Bandi Sanjay comments on KCR: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనడానికి ప్రణాళిక వేస్తున్నారని ఆరోపించారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత కేసీఆర్ ఎమ్మెల్యేల కొనుగోలు చేస్తారంటూ బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తన కుట్రలతో ఏమైనా చేస్తారని.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉందని అన్నారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టి ఆ నింద బీజేపీ మీద వేస్తారని విమర్శించారు. అందుకని ముందు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్‌ను బొంద పెట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అంటే జనం నమ్మబోరని అన్నారు. కరీంనగర్‌లో బండి సంజయ్ ఆదివారం మీడియాతో మాట్లాడారు.
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ మొండి పట్టుకు పోవద్దని బండి సంజయ్ అన్నారు. బీజేపీని గెలిపిస్తేనే రాష్ట్రానికి నిధులు వస్తాయని చెప్పారు. ప్రభుత్వాన్ని కూల్చాలన్న ఆలోచన ఏమాత్రం తమకు లేదని బండి సంజయ్ స్పష్టం చేశారు. ‘‘కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ టచ్‌లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ కోవర్టులు ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాతే ఏమైనా జరగవచ్చు. కోవర్టులకు గత ఎన్నికల్లో కేసీఆర్ భారీగా డబ్బులు సమకూర్చారని అన్నారు. తెలంగాణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించేందుకు మేం రెడీగా ఉన్నాం. బీఆర్‌ఎస్ అంటేనే పార్టీలను కూల్చేది. బీజేపీ అంటే నిర్మించే పార్టీ.
కేసీఆర్ భద్రాద్రి ఆలయానికి వచ్చి తలంబ్రాలు తీసుకురాలేరు. అలాంటి వాళ్లు బీజేపీపై విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీ అయితే ఇతర రాష్ట్రాల్లో ఎందుకు పోటీ చేయడం లేదు? తెలంగాణలోనే ఆ పార్టీకి అభ్యర్థులు దిక్కులేరు. గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో ఉండాల్సింది మోదీ ప్రభుత్వమే. వచ్చే ఎన్నికల్లో ఎక్కువ మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తేనే తెలంగాణకు అధిక నిధులు వస్తాయి’’ అని బండి సంజయ్ మాట్లాడారు.
రైతు బంధు నిధులు విడుదల చేయకపోవడంపై..
‘‘రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేరాలంటే.. కేంద్రంలో బీజేపీ ఎంపీలు ఎక్కువగా గెలవాలి. రాష్ట్రంలో అప్పులెలా తీరుస్తారు? రైతు బంధు అందక 48 లక్షల మంది రైతులు అల్లాడుతున్నరు. కేంద్ర సాయం లేకుంటే వాటినెలా తీరుస్తారు? రాష్ట్రానికి అప్పులు రావాలన్నా, అధిక నిధులు రావాలన్నా మోదీ ప్రభుత్వంతోనే సాధ్యం… రాహుల్ ప్రాపకం కోసమో, అధిష్టానం ఒత్తిడి తోనే బీజేపీపై విమర్శలు చేస్తే అది రాష్ట్రానికే నష్టమనే వాస్తవాన్ని గమనించాలి. రాష్ట్రంలోని కాంగ్రెస్, బీజేపీ నేతలు కలిసి పనిచేస్తే తెలంగాణకు అత్యధిక నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మోదీగారు ఎన్నికల వరకే రాజకీయాలు చేస్తారు.. ఎన్నికల తరువాత రాష్ట్రాల అభివ్రుద్ధికే అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు’’
మీ అమ్మ కడుపులోనే పుట్టారనడానికి ఆధారాలేంటి? - బండి సంజయ్
అయోధ్య రామ మందిరం రాజకీయాలకు అతీతంగా జరిగే కార్యక్రమం. ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. దీనిపై రగడ ఎందుకు? అసలు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రామ మందిర నిర్మాణానికి అనుకూలమా? వ్యతిరేకమా? సమాధానం చెప్పాలి. ఒకనాడు కాంగ్రెసోళ్లు అయోధ్యలోనే రాముడు పుట్టారనడానికి ఆధారాలేమిటని ఎద్దేవా చేశారు.. వాళ్లను నేను అడిగేదొక్కటే.. మీరు మీ అమ్మ కడుపులోనే పుట్టరనడానికి ఆధారాలేమిటి? అక్కడున్న డాక్టర్లు, నర్సులు చెబితేనే కదా మీకు తెలిసింది.
సుప్రీంకోర్టు తీర్పు వెలువడగానే ఈ దేశంలో విధ్వంసం జరగాలని కోరుకుంటున్న పార్టీ కాంగ్రెస్. కానీ దేశ ప్రజలు ప్రశాతంగా ఉంటూ కోర్టు తీర్పును స్వాగతించే సరికి జీర్ణించుకోలేక అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. దయచేసి ఇక్కడున్న ప్రభుత్వం గత బీఆర్ఎస్ మాదిరిగా కేంద్రాన్ని తిట్టడానికి పరిమితమై సమయాన్ని వ్రుధా చేయొద్దు.. అందరం కలిసి కేంద్రాన్ని ఒప్పించి అధిక నిధులు తీసుకొద్దామని కోరుకుంటున్నా’’ అని బండి సంజయ్ అన్నారు.