ్రిటీష్ ప్రభుత్వం! జమీందారు మేనకోడలు నైషధ (సంయుక్తా మీనన్)తో డెవిల్ ప్రేమలో పడతాడు. అదంతా దర్యాప్తులో భాగమని చెబుతాడు. 'డెవిల్'ను బ్రిటీష్ ప్రభుత్వం రాసపాడు పంపినది జమీందారు హత్య కేసు దర్యాప్తు కోసం కాదని, ఇండియాకి వస్తున్న ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్‌, ఆయన అనుచరుడు త్రివర్ణ(?)ను పట్టుకోవడం కోసమని తెలుస్తుంది. ప్రేమ నాటకం సైతం అందులో భాగమే అంటాడు డెవిల్. 


నైషధకు, నేతాజీకి సంబంధం ఏమిటి? త్రివర్ణ ఎవరు? ఈ కథలో రాజకీయ నాయకురాలు మణిమేఖల (మాళవికా నాయర్) పాత్ర ఏమిటి? ప్రేమ పేరుతో డెవిల్ చేసింది ఏమిటి? ఆ ప్రేమ నిజమా? కాదా? నేతాజీ గురించి చివరకు తెలిసింది ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.


విశ్లేషణ: గూఢచారి కథలు ఎప్పుడూ ఎవర్ గ్రీన్ ఫార్ములా! అందులోనూ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ అనేసరికి ఇంకాస్త అంచనాలు పెరిగాయి. పైగా, దర్శకుడు మారడంతో పాటు విదేశీ నటుడు సోషల్ మీడియాలో చేసిన పోస్టులు సినిమాకు ఇంకాస్త ప్రచారాన్ని తీసుకొచ్చాయి. మరి, సినిమా ఎలా ఉంది? అనేది చూస్తే...


'డెవిల్'ను యాక్షన్ థ్రిల్లర్ అనడం కంటే మిస్టరీ డ్రామాగా పేర్కొనడం మంచిది. సినిమాలో యాక్షన్ లేదని కాదు. షిప్ ఫైట్ ద్వారా హీరోని ఇంట్రడ్యూస్ చేశారు. సముద్ర తీరంలో యాక్షన్ సీక్వెన్సుతో సినిమా ముగించారు. మధ్యలో పిండారీలతో హీరో చేసే ఫైట్, బ్రిటీష్ జైలులో యాక్షన్ సీక్వెన్స్ చక్కగా డిజైన్ చేశారు. యాక్షన్ మధ్యలో కథ, క్యారెక్టర్లు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ డ్రామా ఉంది.


మర్డర్ మిస్టరీతో 'డెవిల్'ను ప్రారంభించిన దర్శక రచయితలు... ఇంటర్వెల్ వరకు ఒక క్యారెక్టర్ తర్వాత మరొక క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తూ నిడివి పెంచుకుంటూ వెళ్ళారు. మధ్యలో ప్రేమకథ కూడా అడ్డు తగిలింది. ఒక దశకు వచ్చిన తర్వాత అసలు కథ ఏమిటి? అనేది మర్చిపోయి కొసరు అంశాలతో సంతృప్తి చెందుతాం. ఇంటర్వెల్ దగ్గర సినిమాలో అసలైన క్యూరియాసిటీ, మిస్టరీ మొదలు కావడంతో సెకండాఫ్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. 


ఇంటర్వెల్ తర్వాత ట్విస్టులు, టర్నులు బావున్నాయి. సినిమా చివరి వరకు ఆ సస్పెన్స్ మైంటైన్ చేశారు. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి? అని ప్రేక్షకుడు ఆసక్తిగా చూసేలా సినిమా తీశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేపథ్యంలో, ఆయన పేరు వాడుతూ తీసిన సన్నివేశాలు బావున్నాయి. బహుశా... నేతాజీ నేపథ్యాన్ని ఈ మధ్య కాలంలో ఇంత చక్కగా వాడుకున్న సినిమా ఇదేనేమో!?


'యానిమల్'తో సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ పేరు మార్మోగింది. ఈ చిత్రానికి ఆయన సంగీతం అందించారు. పాటల్లో 'మాయే చేసి...' విడుదలకు ముందు సూపర్ హిట్ అయ్యింది. పిక్చరైజేషన్ కూడా బావుంది. నేపథ్య సంగీతం 'యానిమల్' స్థాయిలో లేదు. కానీ, సన్నివేశాలకు తగ్గట్టు చేశారు. యాక్షన్ సీన్లలో కాస్త పర్వాలేదు. సినిమాటోగ్రఫీ ఉన్నత స్థాయిలో ఉంది. నిడివి తగ్గిస్తే సినిమా మరింత రేసీగా ఉంటుంది. సస్పెన్స్ & మిస్టరీ మరింత వర్కవుట్ అయ్యేవి. 


సినిమాకు భారీగా ఖర్చు చేశారని తెరపై ఆ సన్నివేశాలు చూస్తే ఈజీగా చెప్పవచ్చు. డబ్బులు ఖర్చు చేసే విషయంలో అభిషేక్ నామా రాజీ పడలేదు. అయితే, యాక్షన్ సన్నివేశాల్లో వీఎఫ్ఎక్స్ మీద మరింత దృష్టి పెట్టాల్సింది. ముఖ్యంగా క్లైమాక్స్ ఫైటులో వీఎఫ్ఎక్స్ తేలిపోయాయి. 


నటీనటులు ఎలా చేశారంటే: 'డెవిల్'కు కళ్యాణ్ రామ్ 100 శాతం న్యాయం చేశారు. పాత్రకు అవసరమైన ఆహార్యంలోకి మారారు. కథా నేపథ్యానికి తగ్గట్టు డైలాగులు చెప్పారు. యాక్షన్ సీక్వెన్సులలో మరోసారి అదరగొట్టారు. కళ్యాణ్ రామ్ డైలాగ్ డెలివరీ సినిమాకు పెద్ద ప్లస్. ఆయన డ్రసింగ్ స్టైల్ కూడా బావుంది. అయితే... హిందీ సినిమా 'డిటెక్టివ్ బ్యూమకేష్ భక్షి' స్ఫూర్తితో కళ్యాణ్ రామ్ డ్రసింగ్ డిజైన్ చేసినట్లు అనిపించింది.


సంయుక్తా మీనన్ (Samyuktha Menon)కు కథలో మంచి వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్ లభించింది. ఆమె నటన పర్వాలేదు. 'మాయే చేసి...' పాటలో కళ్యాణ్ రామ్, సంయుక్త జోడీ చాలా బావుంది. మాళవికా నాయర్ (Malavika Nair)కు మణిమేఖల తరహా రోల్ రాబోయే రోజుల్లో వస్తుందో? లేదో? స్క్రీన్ మీద కనిపించేది తక్కువ సేపే అయినప్పటికీ... మంచి ఎలివేషన్ లభించింది. ఆమె సన్నివేశాలు ప్రేక్షకులకు గుర్తు ఉంటాయి. ఓ పాటలో, రెండు మూడు సన్నివేశాల్లో ఎల్నాజ్ నోరౌజీ అలరించారు. 


'స్వామి రారా' సత్య, షఫీ, 'రంగస్థలం' మహేష్, అజయ్, ఎస్తేర్ నోర్హా, సీనియర్ నటి సీత, శ్రీకాంత్ అయ్యంగార్, వశిష్ఠ సింహా, మౌనికా రెడ్డి, విదేశీ నటీనటులు తదితరులు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. 


Also Read: డెవిల్ ఆడియన్స్ రివ్యూ: బొమ్మ మాసివ్ బ్లాక్ బస్టర్ - నందమూరి కళ్యాణ్ రామ్ సినిమాకు సోషల్ మీడియాలో టాక్ చూశారా?


చివరగా చెప్పేది ఏంటంటే: 'డెవిల్'లో కథానాయకుడు కళ్యాణ్ రామ్ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నారు. సినిమా కథా నేపథ్యం బావుంది. ప్రారంభంలో పాత్రల పరిచయానికి కాస్త ఎక్కువ సమయం తీసుకున్నప్పటికీ... ఇంటర్వెల్ ముందు దర్యాప్తులో ఆసక్తి మొదలైంది. ఆ ట్విస్టులు వర్కవుట్ అయ్యాయి. మిస్టరీ డ్రామాలను ఇష్టపడే ప్రేక్షకులు ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా థియేటర్లకు వెళితే ఒకసారి హ్యాపీగా చూసి రావచ్చు. 


Also Read: బబుల్‌గమ్ రివ్యూ: రాజీవ్, సుమ కనకాల కుమారుడు రోషన్ హీరోగా పరిచయమైన సినిమా... బావుందా? సాగిందా?