Sushmitha Ram Kala about Acting In Serials: కొన్నేళ్లుగా సీరియల్స్ అంటే లేడీ విలన్స్ ఉండాల్సిందే అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. ప్రస్తుతం తెలుగులోని దాదాపు ప్రతీ సీరియల్‌లో విలన్ పాత్రల్లో లేడీ ఆర్టిస్టులే ఎక్కువగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు సీరియల్స్‌లో ఎక్కువగా కన్నడ నటీమణులు తమ సత్తాను చాటుతున్నారు. అలాంటి వారిలో ఒకరు సుష్మిత రామ్‌కల. ప్రస్తుతం జీ తెలుగులో ప్రసారమవుతున్న ‘గుండమ్మ కథ’ సీరియల్‌లో సుష్మిత రామ్‌కల నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషిస్తోంది. తాజాగా ఈ సీరియల్ వల్ల తనకు వచ్చిన ఫేమ్ గురించి, అందులో నటించిన అనుభవాలను గురించి ప్రేక్షకులతో పంచుకుంది సుష్మిత.


నెగిటివిటీపై పాజిటివ్‌ రియాక్షన్..


ఎప్పుడూ చూసిన గుండమ్మను టార్చర్ పెడతానంటూ ప్రేక్షకులు తనను తిట్టుకుంటున్నారంటూ చెప్పుకొచ్చింది సుష్మిత రామ్‌కల. ‘‘నా పాత్ర చూసి ఆ అమ్మాయిని మంచిగా కొట్టండి అని చెప్తుంటారంట. అయినా అందరూ ఎప్పుడూ పొగుడుతూ ఉంటే ఏం బాగుంటుంది. కొంచెం తిట్టాలి’’ అంటూ ‘గుండమ్మ కథ’లో విలన్‌గా చేయడం వల్ల తనకు వస్తున్న నెగిటివిటీపై పాజిటివ్‌గా స్పందించింది. ఆ తర్వాత అసలు తన కెరీర్ ఎలా ప్రారంభం అయ్యిందో బయటపెట్టింది. ‘‘నా కెరీర్ మొదలయ్యింది జీలోని సీరియల్స్ నుండే. ఇప్పటికీ సీరియల్సే చేస్తున్నా కానీ మధ్యలో కన్నడలో ఒకటి, తెలుగులో ఒకటి మూవీ చేశాను. కన్నడలో బై టూ లవ్ అనే మూవీలో శ్రీలీల ఫస్ట్ హీరోయిన్‌గా చేస్తే నేను సెకండ్ హీరోయిన్‌గా చేశాను’’ అంటూ బయటపెట్టింది సుష్మిత రామ్‌కల.


శ్రీలీలతో ఫ్రెండ్‌షిప్..


శ్రీలీలతో కలిసి సినిమా చేసింది కాబట్టి తనతో మంచి ఫ్రెండ్‌షిప్ ఉందని తెలిపింది సుష్మిత రామ్‌కల. అయితే తను ప్రత్యేకంగా సినిమాల్లో నటించాలని ఇండస్ట్రీలోకి రాలేదని, సినిమాలు అయినా, సీరియల్స్ అయినా ఓకే అనుకునే వచ్చానని బయటపెట్టింది. ‘‘మేకప్, ఆభరణాలు అన్నీ వేసుకొని ఉండడం కష్టంగా ఉంటుంది. కానీ ఇష్టంతో చేస్తే సంతోషంగా అనిపిస్తుంది’’ అని సీరియల్‌లో నటించడం వెనుక కష్టం గురించి చెప్పింది. ఇక తన తండ్రి తెలుగువారు కాబట్టి అప్పుడప్పుడు ఆయన తెలుగులో మాట్లాడడం వినేదాన్ని అని కానీ సీరియల్స్‌లోకి వచ్చిన తర్వాతే తెలుగు బాగా నేర్చుకున్నానని తెలిపింది. ఇంకా నేర్చుకోవాలని ఉందని చెప్పింది.


ఆయనే నా ఫేవరెట్..


బెంగుళూరులో ఉండే సుష్మిత రామ్‌కల.. సీరియల్స్ కోసం మాత్రమే హైదరాబాద్‌కు తరచుగా ప్రయాణం చేస్తుంటుంది. ఇక తెలుగులో తను ఏమైనా సినిమాలు చూశారా అని ప్రశ్నించగా.. తను తెలుగులో మొదట చూసిన మూవీ ‘అన్నమయ్య’ అని బయటపెట్టింది. ‘‘ఆ మూవీ ఇప్పటికీ నాకు బోర్ కొట్టదు. అందుకే నాగార్జున నాకు ఫేవరెట్’’ అని తెలిపింది సుష్మిత. ప్రస్తుతం తెలుగులో ‘గుండమ్మ కథ’తో పాటు కన్నడలో కూడా మరో సీరియల్‌లో నటిస్తోంది ఈ భామ. 2018లో ప్రారంభమయిన ఈ సీరియల్ ఇప్పటికీ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. దీని వల్ల ఎంతోమంది నటీనటులు బుల్లితెరకు పరిచయమయ్యారు. ఇప్పటికీ వారు సక్సెస్‌ఫుల్‌గా సీరియల్ వరల్డ్‌లో కొనసాగుతున్నారు. సుష్మిత రామ్‌కల కూడా తన గ్లామర్, యాక్టింగ్‌తో తెలుగులో ఫ్యాన్స్‌ను క్రియేట్ చేసుకుంది.


Also Read: బిర్యానీ ఇష్టమని రోజు తినలేం కదా - బోల్డ్ క్యారెక్టర్స్‌పై అనుమప షాకింగ్ రిప్లై