Eatala Rajendar BJP : ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి ఆయన బ్రేక్ వేశారు. రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఈటల రాజేందర్ పార్టీ మారుతారన్న ప్రాచరం ఊపందుకుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా హ్యాండిల్స్ ఈ విషయాన్ని ప్రచారం చేస్తున్నాయి. దీనిపై ఈటల రాజేందర్ తనను సంప్రదించిన మీడియా ప్రతినిధులకు వివరణ ఇచ్చారు. తాను పార్టీ మారడం లేదన్నారు. ఈ ప్రచారాన్ని కాంగ్రెస్ నేతలు చేస్తున్నారా లేకపోతే.. బీజేపీలోని అంతర్గత శత్రువులు చేస్తున్నారా అన్నదానిపై తనకు సమాచారం లేదని.. కానీ తాను మాత్రం.. పార్టీ మారడం లేదన్నారు.
మల్కాజిగిరిలో పోటీ చేయాలని ఈ టల నిర్ణయం
వచ్చే ఎన్నికల్లో తాను మల్కాజిగిరి స్థానం నుంచి పోటీ చేయనున్నట్లుగా ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఇది బీజేపీలో మరింత వివాదం అయ్యే అవకాశం ఉంది. కరీంనగర్ ఎంపీ స్థానం నుంచి సిట్టింగ్ నేతగా బండి సంజయ్ ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ ఎంపీ సీటు ఆయనకే లభించే అవకాశం ఉంది. దీంతో ఈటల రాజేందర్ తాను అసెంబ్లీకి రెండో స్థానంగా పోటీ చేసిన గజ్వేల్ నియోజకవర్గం ఉన్న మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారని అనుకున్నారు. కానీ ఈటల రాజేందర్ అనూహ్యంగా మల్కాజిగిరి నుంచి పోటీ చేయబోతున్నట్లుగా ప్రకటించారు. దీనిపైనా బీజేపీలో వివాదం అయ్యే అవకాశం ఉంది.
రాజకీయంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న ఈటల
అసెంబ్లీ ఎన్నికల్లో ఈటల రాజేందర్ రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఆయన బీజేపీలో గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో హైకమాండ్ ఆయనకు మంచి ప్రాధాన్యత ఇచ్చింది. ఆయన చెప్పిన వారికే టిక్కెట్లు కేటాయించింది. కానీ అభ్యర్థులు అంతా ఘోరపరాజయం పాలయ్యారు. బీసీ ముఖ్యమంత్రి నినాదాన్ని ఇచ్చినా ప్రయోజనం లేకపోయింది. ఆ తర్వాత ఈటల రాజేందర్ పై రకరకాల పుకార్లు ప్రారంభమయ్యాయి. ఆయన పార్టీ మారుతారని తరచూ ప్రచారం జరుగుతోంది.
తరచూ పార్టీ మారుతున్నారన్న ప్రచారం
బీజేపీ అగ్రనేతలతో తనకు సన్నిహిత పరిచయాలు ఉన్నాయని.. బీఆర్ఎస్ వెళ్లగొట్టినప్పుడు బీజేపీ దగ్గరకు చేర్చుకుందని గతంలో చెప్పారు. అయితే స్థానిక పార్టీలో ప్రాధాన్యత లభించకపోవడంతో సమస్యగా మారుతోంది. రాజకీయంగా ఈటల రాజేందర్ గతంలో ఓడిపోలేదు. ఈ సారి ఆయన ప్రజా ప్రతినిధిగా లేరు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా గెలవకపోతే ఆయన రాజకీయ భవిష్యత్ ప్రమాదంలో పడుతుంది. బీజేపీ తరపున పోటీ చేస్తే గెలుస్తామా లేదా అన్న సందేహం ఉంది. అందుకే కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇప్పటికైతే ఈటల రాజేందర్ తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.