Avantika Vandanapu ‘Mean Girls- The Musical‘ Movie: తెలుగమ్మాయి అవంతిక వందనపు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. 2018లో చైల్డ్ ఆర్టిస్టుగా టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ‘బ్రహ్మోత్సవం‘, ‘మనమంతా‘, ‘ప్రేమమ్‘, ‘అజ్ఞాతవాసి‘,'రారండోయ్ వేడుక చూద్దాం' సహా పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఈ అమ్మాయి సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించి ఈమె, ప్రస్తుతం హాలీవుడ్ లో సత్తా చాటుతోంది. ఇప్పటికే ఆమె నటించిన ‘స్పిన్‘ మూవీ మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ చిత్రంలో అమెరికాలో స్థిరపడిన ఎన్నారై కుటుంబంలో పుట్టిన రియా అనే అమ్మాయిగా నటించి ఆకట్టుకుంది అవంతిక. ఇక 'డైరీ ఆఫ్ ఎ ఫ్యూచర్ ప్రెసిడెంట్', 'కమలా', 'రాయల్ డిటెక్టివ్', 'మోక్సీ' చిత్రాల్లోనూ నటించింది. తాజాగా అవంతిక కీలక పాత్ర పోషించిన 'మీన్ గర్ల్స్- ది మ్యూజికల్' విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో ఆమె నటనకు విమర్శకులు ప్రశంసలు దక్కుతున్నాయి.


అవంతిక నటనకు విమర్శకుల ప్రశంసలు


సమంత జేన్, ఆర్టురో పెరెజ్ జూనియర్ తెరకెక్కించిన 'మీన్ గర్ల్స్- ది మ్యూజికల్' లో కరేన్ శెట్టి పాత్రలో అవంతిక నటించింది. పారామౌంట్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించింది. 'మీన్ గర్ల్స్- ది మ్యూజికల్' అనేది అమెరికన్ మ్యూజికల్ టీన్ కామెడీ చిత్రం. ఇందులో అంగోరీ రైస్, ఔలీ క్రావాల్హో, క్రిస్టోఫర్ బ్రినీ, రెనీ, ఫే, టిమ్ మెడోస్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సంబంధించిన పనులు 2020లో ప్రారంభం అయ్యాయి. డిసెంబర్ 2022లో షూటింగ్ ప్రారంభమైంది. ఏప్రిల్ 2023 వరకు షూటింగ్ కంప్లీట్ అయ్యింది. జనవరి 8, 2024న న్యూయార్క్ లో ఈ సినిమాను ప్రదర్శించారు. జనవరి 12న అమెరికాలో పారామౌంట్ పిక్చర్స్ ద్వారా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాపై విమర్శలకుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి.






వరుస సినిమాల్లో నటిస్తున్న అవంతిక


ప్రస్తుతం అవంతిక 'ఎ క్రౌన్ ఆఫ్ విషెస్' పేరుతో తెరకెక్కుతున్న సిరీస్ లో నటిస్తోంది. డిస్నీ బ్రాండెడ్ టెలివిజన్ కోసం ఈ లైవ్ యాక్షన్ యంగ్ అడల్ట్ సిరీస్‌ రూపొందుతోంది. అంతేకాదు, ఈ సిరీస్ కు ఆమె ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్ గా పని చేస్తోంది. ఈ ఘనతను సాధించిన అతి చిన్న వయస్కురాలిగా అవంతిక గుర్తింపు తెచ్చుకుంది. అటు స్క్రీన్ జెమ్స్ 'హారర్‌స్కోప్'లో ప్రధాన పాత్రలో కనిపించనుంది. అవంతిక ఇండియన్ ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే జాతీయ అవార్డు గ్రహీత సుదాన్షు సరియా దర్శకత్వం వహించిన అమెజాన్ ప్రైమ్ 'మసూమ్' లో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సిరీస్  షూటింగ్‌లో ఉంది.


2018లో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అవంతిక టాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లోనూ రాణిస్తోంది.అవంతిక అమెరికాలోని కాలిఫోర్నియాలో పెరిగింది. చార్టర్డ్ అకౌంటెంట్ అనుపమ రెడ్డి చింతల, సాఫ్ట్‌ వేర్ ఇంజనీర్  శ్రీకాంత్ వందనపు ఏకైక సంతానం. అవంతిక కూచిపూడి, కథక్, జాజ్, ఇండియన్ కాంటెపరరీ డ్యాన్సులన్నీ నేర్చుకుంది. బొమ్మలు  కూడా అద్భుతంగా గీస్తుంది. 


 Read Also: ముంబైలో కీర్తి సురేష్ మూవీ షురూ - తమిళ సినిమా రీమేక్‌తో బాలీవుడ్‌కు