రిపబ్లిక్ సినిమా ప్రీరిలీజ్ వేడుక కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ స్పందించింది. ఆ వ్యాఖ్యలతో తమకు సంబంధంలేదని స్పష్టం చేసింది. పవర్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు తీవ్రంగా స్పందించారు. ఈ వ్యాఖ్యలు ఇటు సినీ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పలువురు హీరోలు పవన్‌కు మద్దతుగా ట్వీట్లు చేశారు. ఈ వ్యవహారంపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ స్పందించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. కొంతమంది తమ అభిప్రాయాలు వెల్లడించారని తెలిపింది. అవి వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే అని పేర్కొంది. వాటిని ఫిల్మ్ ఇండస్ట్రీ అభిప్రాయాలుగా చూడకూడదని తెలిపింది.
వ్యక్తిగత అభిప్రాయాలతో సంబంధం లేదు
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాత్రమే ఏపీ, తెలంగాణలో సినీ ఇండస్ట్రీకి ప్రాతినిధ్యం వహిస్తోందని పేర్కొంది. ప్రభుత్వాల నుంచి ఎప్పుడూ ఇండస్ట్రీకి సహకారం అందుతూనే ఉందని తెలిపింది. ప్రభుత్వాల సహకారం లేకుండా మనుగడ సాగించలేమని పేర్కొంది. ఇండస్ట్రీపై ఆధారపడ్డ వేలాది కుటుంబాలు కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపింది. ‘‘ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమ కష్టాలలో ఉంది. సినీ పరిశ్రమపై ఒక్కొక్కరికీ ఒక్కో అభిప్రాయం ఉంటుంది. వ్యక్తిగత అభిప్రాయాలను వివిధ వేదికలపై చెబుతున్నారు. వ్యక్తిగత అభిప్రాయాలతో మాకు సంబంధం లేదు’’ అని ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పష్టం చేసింది.
ఇరు సీఎంల మద్దతు కావాలి
సినీ ఇండస్ట్రీకి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నామని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ నారాయణదాస్ నారంగ్ పత్రిక ప్రకటనలో తెలిపారు. సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వం పనితీరుపై తీవ్ర ఆరోపణలుచేశారు. తన మీద ఉన్న కోపంతో సినిమా పరిశ్రమను ఇబ్బంది పెడుతున్నారంటూ మండిపడ్డారు.
Also Read: పవన్ కళ్యాణ్‌కు మోహన్ బాబు కౌంటర్.. నువ్వు నాకంటే చిన్నవాడివి..