Chiranjeevi Venkatesh multi-starrer movie: ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్ బాబు వంటి తొలి తరం హీరోలు మల్టీస్టారర్ సినిమాలు చేశారు. కానీ, ఆ తర్వాత తరంలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ తదితర హీరోలు మల్టీస్టారర్ సినిమాల వైపు చూడలేదు. ఎందుకో వాళ్ళు కలిసి నటించలేదు. 


మహేష్ బాబు, రామ్, వరుణ్ తేజ్... తన తర్వాత వచ్చిన హీరోలతో వెంకటేష్ సినిమాలు చేశారు. హరికృష్ణ, మోహన్ బాబుతో నాగార్జున నటించారు. ఇప్పుడు ఆయన హీరోగా నటిస్తున్న 'నా సామి రంగ' సినిమాలో యువ కథానాయకులు 'అల్లరి' నరేష్, రాజ్ తరుణ్ నటిస్తున్నారు. ఒకవేళ అగ్ర హీరోల్లో ఇద్దరు కలిసి సినిమా చేస్తే? త్వరలో ఆ కోరిక తీరే అవకాశాలు ఉన్నాయి.


చిరంజీవితో వెంకటేష్ మల్టీస్టారర్!
వెంకటేష్ (Venky 75 Event)తో మల్టీస్టారర్ సినిమా చేయాలని ఉందని 'వెంకీ 75' కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. ఆయన మాట్లాడుతూ ''నా సోదరుడు వెంకీతో ఓ సినిమా చేయాలని ఉంది. మా కాంబోకి ఒక స్టోరీ రావాలని నేను కోరుకుంటున్నాను'' అని చిరంజీవి చెప్పారు. ఆయన కోరిక పట్ల వెంకటేష్ కూడా స్పందించారు. ''చిరంజీవి గారితో సినిమా ఉంటుంది. ఆ సినిమా అదిరిపోతుంది. గుర్తు పెట్టుకోండి'' అని వెంకటేష్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఒకరి డైలాగ్ మరొకరు చెప్పడం విశేషం.


Also Read: కార్పొరేట్ బుకింగ్స్ అంటే ఏమిటీ? ‘సలార్’, ‘డంకీ’ మేకర్స్ ఆ పనికి పాల్పడ్డారా? ‘యానిమల్’ నిర్మాత ఏం చెప్పారు?


సంపూర్ణ వ్యక్తిత్వానికి నిర్వచనం వెంకటేష్ అని చిరంజీవి పేర్కొన్నారు. తండ్రి డి. రామానాయుడి బలమైన కోరిక, అన్నయ్య సురేష్ బాబు  ప్రోత్సాహంతోనే తాను కథానాయకుడు అయ్యానని వెంకటేష్ తెలిపారు. 


వెంకటేష్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'సైంధవ్'. హీరోగా ఆయన 75వ చిత్రమిది. సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలో విడుదల కానుంది. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన 'కలియుగ పాండవులు' సినిమాతో ఆయన హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. 'కలియుగ పాండవులు' టు 'సైంధవ్' పేరుతో బుధవారం రాత్రి 75 సినిమాల ప్రయాణాన్ని వేడుకగా నిర్వహించారు. ఆ కార్యక్రమంలో ఈ మల్టీస్టారర్ ప్రస్తావన వచ్చింది.


Also Read: ‘యానిమల్’ తర్వాత ‘జమాల్ జమాలూ’ గర్ల్‌కు యమ క్రేజ్, ఇంతకీ ఈ క్యూట్ బ్యూటీ ఎవరో తెలుసా?



 'సైంధవ్' సినిమా విషయానికి వస్తే... 'హిట్' ఫేమ్ శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా ఇది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. దీనిని నిహారికా ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వెంకట్ బోయినపల్లి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. 'శ్యామ్ సింగ రాయ్' తర్వాత ఆయన నిర్మిస్తున్న చిత్రమిది. ఇందులో వెంకటేష్ సరసన 'జెర్సీ' ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు నవాజుద్ధీన్ సిద్ధిఖీ, హీరోయిన్లు రుహనీ శర్మ, ఆండ్రియా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ : అవినాష్ కొల్లా, సినిమాటోగ్రఫీ : ఎస్. మణికందన్, ఎడిటింగ్: గ్యారీ బీహెచ్, సంగీత దర్శకుడు : సంతోష్ నారాయణన్.