Chandrababu Comments in Sankranthi Celebrations: వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని.. మరో 3 నెలల్లో రాష్ట్రానికి మంచి రోజులు వస్తున్నాయని చంద్రబాబు (Chandrababu) అన్నారు. అమరావతి (Amaravathi) పరిధిలోని మందడం (Mandadam) గ్రామంలో నిర్వహించిన 'తెలుగు జాతికి స్వర్ణయుగం - సంక్రాంతి సంకల్పం' కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వులు, అమరావతికి వ్యతిరేకంగా తెచ్చిన జీవోల ప్రతులను భోగి మంటల్లో వేశారు. వైసీపీ ప్రభుత్వం అసమర్థ, విధ్వంస విధానాలతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారని మండిపడ్డారు. దేవతల రాజధాని అయిన అమరావతిని రాక్షసులు చెరబట్టారని విమర్శించారు. అమరావతి రైతులు అడుగడుగునా ఇబ్బంది పడ్డారని.. అవమానాలు ఎదుర్కొన్నారని అన్నారు. ఈ ఐదేళ్లు రాజధాని ప్రాంత వాసులకు, రైతులకు చీకటి రోజులని చెప్పారు. భవిష్యత్తు మనదే.. అమరావతి కేంద్రంగా రాజధాని ఉంటుందని స్పష్టం చేశారు.




పండుగ భోగీ.. పాలకుడు మానసిక రోగి


'ఇవాళ పండుగేమో భోగి.. పాలకుడేమో మానసిక రోగి' అని చంద్రబాబు (Chandrababu) మండిపడ్డారు. భవిష్యత్తు మనదేనని.. శుభ ఘడియలు తలుపు తడుతున్నాయని చెప్పారు. వైసీపీ విముక్త ఏపీ కోసం నేటి నుంచి 87 రోజుల పాటు కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా అందరూ ఒకే బాటలో పయనించాలని పిలుపునిచ్చారు. 'మన రాజధాని అమరావతే. ఇది రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తుంది. సంపద సృష్టించే కేంద్రంగా, సంక్షేమ పాలన అందించేందుకు తోడ్పడుతుంది. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా అమరావతి రైతులు పోరాడారు. రాష్ట్రాన్ని పునఃనిర్మించుకోవాలి. సీఎం జగన్ కు కూల్చడమే తెలుసు. రాజకీయ హింస, మోసపు హామీలతో బడుగు, బలహీన వర్గాల ఉసురు తీస్తున్నారు. అంగన్వాడీలు 32 రోజులుగా తమ సమస్యలు పరిష్కరించాలని పోరాడుతున్నా పట్టించుకోకుండా.. పండుగ పూట కూడా వారిని రోడ్డుపై ఉండేలా చేశారు. వైసీపీ పాలనలో రైతుల కష్టాలు వర్ణనాతీతం. తుపాను వచ్చి నష్టపోయినా పట్టించుకోరు. యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయి. భవిష్యత్తులో నిరుద్యోగులకు ఉపాధి కల్పించే బాధ్యతను టీడీపీ - జనసేన కలిసి తీసుకుంటాయి. ప్రభుత్వం కరవు మండలాలను కూడా పట్టించుకోకుండా కేంద్ర సాయం రాకుండా చేస్తోంది. ప్రతి ఒక్కరికీ అండగా నిలిచే బాధ్యత మాది. ' అని చంద్రబాబు పేర్కొన్నారు.


'3 రాజధానులు ఎక్కడా లేవు'


సీఎం జగన్ అహంకారాన్ని భోగి మంటల్లో వేశామని చంద్రబాబు చెప్పారు. ప్రభుత్వ ఒత్తిడి వల్ల పోలీసులు అమరావతి వాసులను ఇబ్బంది పెట్టారని.. ఇదే పోలీసులు మీకు జిందాబాద్ కొట్టే పరిస్థితి వస్తుందని అన్నారు. ఏపీలో జరుగుతున్న అరాచకాలను కోర్టులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందని వాపోయారు. ప్రపంచంలో 3 రాజధానులనేవి ఎక్కడా లేవని పేర్కొన్నారు. 'విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తాం. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తాం. విశాఖ, కర్నూలు నగరాలకు పూర్వ వైభవం తెస్తాం. రాజకీయాల్లో ఉండేందుకు అర్హత లేని వ్యక్తి సీఎం జగన్' అని వ్యాఖ్యానించారు.


'రాజధాని రైతుల సంకల్ప నెరవేరుతుంది'


మరికొద్ది రోజుల్లో రాష్ట్రానికి పట్టిన పీడ తొలగిపోయే సమయం ఆసన్నమైందని జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. రాజధాని కోసం 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాజధాని రైతులను దారుణంగా కొట్టి వేధించిన ఘటన తనను కలిచివేసిందని.. భవిష్యత్తులో రైతుల సంకల్పం నెరవేరుతుందని అన్నారు. 'బంగారు రాజధానిని నిర్మించుకుందాం. ఇది కేవలం అమరావతి సమస్యే కాదు. 5 కోట్ల మంది ప్రజలది. మీరు పడుతున్న కష్టం రేపు శ్రీకాకుళం, పులివెందులలోనూ వస్తుంది. భవన నిర్మాణ కార్మికులు, నిరుద్యోగులను వైసీపీ మోసం చేసింది.' అని పవన్ మండిపడ్డారు.


Also Read: Ambati Rambabu Dance: మంత్రి అంబటి సంక్రాంతి సంబరాలు, అదిరే స్టెప్పులతో మరోసారి వైరల్‌గా