IndiGo Flight Emergency Landing: 


ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..


ముంబయి నుంచి గౌహతి వెళ్తున్న ఇండిగో ఫ్లైట్‌ని ఉన్నట్టుండి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. బంగ్లాదేశ్ రాజధాని ధాకా ఎయిర్‌పోర్ట్‌లో ఫ్లైట్ ల్యాండ్ అయింది. తీవ్రమైన మంచు కమ్మేయడం వల్ల పైలట్ వెంటనే అప్రమత్తమయ్యాడు. అప్పటికప్పుడు విమానాన్ని ల్యాండ్ చేశాడు. ఫలితంగా ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. వాళ్లు అసహనానికి లోను కాకుండా ఫ్లైట్ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ...అప్పటికే ప్యాసింజర్స్ విసిగిపోయారు. గంటల కొద్దీ ఫ్లైట్‌లోనే ఉండిపోవాల్సి వచ్చిందని మండి పడ్డారు. కొంత మంది ప్రయాణికులు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు.





ఫ్లైట్‌లో 178 మంది ప్యాసింజర్స్ ఉన్నారు. దాదాపు నాలుగు గంటల పాటు అలాగే విమానంలోనే కూర్చోవాల్సి వచ్చింది. ఈ ప్రయాణికుల్లో ముంబయి యూత్ కాంగ్రెస్ చీఫ్ సూరజ్ సింగ్ ఠాకూర్‌ కూడా ఉన్నారు. X వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ముంబయి నుంచి గౌహతి వెళ్లాల్సిన ఫ్లైట్ ధాకాలో ల్యాండ్ అయిందని, గంటల కొద్ది వేచి చూడాల్సి వచ్చిందని చెప్పారు. కొంత మందైతే నాలుగు గంటల కన్నా ఎక్కువ సమయమే వేచి చూడాల్సి వచ్చిందని చెబుతున్నారు.





ఈ పోస్ట్‌లపై IndiGo స్పందించింది. అసౌకర్యానికి గురైన ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. వాతావరణం అనుకూలంగా  లేకపోవడం వల్ల అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని వివరించింది. ప్యాసింజర్స్‌కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చింది. అయితే...ధాకా నుంచి ఆల్టర్‌నేట్‌ ఫ్లైట్‌ని ఏర్పాటు చేస్తామని చెప్పినా అది ఎప్పుడు అక్కడి నుంచి టేకాఫ్‌ అయిందన్న వివరాలు మాత్రం తెలియరాలేదు.