Ayesha Meera murder case: విజయవాడ: బీ ఫార్మిసీ చదువుతూ బెజవాడకు దగ్గర్లోని ఇబ్రహీంపట్నం లోని ఓ ప్రైవేట్ హాస్టల్ లో ఉంటున్న ఆయేషా మీరా అనే విద్యార్థిని తన గదిలోనే దారుణ హత్య (Ayesha Meera Killed in Hostel Room)కు గురైంది. 2007 డిసెంబర్ 27న జరిగిన ఈ ఘటన రాష్ట్రం మొత్తాన్ని ఊపేసింది. ప్రజల నుంచి వస్తున్న ఆందోళనలు మహిళా సంఘాల ఒత్తిడి కారణంగా ఆయేషా హత్య జరిగిన 9 నెలల తర్వాత పోలీసులు స్పందించారు. సత్యం బాబు అనే యువకుడే దొంగతనానికి వెళ్లి ఆయేషా పై అత్యాచారానికి పాల్పడడం తో పాటు హత్య చేశాడు అంటూ కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ జరిపిన విజయవాడ (Vijayawada) మహిళా సెషన్స్ కోర్టు సత్యం బాబుకు ఆ రెండు నేరాల కింద 2010 సెప్టెంబర్ లో పదేళ్ల జైలు శిక్ష విధించింది.


సత్యం బాబు అసలు హంతకుడు కాదన్న ఆయేషా మీరా తల్లి తండ్రులు
ఈ కేసులో సత్యం బాబు అసలు హంతకుడు కాదనీ పోలీసులు కావాలనే అతణ్ణి ఇరికించారు అంటూ ఆయేషా మీరా తల్లిదండ్రులు మీడియా కెక్కడం సంచలనం సృష్టించింది. మరోవైపు సత్యం బాబు కూడా తాను నిర్దోషిని అంటూ 2010 అక్టోబర్ లో ఏపీ హై కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఏడేళ్ల విచారణ జరిపి 2017 మార్చి 31న సత్యం బాబు నిర్దోషి అంటూ ఉమ్మడి హైకోర్టు తీర్పు చెప్పింది. ఇక అదే సమయంలో తమ కూతురిని చంపింది ఎవరో తేల్చాలంటూ ఆయేషా మీరా తల్లిదండ్రులు వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హై కోర్టు పూర్తి స్థాయిలో విచారణ చెయ్యాలంటూ సీబీఐని 2018లో ఆదేశించింది.


ఐదేళ్లైనా అక్కడే నిలిచిన దర్యాప్తు
తమ కూతురి హత్య దర్యాప్తు నత్త నడకన సాగుతోంది అంటూ ఆయేషా మీరా తల్లిదండ్రులు శంషద్ బేగం ఇక్బాల్ బాషా మరోసారి కోర్టు ను ఆశ్రయించడం తో ఈ కేసు దర్యాప్తు వేగంగా పూర్తి చేయమని ఆదేశించడంతో పాటు హైదరాబాద్, వైజాగ్ లలోని సీబీఐ ఎస్పీ లకు నోటీసులు (AP High Court notices to CBI) జారీ చేసింది ఏపీ హైకోర్టు. అలాగే కేంద్ర హోంశాఖ సెక్రటరీ ని సైతం కౌంటర్ దాఖలు చెయ్యాలని తెలిపింది. ప్రస్తుతానికి ఈ కేసు విచారణ ను 4 వారాల పాటు వాయిదా వేసింది.


ఇంతకూ ఆయేషాను హత్య చేసింది ఎవరు??
ఉమ్మడి ఏపీ లో సంచలనం సృష్టించిన అయేషా కేసులో అసలు హంతకులు ఎవరు అనేది ఇప్పటికీ మిస్టరీ గానే మిగిలింది. ఆయేషా హత్య జరిగి 16 ఏళ్లు అయినా ఈ కేసు ఇంకా నడుస్తూనే ఉంది. అప్పట్లో వచ్చిన కథనాల ప్రకారం ఒక బడా రాజకీయకుటుంబానికి చెందిన యువకుడు.. అతని స్నేహితులే ఈ ఘటన కు కారణం అనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే మొదట్లో ఈ కేసు దర్యాప్తు చేసిన రంగనాథ్ లాంటి అధికారులు మాత్రం అసలు దోషి సత్యం బాబే అనీ.. సరైన ఆధారాలు లేకనే అతను ప్రస్తుతానికి తప్పించుకున్నా.. ఎప్పటికైనా ఆ విషయం రుజువు అవుతుంది అనీ ఒక టీవీ ఇంటర్వ్యూలో తెలిపారు. మరోవైవు ఆయేషా మీరా హత్య కేసులో అసలు నేరస్తులను త్వరగా పట్టు కోవాలంటూ సత్యం బాబు సైతం డిమాండ్ చేస్తుండడం తో అసలు ఈ కేసు  తేలుతుందా లేదా..అయేషాను చంపింది ఎవరో సీబీఐ నిర్థారిస్తుందా లేదా అనే చర్చ జనాల్లో నడుస్తూనే ఉంది.