Bus Accident in Guna:


మధ్యప్రదేశ్‌లో ప్రమాదం..


మధ్యప్రదేశ్‌లో ఘోరం జరిగింది. ప్రమాదానికి గురైన బస్సులో ఉన్నట్టుండి మంటలు చెలరేగి 13 మంది ప్రయాణికులు ఆహుతి అయ్యారు. గుణలో తెల్లవారుజామున గుణ-ఆరోన్ రోడ్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సమయంలో బస్‌లో మొత్తం 30 మంది ప్రయాణికులున్నారు. 13 మంది అక్కడికక్కడే చనిపోగా..మిగతా 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే వీళ్లందరినీ స్థానిక ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల పరిహారం అందిస్తున్నట్టు ప్రకటించారు. గాయపడిన వాళ్లలో ఎవరి పరిస్థితీ విషమంగా లేదని కలెక్టర్ వెల్లడించారు. మంటలు వచ్చిన వెంటనే కొంత మంది ఎలాగోలా బయటపడ్డారు. అందుకే మృతుల సంఖ్య తక్కువగా నమోదైందని అధికారులు తెలిపారు. 


"ఈ ప్రమాదంలో గాయపడిన 17 మందికి జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. వాళ్ల ప్రాణాలకు ప్రమాదమేమీ లేదని వైద్యులు వెల్లడించారు. బస్‌ ట్రక్‌ని ఢీకొట్టడం వల్ల ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 13 మంది కాలి బూడిదయ్యారు. శరీరం పూర్తిగా కాలిపోవడం వల్ల ఎవరు అన్నది సరిగ్గా గుర్తించలేకపోతున్నాం. అందుకే DNA టెస్ట్‌లు నిర్వహించాలనుకుంటున్నాం. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతాం"


- కలెక్టర్