Tension to Ananthapuram Ysrcp Leaders: వచ్చే ఎన్నికల్లో 'వైనాట్ 175' నినాదంతో సీఎం జగన్ (CM Jagan) వ్యూహాత్మకంగా ప్రణాళికలు రచిస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ మార్పులు చేస్తున్నారు. ఎవరికి టికెట్ కేటాయిస్తారో అనే దానిపై కీలక నేతలు, వారి అభిమానుల్లో టెన్షన్ నెలకొంది. తాడేపల్లి (Tadepalli) క్యాంప్ కార్యాలయం నుంచి ఫోన్ రాగానే వారి గుండెల్లో గుబులు పట్టుకుంటోంది. తాజాగా, ఉమ్మడి అనంతపురం జిల్లా (Ananthapuram District) నేతలకు సీఎం నుంచి పిలుపు రాగా వారంతా తాడేపల్లికి పరుగులు తీసి బుధవారం సీఎంను కలిశారు. 


2019లో ఇదీ పరిస్థితి


టీడీపీ కంచుకోటగా ఉన్న అనంతపురం జిల్లాలో 2019 ఎన్నికల్లో వైసీపీ 12 ఎమ్మెల్యే స్థానాలు, 2 ఎంపీ స్థానాలు కైవసం చేసుకుంది. తెలుగు దేశం కంచుకోటను బద్దలు కొట్టడంతో ఇక్కడ రాజకీయంపై ప్రస్తుతం సరత్రా ఆసక్తి నెలకొంది. గత ఎన్నికల్లో గెలిచిన ఆభ్యర్థులకు సీఎం జగన్ టికెట్ కేటాయిస్తారా లేక పక్కనపెడతారా అన్నది అనంత జిల్లా పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ ద్వితీయ శ్రేణి నేతల్లోనూ ఉత్కంఠ రేపుతోంది. జిల్లాలో ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలను పెద్ద ఎత్తున మారుస్తున్నట్లు చర్చ సాగుతోంది. అయితే, కొంత మంది నేతలు తాము ప్రజలతో నిరంతరం మమేకమయ్యామని, ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లామని, కచ్చితంగా తమకు టికెట్ వస్తుందనే ధీమాతో ఉన్నారు.


నేతల క్యూ


ఉమ్మడి జిల్లాలో పలు నియోజకవర్గాల నేతలను తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి రావాలని పిలుపు రావడంతో రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే, మంత్రి ఉషశ్రీ చరణ్, పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ, కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి, మడకశిర ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి, అనంత ఎంపీ తలారి రంగయ్య తాడేపల్లికి బయలుదేరారు. వీరందరితోనూ సీఎం విడివిడిగా మాట్లాడినట్లు పార్టీ వర్గాల సమాచారం. అయితే, ప్రస్తుతం వీరు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం నుంచి కాకుండా ఇతర నియోజకవర్గాల నుంచి పోటీ చేయాల్సి ఉంటుందని సీఎం వారితో చెప్పినట్లు తెలుస్తోంది. కొందరిని ఎంపీ స్థానాల్లో పోటీ చేయాలని సూచించినట్లు సమాచారం. 


అనంత ఎంపీగా ఉన్న తలారి రంగయ్యను ఈసారి అసెంబ్లీకి పంపించే ఆలోచనలో సీఎం ఉన్నట్లు తెలుస్తోంది. కళ్యాణదుర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఉషశ్రీ చరణ్ ను సత్యసాయి జిల్లాకు చెందిన ఓ నియోజకవర్గంలో పోటీకి దింపేందుకు సీఎం నిర్ణయించినట్లు సమాచారం. కాగా, ప్రస్తుత నియోజకవర్గంలో మంత్రిపై వ్యతిరేకత ఉన్నట్లు సర్వేల సమాచారం జగన్ వద్ద ఉందని, అందుకే నియోజకవర్గం మార్చినట్లు తెలుస్తోంది. పెనుగొండకు ప్రాతినిథ్యం వహిస్తున్న మాజీ మంత్రి శంకరనారాయణను ఎంపీ బరిలోకి దిగాలని సీఎం సూచించినట్లు సమాచారం. అయితే, హిందూపురం నుంచా లేక అనంత పార్లమెంట్ నుంచా అనేది తెలియాల్సి ఉంది. రాయదుర్గంకు ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డికి, శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి, మడకశిర ఎమ్మెల్యే డాక్టర్ తిప్పెస్వామిలకు ఈసారి టికెట్లు ఉండకపోవచ్చని జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే, పార్టీకి కష్టపడి పని చేసిన వీరికి సామాజిక సమీకరణల నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది. హిందూపురం ఎంపీ అభ్యర్థిగా ఓ కొత్త మహిళ నేతకు సీఎం అవకాశం కల్పించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హిందూపురం ఎంపీగా ఉన్న గోరంట్ల మాధవ్ కు పార్టీ అధిష్టానం తన టికెట్ పై స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. నియోజకవర్గాల్లో ఈ మార్పులు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో అంటూ అధికార పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు.


Also Read: Ayesha Meera Murder Case: ఆయేషా మీరా హత్యకు 16 ఏళ్లు, తాజాగా సీబీఐకి ఏపీ హైకోర్టు నోటీసులు