VD18 Pooja Ceremony: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ల్ హీరోయిన్లుగా ఎదిగిన పలువురు హీరోయిన్లు ఇప్పటికే హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు. రష్మిక మందన్న, పూజా హెగ్డే, రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో రాణిస్తున్నారు. రీసెంట్ గా ‘జవాన్’ మూవీతో లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా హిందీ ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఇప్పుడు మహానటి బ్యూటీ కీర్తి సురేష్ సైతం బాలీవుడ్ లోకి వెళుతున్నారు. ఆమె తొలి హిందీ సినిమాకు సంబంధించిన ప్రారంభ వేడుక ముంబైలో ఘనంగా జరిగింది.


ప్రియా అట్లీ నిర్మాతగా రూపొందుతున్న ‘VD18’


బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కలీస్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ‘జవాన్’ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న అట్లీ ఈ సినిమాను సమర్పిస్తున్నారు. జియో స్టూడియో సైతం ప్రెజెంట్ చేస్తోంది. అట్లీ సతీమణి ప్రియా, మురాద ఖేతన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కలీస్ తొలిసారి బాలీవుడ్ మూవీ చేస్తున్నారు. ఇప్పటికే తమిళంలో ఆయన ఓ సినిమా చేశారు. సౌత్ స్టార్ బ్యూటీ కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. వామికా గబ్బి మరో కీలక పాత్రలో కనిపించబోతోంది.


ముంబైలో అట్టహాసంగా ఓపెనింగ్ సెరిమనీ


‘VD18’ ఈ సినిమాకు సంబంధించిన ఓపెనింగ్ సెరిమనీ ఘనంగా జరిగింది. ముంబైలో జరిగిన ఈ వేడుకలో హీరో, హీరోయిన్లు వరుణ్ ధావన్, కీర్తి సురేష్, వామిక గబ్బి పాల్గొన్నారు. దర్శకుడు అట్లీ, నిర్మాతలు ప్రియా అట్లీ, మురాద ఖేతన్ సైతం హాజరయ్యారు. పూజా వేడుకల అనంతరం షూటింగ్ మొదలు పెట్టారు. త్వరలో రెగ్యుల్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోది.






‘తేరీ’ రీమేక్ గా తెరకెక్కుతున్న ‘VD18’


వరుణ్ ధావన్, కీర్తి సురేష్ జంటగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సెంటిమెంట్, యాక్షన్ సమపాళ్లలో ఉండనున్నట్లు తెలుస్తోంది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘తేరీ’ సినిమాకు హిందీ రీమేక్ గా ఈ సినిమా రూపొందుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. చిత్రబృందం మాత్రం ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం ‘VD18’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి త్వరలో టైటిల్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.   


కీర్తి సురేష్ తెలుగులో చివరిసారిగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘భోళాశంకర్’ చిత్రంలో కనిపించింది. ఈ మూవీలో ఆమె చిరంజీవి చెల్లిగా కనిపించింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో తమన్నా హీరోయిన్ గా నటించింది. సుశాంత్ కు జోడీగా కీర్తి కనిపించింది. అయితే, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. అటు ‘రఘు తాత’ సినిమాలోనూ కీర్తి సురేష్ కనిపించబోతోంది. ఈ చిత్రాన్ని హొంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాతో హొంబలే ఫిల్మ్స్ తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతోంది.


Read Also: నా మాట నిజమైంది, ఆ రెండు పేర్లు మార్మోగుతాయ్: తేజ సజ్జ