Ram Mandir Opening: 


రామ్‌చరిత్ మానస్ కాపీలకు డిమాండ్..


అయోధ్య ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు (Ayodhya Ram Manidr Opening) ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దేశమంతా ఈ మహత్తర కార్యక్రమం కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. ఈ క్రమంలోనే యూపీలోని గోర్‌ఖప్‌రూలో ఉన్న గీతా ప్రెస్‌ ఆసక్తికర విషయం వెల్లడించింది. అయోధ్య ఉత్సవం సందర్భంగా రామ్‌చరిత్‌ మానస్ (Ramcharitmanas) పుస్తకాలకు డిమాండ్ అమాంతం పెరిగిందని తెలిపింది. 50 ఏళ్లలో ఎప్పుడూ లేని స్థాయిలో గిరాకీ పెరిగిందని గీతా ప్రెస్‌ నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.





రాముడి ప్రాణప్రతిష్ఠ (Ram Mandir) ముహూర్తం ప్రకటించినప్పటి నుంచే రామ్‌చరిత్‌మానస్ పుస్తకాలు కొనేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారని వెల్లడించారు. గతంలో నెలకు 75 వేల కాపీలు ప్రింట్ చేస్తే..ఇప్పుడు దాదాపు లక్ష కాపీలు ప్రింట్ చేస్తోంది గీతా ప్రెస్. అంటే ఏ మేర గిరాకీ ఉందో అర్థం చేసుకోవచ్చు. 


"అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ ముహూర్తం ప్రకటించిన వెంటనే రామ్‌చరిత్ మానస్ పుస్తకాలకు గిరాకీ పెరిగింది. అప్పటి నుంచి ఈ డిమాండ్ అలాగే కొనసాగుతోంది. దీంతో పాటు సుందరకాండ, హనుమాన్ చాలీసా పుస్తకాలకూ గిరాకీ ఎక్కువైంది. గతంలో అయితే...మేం నెలకు 75 వేల రామ్‌చరిత్ మానస్ కాపీలు ప్రింట్ చేసే వాళ్లం. ఇప్పుడు డిమాండ్‌ని దృష్టిలో పెట్టుకుని లక్ష వరకూ ప్రింట్ చేస్తున్నాం. అసలు స్టాక్‌ కూడా లేకుండా అమ్ముడవుతున్నాయి"


- లాల్‌మణి త్రిపాఠి, గీతా ప్రెస్ మేనేజర్ 


 






రామాలయంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా వేలాది మంది హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించారు. అయితే ఈ కార్యక్రమానికి హాజరుకావడానికి కాంగ్రెస్ అగ్రనాయకత్వం నిరాకరించింది. ప్రతిష్ఠ కార్యక్రమం సాయంత్రం సరయూ ఒడ్డున దీపావళి తరహా వేడుకలు జరుగుతాయని, దీపోత్సవంతో పాటు సరయూ ఒడ్డున బాణసంచా కాల్చనున్నట్లు ఓ అధికారి తెలిపారు. జనవరి 18 నుంచి అయోధ్యలో ప్రైవేటు భవనాల నిర్మాణాలపై నిషేధం విధిస్తున్నట్లు డివిజనల్ కమిషనర్ తెలిపారు.


Also Read: పొగమంచు కారణంగా ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్, 9 గంటల పాటు విమానంలోనే ప్యాసింజర్స్