Congress 139th Foundation Day:
పార్టీ ఆవిర్భావ దినోత్సవం..
లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి (Lok Sabha Election 2024) సిద్ధమవుతోంది కాంగ్రెస్. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఇవాళ్టి నుంచి (డిసెంబర్ 28) ప్రచారం మొదలు పెట్టనుంది. పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా...'Hain Tayyar Hum' పేరిట మెగా ర్యాలీ ప్రారంభించనుంది. దేశ చరిత్రలోనే ఇదో కీలక అధ్యాయం అంటూ ఇప్పటికే కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ ఈ ర్యాలీలో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ఢిల్లీలోని AICC హెడ్‌క్వార్టర్స్‌లో పార్టీ ఆవిర్భావ దినోత్సవ (Congress Foundation Day) వేడుకలు నిర్వహించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఖర్గే పార్టీ జెండాని ఆవిష్కరించి అందరికీ అభినందనలు తెలిపారు. అంతకు ముందు X వేదికగా రాహుల్, ఖర్గే శుభాకాంక్షలు చెప్పారు.
"కాంగ్రెస్ పార్టీకి నిజం, అహింసే పునాదులు. ప్రేమ, గౌరవం, సమానత్వం మూల స్తంభాలు. దేశభక్తిని రగిలించే ఇలాంటి సంస్థలో నేను ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది. ఈ సందర్భంగా పార్టీ నేతలకు, కార్యకర్తలకు, మద్దతుదారులందరికీ నా శుభాకాంక్షలు"
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత
మల్లికార్జున్ ఖర్గే కూడా X వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ప్రజాసంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయమని, భారత్‌ని అభివృద్ధి చేయడమే లక్ష్యమని తేల్చి చెప్పారు.
"ప్రజా సంక్షేమం అందించాలన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ పుట్టింది. భారత్ పట్ల మాకెంతో గౌరవముంది. ఈ ప్రజాస్వామ్యంపైనా మాకు నమ్మకముంది. రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలనేదే మా లక్ష్యం. ఇలాంటి భారత్‌ని నిర్మించేందుకు మేం 138 సంవత్సరాలుగా కష్టపడుతూనే ఉన్నాం. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేతలందరికీ శుభాకాంక్షలు"
- మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు
వచ్చే ఏడాది జనవరి 14 నుంచి రాహుల్ గాంధీ రెండో దశ జోడో యాత్ర ప్రారంభించనున్నారు. ఈ సారి ఈ యాత్రకు "భారత్ న్యాయ్ యాత్ర" అనే పేరు పెట్టారు. మణిపూర్ నుంచి ముంబయి వరకూ రాహుల్ పాదయాత్ర చేయనున్నారు. మొత్తం 14 రాష్ట్రాల్లో ఈ యాత్ర కొనసాగనుంది. మార్చి 20న యాత్ర ముగియనుంది. 6,200 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగనుంది. ఈ మేరకు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అధికారిక ప్రకటన చేశారు.
Also Read: Guna Bus Accident: ట్రక్‌ని ఢీకొట్టిన బస్సు, చెలరేగిన మంటలు - 13 మంది సజీవదహనం