Aparna VastareyAparna Vastarey: కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటి, టీవీ వ్యాఖ్యాత అపర్ణా వస్తరే (57) కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా ఆమె ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో పోరాడుతూ చికిత్స తీసుకుంటోంది. ఆరోగ్యం విషమించడంతో గురువారం (జూలై 11) రాత్రి బెంగళూరులో ఆమె తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అపర్ణ మరణంపై కన్నడ సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
అపర్ణ వస్తరే యాంకర్ గానే కాకుండా, నటిగా రేడియో జాకీగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో కీలక పాత్రలు పోషించింది. ఆ తర్వాత బుల్లితెర మీద అడుగుపెట్టి కొన్ని సీరియల్స్ లో నటించింది. అలాగే పలు షోలకు హోస్ట్‌గా వ్యవహరించింది. ప్రస్తుతం బెంగుళూరులోని నమ్మ మెట్రో రైలులో ప్రయాణీకులకు సూచనలు అందించే వాయిస్ అపర్ణదే. ఆమె ఇప్పుడు క్యాన్సర్ తో మృతి చెందడంపై పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధా రామయ్య సోషల్ మీడియా ద్వారా ఆమె మృతికి సంతాపం ప్రకటించారు.
అపర్ణ వస్తరే 1966 అక్టోబర్ 14న చిక్ మంగుళూరులో జన్మించింది. 1984లో 'మసనాడ పువ్వు' అనే కన్నడ చిత్రంతో నటిగా కెరీర్ ప్రారంభించింది. 'సంగ్రామ' 'నమ్మూర రాజా' వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. ఆమె శివరాజ్ కుమార్ హీరోగా నటించిన 'ఇన్‌స్పెక్టర్ విక్రమ్' సినిమాలోనూ నటించింది. ఆమె చివరి చిత్రం ‘గ్రే గేమ్స్’ ఈ మధ్యనే విడుదలైంది. ఆమె 'మూడల మనే' 'ముక్త' వంటి సీరియల్స్‌లోనూ నటించింది.
అపర్ణ కొన్నాళ్లపాటు భారత ప్రభుత్వం నిర్వహించే 'వివిధ భారతి' ఛానల్ లో రేడియో జాకీగా కూడా పని చేసింది. DD చందన్ వాహిని న్యూస్ ఛానల్ లో వ్యాఖ్యాతగా పలు కార్యక్రమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కన్నడలో అద్భుతమైన డిక్షన్ తో మాట్లాడటంలో తనకు తానే సాటి అనిపించుకుంది. 1998లో దీపావళి ప్రోగ్రామ్ కు దాదాపు ఎనిమిది గంటలపాటు యాంకరింగ్ చేసి రికార్డ్ సృష్టించింది.
2013లో కన్నడ బిగ్ బాస్ సీజన్-1 రియాలిటీ షోలో కంటెస్టెంట్ గా పాల్గొంది అపర్ణ. అలానే 2015లో 'మజా టాకీస్' అనే కామెడీ షోలో వరలక్ష్మి పాత్రలో నటించింది. 2005లో అపర్ణ కన్నడ రచయిత, ఆర్కిటెక్ట్ నాగరాజ్ వస్తరేని వివాహం చేసుకుంది. రెండేళ్లుగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతూ జూలై 11న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.
Also Read1: 'సర్దార్ 2' షూటింగ్ షురూ - ఈసారి కంబోడియా మిషన్ కోసం సిద్ధమవుతున్న కార్తీ