సినిమా రివ్యూ: భారతీయుడు 2
నటీనటులు: కమల్ హాసన్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, ఎస్‌జే సూర్య, బాబీ సింహా, గుల్షన్ గ్రోవర్ తదితరులు
మాటలు: హనుమాన్ చౌదరి (తెలుగులో)
ఛాయాగ్రహణం : రవి వర్మన్
సంగీతం: అనిరుద్ రవిచందర్
తెలుగులో విడుదల: ఏషియ‌న్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీల‌క్ష్మి మూవీస్
నిర్మాణ సంస్థలు: లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్
నిర్మాత: సుభాస్కరన్
కథ, దర్శకత్వం: శంకర్
విడుదల తేదీ: జూలై 12, 2024


Bharateeyudu 2 Telugu Review: 'భారతీయుడు'కు ప్రేక్షకుల్లో స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. కథానాయకుడిగా కమల్ హాసన్, దర్శకుడు శంకర్ ప్రతిభకు పాతికేళ్ల క్రితం జేజేలు కొట్టారు. వాళ్లిద్దరూ ఆ సినిమాకు సీక్వెల్ 'భారతీయుడు 2' చేయడంతో అంచనాలు పెరిగాయి. తమిళ పరిశ్రమలో భారీ చిత్రాలకు పెట్టింది పేరైన లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ యాడ్ కావడంతో మరింత ఆసక్తి నెలకొంది. మరి, సినిమా ఎలా ఉందో తెలుసుకోండి.


కథ (Bharateeyudu 2 Movie Story): చిత్ర అరవింద్ (సిద్ధార్థ్), అతని స్నేహితులు కలిసి 'బార్కింగ్ డాగ్స్' పేరుతో యూట్యూబ్ ఛానల్ పెడతారు. సమాజంలో అవినీతిని ఎండగట్టడమే వాళ్ళ లక్ష్యం. అవినీతి, లంచం కేసుల్లో జైలుకు వెళ్లిన అధికారులు సాయంత్రానికి బయటకు రావడంతో బాధ పడతారు. పరిస్థితిలో మార్పు కోసం ఇండియన్ మళ్లీ రావాలని కోరుకుంటారు. సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో 'కమ్ బ్యాక్ ఇండియన్' హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తారు. తైవాన్ రాజధాని తైపేలో ఉన్న సేనాపతి (కమల్ హాసన్)కు అది చేరుతుంది. ఆయన ఇండియాకు వస్తారు. కొందరు అవినీతి అధికారుల భరతం పడతారు. 


ప్రజల సొమ్మును అక్రమ మార్గాల్లో తమ సొంతం చేసుకున్న పెద్ద తిమింగలాల పని సేనాపతి చూసుకుంటుంటే... ఆయన ఇచ్చిన పిలుపు మేరకు చిత్ర అరవింద్, అతని స్నేహితులతో పాటు చాలా మంది తమ కుటుంబంలో అవినీతికి పాల్పడిన వాళ్ళను కటకటాల వెనక్కి పంపిస్తారు. ఆ తర్వాత ఏమైంది? 'కమ్ బ్యాక్ ఇండియన్' అని పిలిచిన ప్రజలే 'గో బ్యాక్ ఇండియన్' అని ఎందుకు నినదించారు? సేనాపతిని పట్టుకోవడంలో విఫలమైన కృష్ణస్వామి కొడుకు ప్రమోద్ (బాబీ సింహ) సీబీఐ అధికారిగా ఏం చేశాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.


విశ్లేషణ (Bharateeyudu 2 Review Telugu): కాలంతో పాటు సమాజంలో మార్పులు వస్తున్నాయి. అక్రమ సంపాదన / ఆస్తులు కూడబెట్టే విధానాల్లోనూ మార్పులు వచ్చాయి. లంచం నేరుగా తీసుకోవడం మానేసి వివిధ పద్ధతుల్లో స్వీకరించడం మొదలు పెట్టారు. అవినీతి రూపురేఖలు మారాయి. అవినీతి అనేది 1996లోనూ ఉంది. ఇప్పుడూ ఉంది. అందువల్ల, ఈ కాలానికి తగ్గట్టు శంకర్ ఎటువంటి కథ రాశారు? ఎలా తీశారు? భారతీయుడిగా సేనాపతిని మళ్లీ కథలోకి ఎలా తీసుకు వస్తారు? అని ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.


'భారతీయుడు 2'తో కథకుడిగా శంకర్ సక్సెస్ అయ్యారు. తెలివిగా సేనాపతిని ఈ కథలోకి తీసుకు వచ్చారు. అవినీతిపై యూట్యూబ్ ఛానల్ 'బార్కింగ్ డాగ్స్'లో సిద్ధార్థ్, అతని స్నేహితులు చేసే వీడియోలు బావున్నాయి. ఈతరం అవినీతిని, ఆ అవినీతిని సేనాపతి ఫాలో అవుతున్న తీరును శంకర్ చక్కగా చూపించారు. కానీ, దర్శకుడిగా ఆయన ఫెయిల్ అయ్యారు. ఎమోషనల్ సన్నివేశాలు ఆడియన్స్ వరకు రీచ్ అయ్యేలా తీయడంలో ఫెయిల్ అయ్యారు.


దర్శకుడిగా శంకర్ విజయానికి కారణం సన్నివేశంలో గాఢతను, భావోద్వేగాలను ప్రతి ప్రేక్షకుడికి చేరువ అయ్యేలా ఆయన తీయడమే. 'భారతీయుడు 2'లో ఆ శంకర్ కనిపించలేదు. పైగా, నిడివి ఎక్కువగా ఉంది. సినిమా ప్రారంభం నుంచి నిడివి ఎక్కువ అనే భావన కలుగుతుంది. అయితే... పాత్రల పరిచయం, సేనాపతి రాకతో ఫస్టాఫ్ ఆసక్తిగా సాగింది. సెకండాఫ్ మొదలైన తర్వాత మరింత నెమ్మదిగా ముందుకు కలిగింది. ఎమోషనల్ సన్నివేశాలు మరింత సాగదీతగా అనిపించాయి. అనిరుద్ పాటలు, నేపథ్య సంగీతం సైతం సినిమాను ఎలివేట్ చేయలేదు. ఈ సినిమాకు మ్యూజిక్ కూడా మైనస్. స్క్రీన్ మీద ఒక్క పాట కూడా బాలేదు. ఒక్క సీన్ రీ రికార్డింగ్ కూడా బాలేదు.


Also Read: మీర్జాపూర్ 3 వెబ్ సిరీస్ రివ్యూ: మున్నా లేడు, కాలిన్ కనిపించేదీ తక్కువే - గుడ్డు గూండాగిరి హిట్టా? ఫట్టా?



'భారతీయుడు 2' చూసిన తర్వాత... సన్నివేశాన్ని ఎక్కడ ప్రారంభించాలో, ఎక్కడ ముగించాలో తెలిసిన శంకర్ (Shankar) సినిమాలో ఈ సాగదీత ఆశ్చర్యం కలిగించే అంశమే. ఈజీగా అరగంట నిడివి తగ్గించవచ్చు. శంకర్ సినిమాల్లో కనిపించే భారీ సెట్టింగ్స్, నిర్మాణ విలువలు 'భారతీయుడు 2'లోనూ ఉన్నాయి. లైకా ప్రొడక్షన్స్ ఖర్చుకు వెనుకాడలేదు. రెడ్ జెయింట్ మూవీస్ కూడా! సినిమాటోగ్రఫీ ఒకే. 


సేనాపతి పాత్రకు కమల్ హాసన్ మరోసారి న్యాయం చేశారు. ఆయన వరకు ఓకే. ఆ నటన పర్వాలేదు. అరవింద్ పాత్రలో సిద్ధార్థ్ చక్కటి నటన కనబరిచారు. కమల్ (Kamal Haasan)తో ఫేస్ ఆఫ్ సీన్, సముద్రఖనితో ఎమోషనల్ సీన్ ఆయన చేసిన తీరు సూపర్బ్. 'బొమ్మరిలు' క్లైమాక్స్ గుర్తు చేస్తారు. సముద్రఖని, బాబీ సింహా తమ తమ పాత్రలకు ప్రాణం పోశారు. ప్రియా భవానీ శంకర్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్.జె. సూర్య, గుల్షన్ గ్రోవర్, వివేక్, మనోబాల, బ్రహ్మానందం పాత్రల నిడివి తక్కువే. ఎవరికీ సరైన స్క్రీన్ స్పేస్ లభించలేదు. సినిమాలో ఎక్కువ మంది నటీనటులు ఉండటంతో థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత గుర్తుండే వారు తక్కువ.


'భారతీయుడు'తో 'భారతీయుడు 2'ను కంపేర్ చేయలేం. అది క్లాసిక్ అయితే... ఇది సోసో పాసబుల్ ఫిల్మ్. ఇప్పటి అవినీతిని తెరపైకి తీసుకు రావాలనే శంకర్ ఆలోచన బావుంది, మెచ్చుకోతగ్గది. కానీ, ఆయనలో దర్శకుడు ఆ ఆలోచనకు న్యాయం చేయలేదు. శంకర్ సినిమాల్లో వినిపించే, కనిపించే సంగీతం లేకపోవడం ఓ లోటు అయితే... నిడివి ఎక్కువ కావడం ప్రధానమైన లోటు. నటుడిగా కమల్ గురించి కొత్తగా చెప్పేది ఏముంది? ఆయన ఓకే. సిద్ధార్థ్ చక్కగా చేశాడు. మెప్పిస్తాడు. మనసులోంచి 'భారతీయుడు' సినిమాను తీసేసి ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే... 'భారతీయుడు 2'ను చూడగలం. లేదంటే కష్టం అవుతుంది.


రేటింగ్: 2.75/5


Also Read'హనీమూన్ ఎక్స్‌ప్రెస్' రివ్యూ: బాబోయ్... చైతన్య, హెబ్బా మధ్య ఆ రొమాన్స్ ఏంటి? అసలు ఆ కథేంటి?