Raja Singh On Nayanthara Annapoorani Movie: లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన ‘అన్నపూర్ణి’ సినిమా దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ ఈ సినిమాపై పలు హైందవ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ సినిమాను నిషేధించడంతో పాటు మేకర్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో కేసులు పెట్టాయి. వివాదం ముదరడంతో ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ మూవీని తొలగించింది. తాజాగా ఈ సినిమా వివాదంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు.
జీ స్టూడియోస్ ను బ్యాన్ చేయండి- రాజాసింగ్
‘అన్నపూర్ణి’ సినిమా హిందువులను అవమానించేలా ఉందని రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సినిమాలను తీసే దర్శకులతోపాటు నిర్మాణ సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గతంలో ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయని చెప్పిన ఆయన, భవిష్యత్ లో మళ్లీ రాకుండా ఉండేలా సీరియస్ యాక్షన్ అవసరం అన్నారు. “అన్నపూర్ణి’ సినిమాను నిర్మించిన జీ స్టూడియోస్ క్షమాపణలు చెప్పినట్లు తెలిసింది. క్షమాపణలు చెప్పినా ఇలాంటి ఘటనలు రిపీట్ అవుతూనే ఉన్నాయి. గతంలో హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చాలా సినిమాలు వచ్చాయి. పలుమార్లు వివాదం చెలరేగినా, క్షమాపణలతో సరిపెట్టాయి. అందుకే, ఈ సినిమాను నిర్మించిన జీ స్టూడియోస్ సంస్థపై బ్యాన్ విధించాలి. ఇలాంటి సినిమాలను తీసే నీలేష్ కృష్ణ లాంటి దర్శకులను అరెస్ట్ చేయాలి. హిందూ వ్యతిరేక సినిమాలు చేసే నటీనటులపైనా కఠిన చర్యలు తీసుకోవాలి. అప్పుడే, హిందూ వ్యతిరేక, లవ్ జిహాద్ ను ప్రోత్సహించే సినిమాలు రావడం ఆగిపోతాయి. ఓటీటీ కంటెంట్ మీద కూడా సెన్సార్ షిప్ ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్రహోంమంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేస్తున్నాను” అంటూ ఓ వీడియోను రిలీజ్ చేశారు.
‘అన్నపూర్ణి’ వివాదానికి కారణం ఏంటి?
‘అన్నపూర్ణి’ సినిమాలో నయనతార బ్రాహ్మణ అమ్మాయిగా నటించింది. ఈ సినిమాలో రాముడు మాంసం తిన్నట్లు చెప్తారు. హిందూ అమ్మాయి అయిన నయనతార నమాజ్ చేస్తుంది. వీటితో పాటు బ్రాహ్మణులను కించపరిచేలా చాలా సన్నివేశాలను ఈ సినిమాలో చూపించారని తీవ్ర విమర్శలు వచ్చాయి. అంతేకాదు, పలు రాష్ట్రాల్లో హిందూ సంఘాలు ఈ సినిమాపై కేసులు పెట్టాయి.
క్షమాపణలు చెప్పిన జీ స్టూడియోస్
‘అన్నపూర్ణి’ వివాదం ముదరడంతో జీ స్టూడియోస్ స్పందించింది. అభ్యంతరకర సన్నివేశాలను తొలగించనున్నట్లు తెలిపింది. అప్పటి వరకు ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ నుంచి తీసేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సినిమా ద్వారా ఎవరి మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం తమకు లేదన్నారు. ఒకవేళ ఎవరికైనా ఈ సినిమా వల్ల ఇబ్బంది కలిగితే క్షమాపణలు కోరుతున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది. ‘అన్నపూర్ణి’ సినిమాలో నయనతార ప్రధాన పాత్ర పోషించగా, నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. కార్తీక్ కుమార్, జై, సత్యరాజ్, పూర్ణిమ రవి కీలక పాత్రలు చేశారు. డిసెంబర్ 1న ఈ సినిమా విడుదల అయ్యింది.
Read Also: థియేటర్లలో ‘హనుమాన్’ తుఫాన్, ‘ఆదిపురుష్’ డైరెక్టర్‌ను ఆడేసుకుంటున్న నెటిజన్లు