Teja Sajja About HanuMan Success: చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని అందుకున్న సినిమా ‘హనుమాన్’. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా రూపొందిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ ‘గుంటూరు కారం’తో పాటుగా బరిలోకి దిగింది. తొలి షో నుంచే ఈ చిత్రం పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు తేజ నటన, ప్రశాంత్ వర్మ కథను నడిపించిన తీరుపై ప్రశంసల జల్లు కురిపించారు. ‘హనుమాన్’ అద్భుతం అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ఆడుతున్న థియేటర్ల ముందు హౌస్ ఫుల్ బోర్డులు దర్శనం ఇస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా తొలి రోజు రూ.20 కోట్లకు పైగా వసూళు చేసినట్లు తెలుస్తోంది.


దేశ వ్యాప్తంగా సూపర్ హిట్ టాక్


ఇక ఈ చిత్రంలో ‘హనుమాన్’ పాత్రలో తేజ సజ్జ అద్భుతంగా నటించారని ఆడియెన్స్ అంటున్నారు. సూపర్ హీరో స్టోరీని పురాణ కథతో ముడిపెడుతూ, నెటివిటీ మిస్ కాకుండా సినిమాను తీసిన ప్రశాంత్ వర్మను అందరూ అభినందిస్తున్నారు. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిలోనూ పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోంది. ఇక తాజాగా ఈ సినిమా బృందం ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో తేజ సజ్జ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హనుమంతుడే వెనుకుండి ‘హనుమాన్’ను సక్సెస్ చేశారని అభిప్రాయపడ్డాడు.  


‘హనుమాన్’ నిలబడింది, మమ్మల్ని నిలబెట్టింది- తేజ


‘హనుమాన్’ మూవీకి దేశ వ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వస్తుందని తేజ వెల్లడించాడు. ఈ సినిమాకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా హనుమంతుడే వెనుకుండి నడిపించారని  చెప్పాడు. “దేశ వ్యాప్తంగా ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. మమ్మల్ని వెనుక ఉండి ఓ డివైన్ పవర్ నడిపించింది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ముందుకు తీసుకెళ్లింది. ఆ హనుమంతుడే మమ్మల్ని నడిపించాడు అనుకుంటున్నాం. సినిమా థియేటర్ కు వెళ్తే ప్రేక్షకుల నుంచి వచ్చే రెస్పాన్స్ అద్భుతంగా ఉంది. సినిమా చూసి ప్రేక్షకులు ఎంతో ఎమోషన్ అయ్యారు. నా జీవితంలో ఇంత గొప్ప సినిమా మళ్లీ చేస్తానో? లేదో? తెలియదు. దేశ వ్యాప్తంగా ఇంతగొప్ప రెస్పాన్స్ వస్తుందో? లేదో? కూడా తెలియదు. ఈ సినిమాను చూసి ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞలు. ఈ సినిమా నిలబడుతుంది. మమ్మల్ని నిలబెడుతుంది అని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పాను. నా మాట ఇప్పుడు నిజం అయ్యింది. అంతేకాదు, ఇండియాలో త్వరలో రెండు పేర్లు వినిపిస్తాయి. ఒకటి ప్రశాంత్ నీల్, మరొకటి ప్రశాంత్ వర్మ అని చెప్పాను. అన్నట్లుగానే ఇప్పుడు రెండు పేర్లు మార్మోగుతున్నాయి. ఈ సినిమా కోసం చిత్రబృందంలోని ప్రతి ఒక్కరం కష్టపడ్డాం. ఈ సినిమా రెండు నెలల వరకు ఓటీటీలోగానీ, టీవీలో గానీ రాదు. అందుకే థియేటర్లలో చూడాలని కోరుతున్నాం” అన్నాడు. 'హనుమాన్' మూవీలో తేజ సజ్జకు జంటగా అమృత అయ్యర్ నటించింది. కోలీవుడ్​ నటి వరలక్ష్మి శరత్‌కుమార్, సీనియర్ నటుడు, దర్శకుడు  సముద్రఖని ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి నిర్మించారు.


Read Also: థియేటర్లలో ‘హనుమాన్‌’ తుఫాన్, ‘ఆదిపురుష్‌’ డైరెక్టర్‌ను ఆడేసుకుంటున్న నెటిజన్లు