Vijayakanth 100th movie Captain Prabhakaran: కెప్టెన్ ప్రభాకరన్... దివంగత కోలీవుడ్ కథానాయకుడు, డీఎండీకే పార్టీ వ్యవస్థాపకుడు విజయకాంత్ యాక్టింగ్ జర్నీలో ఎప్పటికీ మర్చిపోలేని సినిమా. ఆ సినిమా ముందు వరకు ప్రేక్షకులు ఆయనను 'పురట్చి కలైంజర్' అని పిలిచేవారు. ఆ సినిమా తర్వాత 'కెప్టెన్', 'కెప్టెన్ విజయకాంత్' అని పిలవడం ప్రారంభించారు. తుది శ్వాస విడిచే వరకు ఆయన బిరుదు మారలేదు. 


'కెప్టెన్ ప్రభాకరన్' సినిమాను తెలుగులో 'కెప్టెన్ ప్రభాకర్' పేరుతో డబ్బింగ్ చేశారు. తమిళనాట మాత్రమే కాదు... తెలుగులో కూడా ఆ సినిమా సంచలన విజయం సాధించింది. విజయంతో పాటు ఈ సినిమా చిత్రీకరణలో జరిగిన కొన్ని విషయాలు సైతం సంచలనంగా మారాయి. విజయకాంత్ లుక్ దగ్గర నుంచి కథ, కథానాయిక మార్పు, విడుదల వరకు జరిగిన విశేషాలు, గాయాలు...


స్టోరీ @ ఆపరేషన్ వీరప్పన్!
Captain Prabhakaran Story: 'కెప్టెన్ ప్రభాకరన్' కథే ఓ సంచలనం. దక్షిణాదిలో మూడు రాష్ట్రాల ప్రభుత్వాలను గడగడలాడించిన వీరప్పన్ (Veerappan)ను ఓ ఐఎఫ్ఎస్ (ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్) అధికారి పట్టుకోవడం అనే కథాంశంతో సినిమా రూపొందింది. అయితే... సినిమాలో వీరప్పన్ పేరును వాడలేదు. ఎర్ర చందనం స్మగ్లర్ వీరభద్రన్ అని చూపించారు. 


ఎల్టీటీఈ ప్రభాకరన్ స్ఫూర్తితో టైటిల్, హీరో లుక్!
Vijayakanth look in Captain Prabhakaran: శ్రీలంకలో తమిళుల హక్కుల కోసం పోరాటం చేసిన ఎల్టీటీటీ(లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం) నాయకుడు కెప్టెన్ ప్రభాకరన్ (వేలుపిళ్లై ప్రభాకరన్) స్ఫూర్తితో ఈ టైటిల్ ఖరారు చేశారు.


'కెప్టెన్ ప్రభాకరన్'లో విజయకాంత్ లుక్ చూశారా? కొన్ని సన్నివేశాల్లో ఎల్టీటీఈ ప్రభాకరన్ తరహాలో ఆయన లుక్ ఉంటుంది. ఆ క్యాప్, ఫారెస్ట్ అధికారిగా గెటప్ చూస్తే... ప్రభాకరన్ గుర్తుకు వస్తుంది.


చిత్రీకరణలో విజయకాంత్ భుజానికి గాయం!
Vijayakanth injured during Captain Prabhakaran shoot: విజయం మాత్రమే కాదు, ఈ సినిమా హీరోకి ఓ గాయం కూడా చేసింది. 'కెప్టెన్ ప్రభాకరన్' చిత్రీకరణలో ఓ ఫైట్ సీన్ చేసేటప్పుడు కట్టిన తాడు తెగడంతో ఆయన భుజానికి గాయమైంది. ఆ తర్వాత తాడు గట్టిగా కట్టడంతో నొప్పి తాళలేక ఆయన గట్టిగా అరిచిన ఘటన కూడా చిత్రీకరణలో చోటు చేసుకుందట!  


రమ్యకృష్ణ కంటే ముందు మరో కథానాయిక!
'కెప్టెన్ ప్రభాకరన్' సినిమాలో రమ్యకృష్ణ నటించారు. శరత్ కుమార్ ప్రేయసి పాత్రలో ఆమె కనిపించారు. అయితే... ఆమె పోషించిన పొన్నుగుడి పాత్రకు దర్శక, నిర్మాతల ఫస్ట్ ఛాయస్ ఆమె కాదు. తొలుత శరణ్య పొన్నవనన్ (Saranya Ponvannan)ను ఎంపిక చేశారు. అయితే... ఆ క్యారెక్టర్ మరీ గ్లామరస్‌గా ఉందని ఆమె రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత రమ్యకృష్ణ దగ్గరకు ఆ అవకాశం వచ్చింది.


Also Read: తెలుగులో విజయకాంత్ సినిమా రీమేక్ అంటే బ్లాక్ బస్టరే! ఆయన సినిమాలు రీమేక్ చేసి విజయాలు అందుకున్న చిరు, వెంకీ, మోహన్ బాబు &...


మరో విశేషం ఏమిటంటే... ఇటీవల త్రిష మీద చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మన్సూర్ అలీ ఖాన్ (Mansoor Ali Khan)కు లెంగ్త్ ఉన్న మేజర్ రోల్స్ రావడం ఈ సినిమాతో మొదలు అయ్యాయి. ఇందులో ఆయన వీరభద్రన్ (వీరప్పన్) రోల్ చేశారు.


షూటింగ్ ఎక్కడ చేశారో తెలుసా? పాటలు ఎన్ని?
'కెప్టెన్ ప్రభాకరన్' సినిమాలో కొంత భాగాన్ని 60 రోజుల పాటు కేరళలోని చాళకుడి ప్రాంతంలో చేశారు. కొన్ని సన్నివేశాలను అత్తిరపిల్లి జలపాతాల దగ్గర చిత్రీకరణ చేశారు. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారు. ఇందులో రెండు అంటే రెండు పాటలు మాత్రమే ఉన్నాయి. 


సెంటిమెంట్ తిరగరాసిన 'కెప్టెన్'
తమిళనాట తొలితరం అగ్ర హీరోలు ఎంజీఆర్, శివాజీ గణేశన్ నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్, ఆ తర్వాత ప్రభు, సత్యరాజ్ వరకు పలువురు హీరోలు వంద సినిమాల మైలు రాయి చేరుకున్నారు. వాళ్ళ వందో సినిమా విజయాలు సాధించలేదు. వందో సినిమా అంటే ఫ్లాప్ అనే సెంటిమెంట్ 'కెప్టెన్ ప్రభాకరన్'తో విజయకాంత్ చెరిపేశారు.


Also Read: విప్లవ కళాకారుడి నుంచి 'కెప్టెన్ విజయకాంత్‌' కావడం వెనుక రోజా భర్త!


'పుష్ప' విడుదల తర్వాత పాపులరైన సీన్స్!
Comparisons between Allu Arjun's Pushpa and Vijayakanth's Captain Prabhakaran: అల్లు అర్జున్ 'పుష్ప : ది రైజ్' విడుదలైన తర్వాత 'కెప్టెన్ ప్రభాకరన్' సినిమాలో కొన్ని సీన్స్ యూట్యూబ్ & సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందుకు కారణం ఏమిటో తెలుసా? ఆ సినిమాలోనూ ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే సన్నివేశాలు ఉన్నాయి. అందులోనూ నీటిలో ఎర్ర చందనం దుంగలు తేలడం, లారీల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే వాళ్ళను పట్టుకోవడం కోసం విజయకాంత్ జీపులో ఫాలో కావడం వంటివి ఉన్నాయి. దాంతో 'పుష్ప' లాంటి సినిమా ఆయన ఎప్పుడో చేశారంటూ కొందరు ఆ వీడియో క్లిప్స్ షేర్ చేశారు.


Also Read: కార్పొరేట్ బుకింగ్స్ అంటే ఏమిటీ? ‘సలార్’, ‘డంకీ’ మేకర్స్ ఆ పనికి పాల్పడ్డారా? ‘యానిమల్’ నిర్మాత ఏం చెప్పారు?