HanuMan Movie: యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించి  ప్రతిష్టాత్మక చిత్రం ‘హనుమాన్’. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తొలి షో నుంచే ప్రేక్షకులు ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. యంగ్ హీరో తేజ సజ్జతో కలిసి చక్కటి సినిమా తీశారని అభినందిస్తున్నారు. సినిమా కథ, కథ నడిపించే విధానం, వీఎఫ్ఎక్స్, ఎమోషన్స్ అన్నీ అద్భుతంగా తెరకెక్కించారని కొనియాడుతున్నారు.


ఓం రౌత్ పై నెటిజన్ల విమర్శలు


‘హనుమాన్’ బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన నేపథ్యంలో ప్రభాస్, ఓం రౌత్ కాంబోలో తెరకెక్కిన ‘ఆదిపురుష్’ సినిమాను నెటిజన్లు టార్గెట్ చేస్తున్నారు. ‘హనుమాన్’ సినిమాను చూసి ఓం రౌత్ నేర్చుకోవాలని సలహా ఇస్తున్నారు. గత ఏడాది విడుదలైన ‘ఆదిపురుష్’ సినిమా ఏకంగా రూ. 550 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ సినిమా టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఓ రేంజిలో ట్రోలింగ్ ఎదుర్కొంది. ప్రభాస్ లాంటి పాన్ ఇండియన్ స్టార్ తో కార్టూన్ మూవీ తీసినట్లు ఉందని తీవ్ర విమర్శలు వచ్చాయి. వీఎఫ్ఎక్స్ చాలా చెత్తగా ఉన్నాయని తిట్టిపోశారు. ట్రోలింగ్ దెబ్బకు సినిమా రిలీజ్ సైతం వాయిదా వేసుకున్నారు ఓం రౌత్. గ్రాఫిక్స్ విషయంలో మెరుగులు దిద్దారు. అయినప్పటికీ, థియేటర్లలో విడుదలయ్యాక, ఈ సినిమాను చూసి ప్రేక్షకులు షాక్ అయ్యారు. ఇదేం సినిమారా బాబూ! అంటూ తలలు పట్టుకున్నారు. ఈ సినిమా ద్వారా రాముడిని కించపరిచారంటూ కేసులు కూడా నమోదయ్యాయి.


ప్రశాంత్ వర్మను చూసి నేర్చుకోండి!


తాజాగా ‘హనుమాన్’ సక్సెస్ అయిన నేపథ్యంలో నెటిజన్లు మరోసారి ఓం రౌత్‌ ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ‘ఆదిపురుష్’ వీఎఫ్ఎక్స్, ‘హనుమాన్’ వీఎఫ్ఎక్స్ తో పోల్చి విమర్శలు చేస్తున్నారు. ‘హనుమాన్’ దర్శకుడిపై పొగడ్తల వర్షం కురిపిస్తూ, ఓం రౌత్ ను ఆటాడేసుకుంటున్నారు. ‘ఆదిపురుష్’ సినిమా విడుదల సందర్భంగా ప్రతి థియేటర్లో హనుమంతుడి కోసం ఒక సీటు ఖాళీగా ఉంచారు. ఇప్పుడు ‘హనుమాన్’ మూవీ ఆడే సినిమా థియేటర్లలో ఓం రౌత్ కోసం ఓ సీటు వదిలేయాలంటూ ట్రోల్ చేస్తున్నారు. చిన్న సినిమా అయినా, ప్రశాంత్ వర్మ ఎలా తీశారో చూసి నేర్చుకోవాలి అంటున్నారు.






















‘హనుమాన్’ బడ్జెట్ కేవలం రూ. 25 కోట్లు


‘ఆదిపురుష్’ సినిమాను ఓం రౌత్ రూ. 550 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కించారు. ప్రపంచ స్థాయి వీఎఫ్ఎక్స్ డిజైనర్స్ ఈ సినిమా కోసం పని చేశారు. కానీ, ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర దారుణ పరాజయం పాలైంది. ‘హనుమాన్’ సినిమాను ప్రశాంత్ వర్మ కేవలం రూ. 25 కోట్లతో తెరకెక్కించారు. వీఎఫ్ఎక్స్ సైతం ‘ఆదిపురుష్’ను తలదన్నేలా ఉండటంతో నెటిజన్లు ఓం రౌత్ ను టార్గెట్ చేస్తున్నారు.  


Read Also: ‘గుంటూరు కారం’లో ఘాటు మిస్సైందా? గురూజీ మడతపెట్టేశారట - ప్రేక్షకుల రివ్యూ ఇది