Venkatesh Saindhav Review In Telugu: వెంకటేష్‌కు కుటుంబ ప్రేక్షకులలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే... ఆయనలో మాంచి మాస్ హీరో ఉన్నారు. ధర్మ చక్రం, గణేష్, లక్షీ, తులసి సినిమాల్లో యాక్షన్ సీక్వెన్సుల్లో ఎక్స్ట్రాడినరీగా చేశారు. వెంకీ నుంచి కుటుంబ ప్రేక్షకులు ఆశించే ఎమోషన్స్, సెంటిమెంట్‌తో పాటు మాస్ అంశాలు 'సైంధవ్'లో పుష్కలంగా ఉన్నాయని ట్రైలర్ చూశాక అనిపించింది. మరి, సినిమా ఎలా ఉంది? 'హిట్' సిరీస్ తీసిన దర్శకుడు శైలేష్ కొలను ఈ సినిమా ఎలా తీశారు? అనేది రివ్యూలో చూద్దాం.


కథ: సైంధవ్ కోనేరు (వెంకటేష్) చంద్రప్రస్థలో పోర్ట్ ఉద్యోగి. పాప గాయత్రి (సారా పాలేకర్) అంటే అతనికి ప్రాణం. మనోజ్ఞ (శ్రద్దా శ్రీనాథ్) క్యాబ్ డ్రైవర్. సైంధవ్ పక్కింట్లో ఉంటుంది. భర్త (గెటప్ శ్రీను) కొట్టడంతో అతడి మీద కేసు పెట్టి ఇంటికి వచ్చేస్తుంది. సైంధవ్ అంటే మనోజ్ఞకు ప్రాణం. అతని బిడ్డను తన కన్నకుతురిలా చూసుకుంటుంది. ఒక రోజు గాయత్రి ఉన్నట్టుండి కింద పడిపోతుంది. పాపకు ఎస్ఎంఏ వ్యాధి ఉందని, బతకాలంటే రూ. 17 కోట్లు ఖరీదు చేసే ఇంజెక్షన్ చేయాలని డాక్టర్లు చెబుతారు. 


సైంధవ్ ఫ్యామిలీ హిస్టరీ పక్కన పెడితే... ఒక రోజు చంద్రప్రస్థ పోర్టుకు భారీ ఎత్తున గన్స్, డ్రగ్స్, ఫేక్ కరెన్సీ వస్తాయి. కస్టమ్స్ అధికారి మూర్తి (జయప్రకాశ్) సీజ్ చేసి, ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరాలు వెల్లడిస్తారు. మిత్రా (ముఖేష్ రుషి), వికాస్ మాలిక్ (నవాజుద్దీన్ సిద్ధిఖీ), మైఖేల్ (జిష్షు సేన్ గుప్తా) తదితరులు భాగస్వామిగా ఉన్న కార్టల్ బృందానికి చెందినవి. వాటి కోసం మూర్తి దగ్గరకు వికాస్ తన మనుషుల్ని పంపిస్తే సైంధవ్ చంపేస్తాడు. సైకో అలియాస్ సైంధవ్ కోనేరు మళ్లీ వచ్చాడని తెలిసి మిత్రా సహా గ్యాంగ్‌స్టర్స్ అందరూ ఒక్కసారి షాక్ అవుతారు. 


సైకో ఫ్లాష్ బ్యాక్ ఏంటి? కార్టల్ పెద్దలు, సైంధవ్ మధ్య ఏం జరిగింది? తన పాపకు ఇంజెక్షన్ చేయించాలని సైంధవ్ ప్రయత్నిస్తుంటే వికాస్ ఎందుకు అడ్డు పడ్డాడు? ఇంజెక్షన్ కోసం డ్రగ్స్, గన్స్, ఫేక్ కరెన్సీని వికాస్‌కు సైంధవ్ ఇచ్చేశాడా? చివరకు ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 


విశ్లేషణ: థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు... కథపై నమ్మకంతో 'సైంధవ్' తీశారా? లేదంటే హీరో క్యారెక్టరైజేషన్ మీద నమ్మకం పెట్టుకుని సినిమా తీశారా? అని సందేహం కలుగుతుంది. 'సైంధవ్' కథ ఏమీ కొత్తది కాదు. 'బాషా' రోజుల నుంచి చూస్తున్న రొటీన్ ప్యాట్రన్ స్క్రీన్ ప్లే & స్టోరీయే. గతాన్ని పక్కనపెట్టి సామాన్యుడిగా బతికే హీరోకి సమస్య వస్తే... మళ్లీ పాత శత్రువులతో యుద్ధం చేయాల్సి వస్తే... ఈ కథ మొదలైన కాసేపటికి క్లైమాక్స్ ఎలా ఉండబోతుందనే క్లారిటీ వస్తుంది.


'సైంధవ్' చూస్తున్నప్పుడు... కమల్ హాసన్ 'విక్రమ్', రజనీకాంత్ 'జైలర్' గుర్తుకొస్తే అది ప్రేక్షకుల తప్పు కాదు. ఎందుకంటే... మూడు సినిమాల మధ్య సిమిలారిటీస్ కొన్ని ఉన్నాయి. హీరోలు వయసుకు తగ్గ పాత్రలు చేయడం, వాళ్ల కుటుంబ నేపథ్యం ఒకేలా ఉంటాయి. కాకపోతే ఓ తేడా ఏమిటంటే... 'విక్రమ్', 'జైలర్' సినిమాల్లో హీరోలు తాత పాత్రలు చేశారు. ఇందులో వెంకీ తండ్రి రోల్ చేశారు. విక్రమ్, జైలర్ హీరోలు ముందు నుంచి మంచోళ్లు.  'సైంధవ్'లో హీరో హాలీవుడ్ హిట్ ఫ్రాంచైజీ 'జాన్ విక్'లో హీరో తరహాలో ముందు గ్యాంగ్‌స్టర్స్ దగ్గర పని చేసి, వాళ్లకు దూరంగా బతుకుతుంటాడు. బాషా టైపులో. హాలీవుడ్ సినిమాలు చూసే ప్రేక్షకులకు అయితే జాన్ విక్ ఎక్కువ గుర్తుకొస్తుంది. ఆ సిరీస్ సీన్లు 'సైంధవ్'లో చాలా ఉన్నాయి. కథ, క్యారెక్టర్ల విషయంలో శైలేష్ కొలను 'జాన్ విక్'ను యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అయ్యారు. అయితే... ఆ మేజిక్ క్రియేట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు.


గతంలో మనం చూసిన సినిమాలన్నీ పక్కన పెట్టేసి... 'సైంధవ్'ను కొత్త సినిమాగా చూద్దామని ప్రయత్నించినా సరే శైలేష్ కొలను తీసిన తీరు ఆకట్టుకోవడం కష్టం. ఈ సినిమాలో సెంటిమెంట్, యాక్షన్, ఎమోషన్... అన్నీ ఉన్నాయి. అయితే... పూలు అన్నిటినీ చక్కగా పేరిస్తే దండ అందంగా కనిపిస్తుంది. లేదంటే చిందర వందరగా ఉంటుంది. ఈ సినిమా కూడా అంతే! సన్నివేశాల మధ్య కనెక్షన్ ఉండదు. సంతోష్ నారాయణన్ అందించిన పాటలు పర్వాలేదు. కానీ, నేపథ్య సంగీతం అసలు బాలేదు. హీరోయిజాన్ని అసలు ఎలివేట్ చేయలేదు. నిర్మాణ విలువలు బావున్నాయి. 


సైంధవ్ పాత్రకు వెంకటేష్ ప్రాణం పోశారు. ఎమోషనల్ సీన్స్ ఎంత బాగా చేశారో... అంతే ఎఫెక్టివ్‌గా ఫైట్స్ చేశారు. యాక్షన్ సీక్వెన్సుల్లో ఆయన చూపించిన ఈజ్ బావుంది. నవాజుద్దీన్ సిద్ధికీ సైతం బాగా చేశారు. హిందీ, తెలుగు మిక్స్ చేస్తూ ఆయన చెప్పే డైలాగులు బావున్నాయి. చివరకు వచ్చేసరికి ఆ డైలాగ్స్ కూడా బోర్ కొడతాయి. హిందీలో ఆయన డైలాగ్ చెబుతూ ఆండ్రియాను ట్రాన్స్‌లేట్ చేయమని అడుగుతుంటే 'ఇక చాలు' అని చెప్పాలనిపిస్తుంది. 


Also Read: గుంటూరు కారం రివ్యూ: మహేష్ బాబు ఎనర్జీ & ఆ మాస్ సూపర్, మరి సినిమా?


వెంకటేష్, నవాజుద్దీన్ క్యారెక్టర్లు, ఆ క్యారెక్టరైజేషన్ల మీద పెట్టిన కాన్సంట్రేషన్ ఇతర ఆర్టిస్టుల మీద దర్శకుడు శైలేష్ కొలను పెట్టలేదు. తమిళ హీరో ఆర్యది అతిథి పాత్ర తరహాలో ఉంటుంది. శ్రద్ధా శ్రీనాథ్, ముఖేష్ రుషి, జిష్షు సేన్ గుప్తా, రుహానీ శర్మ, జయప్రకాశ్ తదితరులు తమ తమ పాత్రల పరిధి చేశారు. అయితే, ప్రతి ఒక్కరిది రొటీన్ రోల్. సర్‌ప్రైజ్స్ ఏం ఉండవు.


సైకో... సైంధవ్ కోనేరుగా వెంకటేష్ బాగా చేశారు. ఆయన నటన, యాక్షన్ సీక్వెన్స్ నచ్చుతాయి. అయితే... సినిమా మాత్రం డిజప్పాయింట్ చేస్తుంది. విక్రమ్, జైలర్ తరహాలో కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడంలో 'సైంధవ్' ఫెయిల్ అయ్యింది.


Also Readకాథల్ ది కోర్ రివ్యూ: అమెజాన్ ఓటీటీలో మమ్ముట్టి గే రోల్ చేసిన సినిమా... జ్యోతిక డామినేట్ చేసిందా?