Sardar 2 Update: కోలీవుడ్ హీరో కార్తీ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా 'సర్దార్'. డైరెక్టర్ పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున తెలుగు ప్రేక్షకులకు అందించారు. తెలుగు తమిళ భాషల్లో ఘన విజయం సాధించిన ఈ స్పై థ్రిల్లర్‌కు సీక్వెల్ ఉంటుందని గతంలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 'సర్దార్ 2' పేరుతో ఓ అనౌన్స్ మెంట్ వీడియోని కూడా రిలీజ్ చేసారు. అయితే తాజాగా ఈ మూవీ షూటింగ్ అప్డేట్ ను చిత్ర బృందం సోషల్ మీడియాలో పంచుకున్నారు.
'సర్దార్' చిత్రాన్ని రూపొందించిన పిఎస్ మిత్రన్ దర్శకత్వంలోనే 'సర్దార్ 2' తెరకెక్కనుంది. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్ లక్ష్మణ్ కుమార్ భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఈ సీక్వెల్ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవలే జరిగాయని మేకర్స్ వెల్లడించారు. జూలై 15వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని, దీని కోసం చెన్నైలో భారీ సెట్ ను నిర్మించినట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా పూజా సెర్మనీ ఫోటోలను షేర్ చేసారు. ఈ వేడుకలో హీరో కార్తీ తండ్రి శివ కుమార్ తో పాటుగా చిత్ర బృందం పాల్గొన్నారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం సమకూరుస్తుండగా.. జార్జ్ సి. విలియమ్స్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తారు.
'సర్దార్' చిత్రంలో తండ్రీకొడుకులుగా కార్తీ ద్విపాత్రాభినయం చేసారు. రాశి ఖన్నా, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించగా.. చుంకీ పాండే, లైలా ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఫస్ట్ పార్ట్ లో దేశ ద్రోహిగా ముద్రపడిన ఏజెంట్ సర్దార్ చంద్ర బోస్, ఇన్స్పెక్టర్ విజయ్ ప్రకాష్ కలిసి ఒక మిషన్ ను పూర్తి చేయడంతో కథ ముగిసింది. ఇప్పుడు 'సర్దార్ 2' లో మరో మిషన్ ను డీల్ చేయబోతున్నారు. విజయ్ ప్రకాష్ (కార్తీ) ను పోలీసు ఫోర్స్ నుండి తొలగించిన తర్వాత, RAW ఏజెన్సీలో స్పై ఏజెంట్ గా చేరమని ఆఫర్ వస్తుంది. దీనికి అతను అంగీకారం తెలపడంతో కంబోడియాలో మొదటి మిషన్ కోసం రెడీగా ఉండమని పైఅధికారి ఆదేశించడాన్ని 'సర్దార్ 2' అనౌన్స్ మెంట్ వీడియోలో చూపించారు. దీన్ని బట్టి ఈసారి కథంతా కంబోడియా నేపథ్యంలో జరగబోతుందని అనుకోవచ్చు.
టాలీవుడ్ లో మంచి మార్కెట్ ఏర్పరచుకున్న తమిళ హీరోలలో కార్తీ ముందు వరుసలో ఉంటారు. ఆయన నటించే ప్రతీ చిత్రాన్ని తెలుగులోనూ డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తూ వస్తున్నారు. సొంతంగా డబ్బింగ్ తో మన ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. 'యుగానికొక్కడు' 'ఆవారా' 'నా పేరు శివ' 'ఖాకీ' 'ఖైదీ' 'పొన్నియిన్ సెల్వన్' సినిమాలతో పాటుగా.. 'ఊపిరి' వంటి స్ట్రెయిట్ తెలుగు చిత్రంతో మంచి విజయాలు సాధించారు. కానీ తన కెరీర్ లో మైలురాయి మూవీ 'జపాన్' తీవ్ర నిరాశ పరిచింది.
కార్తీ ప్రస్తుతం సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో 'మేయ్యజగన్' అనే సినిమాలో అరవింద్ స్వామితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఆయన అన్నా వదినలు సూర్య, జ్యోతిక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలానే నలన్ కుమారస్వామి డైరెక్షన్‌లో 'వా వాతియారే' మూవీలో నటిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు 'సర్దార్ 2' చిత్రాన్ని పట్టాలెక్కిస్తున్నారు. త్వరలోనే లోకేష్ కనగరాజ్‌తో కలిసి 'ఖైదీ 2' సినిమా చేసే అవకాశం ఉంది.
Also Read: ఏపీ డిప్యూటీ సీఎం ఆఫీసుకు రాజ్ తరుణ్ మాజీ లవర్ లావణ్య - పవన్ కళ్యాణ్ పెళ్లిల్లపై కీలక వ్యాఖ్యలు