Premam director Alphonse Puthren sensational comments on Vijayakanth death: సీనియర్ కథానాయకుడు, డీఎండీకే పార్టీ వ్యవస్థాపకుడు విజయకాంత్ మరణంతో తమిళనాడులో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇటు సినిమా, అటు రాజకీయ రంగాల్లో ఆయన తనదైన ముద్ర వేయడంతో ప్రేక్షకులు, ప్రజలు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.
విజయకాంత్ మరణంతో తమిళనాట విషాదం నెలకొంటే... మలయాళ దర్శకుడు అల్ఫోన్స్ పుత్రేన్ చేసిన సంచలన, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'కెప్టెన్'గా ప్రజల మనసులలో ముద్ర వేసుకున్న నాయకుడిని చంపేశారని సోషల్ మీడియా వేదికగా ఆయన పేర్కొన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు, మంత్రి & హీరో ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin)ను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ట్యాగ్ చేశారు.
వాళ్ళను పట్టుకోకపోతే ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తారు
''ఉదయనిధి స్టాలిన్ అన్నా... కేరళ నుంచి చెన్నై వచ్చిన నేను, రెడ్ జెయింట్ ఆఫీసులో కూర్చుని 'మీరు రాజకీయాలలోకి రావాలి' అని చెప్పాను. కలైంజర్ (కరుణానిధి)ని ఎవరు మర్డర్ చేశారో, ఐరన్ లేడీ జయలలితను మర్డర్ చేసింది ఎవరో మీరు కనిపెట్టాలని అడిగాను. ఇప్పుడు మీరు కెప్టెన్ విజయకాంత్ (Captain Vijayakanth)ను ఎవరు హత్య చేశారో కనిపెట్టాలి. వాళ్ళను పట్టుకోవాలి. ఒకవేళ మీరు ఈ విషయాన్ని విస్మరిస్తే... 'ఇండియన్ 2' సెట్స్‌లో కమల్ హాసన్ గారిని, మిమ్మల్ని హత్య చేసే ప్రయత్నం చేస్తారు. మీరు గనుక ఆ హంతకులను పట్టుకునే ప్రయత్నం చేయకపోతే... మిమ్మల్ని లేదా స్టాలిన్ (ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి) స్టాలిన్ గారిని టార్గెట్ చేస్తారు. 'నీరం' సినిమా విజయవంతమైన తర్వాత మీరు నాకు ఓ బహుమతి ఇచ్చారు... గుర్తుందా? ఐ ఫోన్ సెంటర్‌కు కాల్ చేసి 15 నిమిషాల్లో ఐ ఫోన్ బ్లాక్ కలర్ ఫోన్ తెప్పించి నాకు ఇచ్చారు. ఉదయనిధి స్టాలిన్ అన్నా... మీకు అది గుర్తు ఉంటుందని అనుకుంటున్నా. మర్డర్స్ చేసిన వాళ్ళను పట్టుకుని వాళ్ళ మోటివ్ ఏంటనేది తెలుసుకోవడం మీకు ఐ ఫోన్ తెప్పించడం కంటే సింపుల్'' అని అల్ఫోన్స్ పేర్కొన్నారు.
Also Read: తెలుగులో విజయకాంత్ సినిమా రీమేక్ అంటే బ్లాక్ బస్టరే! ఆయన సినిమాలు రీమేక్ చేసి విజయాలు అందుకున్న చిరు, వెంకీ, మోహన్ బాబు &...
మాలీవుడ్ హీరో నివిన్ పౌలీ, సాయి పల్లవి జంటగా నటించిన మలయాళ సినిమా 'ప్రేమమ్'తో ఇతర భాషల ప్రేక్షకులలో సైతం అల్ఫోన్స్ పేరు తెచ్చుకున్నారు. ఆ సినిమాకు ముందు, తర్వాత కూడా నివిన్ పౌలీతో సినిమాలు చేశారు. పృథ్వీరాజ్ సుకుమారన్, నయనతార జంటగా నటించిన 'గోల్డ్'కు దర్శకత్వం వహించారు. విజయకాంత్ మృతిపై ఆయన వ్యక్తం చేసిన సందేహాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అజిత్ రాజకీయాల్లోకి ఎందుకు రాలేదు...
ఎవరు భయపెడుతున్నారు? నాకు చెప్పాలి!
తమిళ సినిమాల్లో స్టార్ హీరో, తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడైన అజిత్ రాజకీయ రంగప్రవేశం గురించి సైతం 'ప్రేమమ్' దర్శకుడు అల్ఫోన్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ''అజిత్ కుమార్ సార్... మీరు రాజకీయాల్లోకి వస్తారని నాకు నివిన్ పౌలీ, సురేష్ చంద్ర చెప్పారు. మీ అమ్మాయి అనౌష్కకు 'ప్రేమమ్' సినిమా నచ్చడంతో నివిన్ పౌలీని మీ ఇంటికి పిలిచిన తర్వాత ఆ మాట విన్నాను. కానీ, అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు రాజకీయాల్లోకి రాలేదు. ఎందుకని? మీరు అబద్ధం చెప్పారా? లేదంటే మర్చిపోయారా? లేదంటే మీకు వ్యతిరేకంగా ఎవరైనా పని చేస్తున్నారా? ఒకవేళ ఆ మూడు కాదంటే అసలు కారణం ఏమిటి? నాకు తెలియాలి. ఎందుకంటే... మీపై నాకు నమ్మకం ఉంది. ప్రజలకు కూడా నమ్మకం ఉంది'' అని మరో పోస్ట్ చేశారు అల్ఫోన్స్.
Also Read: విజయకాంత్ 'కెప్టెన్ ప్రభాకరన్' - బ్లాక్‌బస్టర్ వెనుక వివాదాలు, గాయాలు!