Nagarjuna Akkineni's Naa Saami Ranga movie review in Telugu: కింగ్ అక్కినేని నాగార్జున కథానాయకుడిగా నటించిన సినిమా 'నా సామి రంగ'. సంక్రాంతి బరిలో విడుదల చేయాలని పట్టుబట్టి మరీ మూడు నెలల్లో సినిమా పూర్తి చేశారు. 'సోగ్గాడే చిన్ని నాయనా', 'బంగార్రాజు' సినిమాలను సంక్రాంతికి విడుదల చేసి విజయాలు అందుకున్న నాగార్జున... 2024 సంక్రాంతికి 'నా సామి రంగ' సినిమాతో విజయం అందుకుంటారా? దర్శకుడిగా పరిచయమైన విజయ్ బిన్నీ ఎలా చేశారు? ఈ రివ్యూలో చూద్దాం. 


కథ: కిష్టయ్య (నాగార్జున) అనాథ. చిన్నతనంలో అంజి ('అల్లరి' నరేష్) తల్లి అతడిని చేరదీస్తుంది. ఆమె మరణం తర్వాత ఒకరికొకరు తోడుగా... అన్నదమ్ముల కంటే ఎక్కువగా కిష్టయ్య, అంజి కలిసి మెలిసి ఉంటారు. చిన్నప్పుడు తమకు సాయం చేసినందుకు అంబాజీపేట ఊరి ప్రెసిడెంట్ పెద్దయ్య (నాజర్)కు అమితమైన గౌరవం ఇస్తారు. కిష్టయ్య అంటే పెద్దయ్య కూడా అంతే ప్రేమ చూపిస్తారు. 


కిష్టయ్య, వరాలు (ఆషికా రంగనాథ్) ప్రేమించుకుంటారు. ఆ ప్రేమ విషయాన్ని పెద్దయ్యకు చెప్పడానికి వస్తారు. వరాలు తండ్రి వరదరాజులు (రావు రమేశ్) పెద్దయ్య కుమారుడు దాసు (షబ్బీర్ కాళ్లరక్కల్)కి తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయాలని సంబంధం కుదుర్చుకోవడానికి వస్తాడు. కిష్టయ్య, వరాలు ప్రేమ వ్యవహారం తెలిసి కొడుక్కి అనుకున్న సంబంధాన్ని వదిలేస్తాడు పెద్దయ్య. 


కిష్టయ్యకు వరాలును ఇచ్చి పెళ్లి చేయడానికి ఆమె తండ్రి ఒప్పుకున్నాడా? తాను పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి కిష్టయ్య కోసం తనను వదిలేయడాన్ని ఎంత మాత్రం సహించలేని దాసు ఏం చేశాడు? పొరుగూరు జగన్నపేట ప్రెసిడెంట్ కుమార్తె కుమారి (రుక్సార్ థిల్లాన్)తో అంబాజీపేట కుర్రాడు భాస్కర్ (రాజ్ తరుణ్) ప్రేమ కారణంగా రెండు గ్రామాల మధ్య ఎటువంటి పరిస్థితి ఏర్పడింది? కిష్టయ్య, అంజిలను చంపాలనుకున్న దాసు ప్లాన్ వర్కవుట్ అయ్యిందా? లేదా? అనేది సినిమా.  


విశ్లేషణ: పల్లెటూరి నేపథ్యంలో కథలు వచ్చేసరికి నాగార్జునలో హుషారు వస్తుంది. అది స్క్రీన్ మీద మరోసారి కనిపించింది. లుంగీ, షర్టు వేసి గోదావరి యాసలో 'నా సామి రంగ' అంటూ ఫెంటాస్టిక్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఆయనకు ధీటుగా అంజి పాత్రలో 'అల్లరి' నరేష్ అద్భుతంగా నటించారు. 'గమ్యం' తర్వాత ఆయనకు ఆ స్థాయిలో పేరు తీసుకొచ్చే పాత్ర అవుతుంది. 


సాధారణంగా హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ డిస్కషన్ పాయింట్ అవుతుంది. 'నా సామి రంగ' సినిమాకు వస్తే... నాగార్జున & 'అల్లరి' నరేష్ కెమిస్ట్రీ, ఆ బాండింగ్ గురించి ప్రేక్షకులు సైతం మాట్లాడతారు. అల్లరి నరేష్, మిర్నా మీనన్ ఫస్ట్ నైట్ సీన్, హీరో హీరోయిన్లు నాగార్జున, ఆషిక మధ్య కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. వాటిలో నాగ్, నరేష్ మధ్య డైలాగులు ప్రతి ఒక్కర్నీ నవ్విస్తాయి. వీలు కుదిరిన ప్రతిసారీ ప్రసన్న కుమార్ మంచి సంభాషణలు రాశారు. 


వరాలు పాత్రలో హీరోయిన్ ఆషికా రంగనాథ్ అందంగా కనిపించారు. అద్భుతంగా నటించారు. నాగార్జున, ఆషిక మధ్య సీన్లను చక్కగా రాశారు. షబ్బీర్ విలనిజం బావుంది. నాజర్, రాజ్ తరుణ్, మిర్నా మీనన్, భరత్ రెడ్డి, రవి వర్మ, హర్షవర్ధన్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.


'నా సామి రంగ'లో నటీనటులంతా బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. అయితే... కథ & కథనంలో కొత్తదనం లేదు. రొటీన్‌గా ఉంటుంది. ఇంతకు ముందు సినిమాల్లో చూసేశాం అన్నట్లు ఉంటుంది. కానీ, కమర్షియల్ ప్యాకేజీగా ప్రజెంట్ చేయడంలో దర్శకుడిగా పరిచయమైన విజయ్ బిన్నీ కొంత సక్సెస్ అయ్యారు. సినిమాలో మాస్ కామెడీ అండ్ మూమెంట్స్ ఉన్నాయి. యాక్షన్ సీన్లు బాగా డిజైన్ చేశారు. అయితే, కాన్‌ఫ్లిక్ట్స్ బలంగా లేవు. రెండు ఊర్ల మధ్య గొడవ, హీరో & విలన్ మధ్య గొడవకు చూపించిన కారణాలు ఇంతకు ముందు చూసినట్టు ఉంటాయి.


Also Read: సైంధవ్ రివ్యూ : సైకోగా వెంకటేష్ ఎలా చేశారు? ఆయన 75వ సినిమా హిట్టా? ఫట్టా?


కీరవాణి పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు బలంగా నిలిచాయి. రూరల్ బ్యాక్ డ్రాప్ సినిమాలు అంటే కీరవాణి బెస్ట్ అనేలా కొన్ని సీన్లకు ఆయన రీ రికార్డింగ్ ఇచ్చారు. శ్రీనివాసా చిట్టూరి ప్రొడక్షన్ వేల్యూస్ పర్వాలేదు. సంక్రాంతి టార్గెట్ పెట్టుకుని స్పీడుగా చేయడంతో కొన్ని సన్నివేశాల్లో సీజీ వర్క్ 100 పర్సెంట్ పర్ఫెక్ట్‌గా రాలేదు. 


చివరగా... 'నా సామి రంగ' మాస్ ఎంటర్‌టైనర్. సంక్రాంతి ఫెస్టివల్ మూడ్ ఫిల్మ్. నాగార్జున, నరేష్, ఆషిక నటన ఆకట్టుకుంటుంది. సినిమాలో కామెడీ ఉంది. మాంచి యాక్షన్ సీన్లు ఉన్నాయి. కీరవాణి సంగీతం ఉంది. కమర్షియల్ ప్యాకేజ్ ఫిల్మ్. కానీ, కథలో బలం లేకపోవడంతో కొన్ని చోట్ల తేలిపోయింది. ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే ఎంజాయ్ చేయవచ్చు.


Also Readగుంటూరు కారం రివ్యూ: మహేష్ బాబు ఎనర్జీ & ఆ మాస్ సూపర్, మరి సినిమా?