తెలంగాణలోని రజకుల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కృషి చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు తెలిపారు. రజకుల సంక్షేమం కోసం బడ్జెట్‌లో రూ. 250 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. హుజూరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఏర్పాటు చేసిన రజక ఆశీర్వాద సభలో హరీశ్ పాల్గొని ప్రసంగించారు. చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని హరీశ్ చెప్పారు. అన్ని కులాలు, కుల వృత్తులను కాపాడేందుకు కేసీఆర్ ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని వెల్లడించారు. రజకులకు 250 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ను అందిస్తున్నామని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో రజకులకు కార్పొరేషన్ లోన్లు ఇస్తామని హామీ ఇచ్చారు.
రజకులకు హైదరాబాద్‌లో మూడెకరాల స్థలం ఇవ్వడంతో పాటు రూ. 5 కోట్ల నిధులు ఇచ్చి వారి ఆత్మగౌరవం నిలబెట్టామని హరీశ్ రావు వివరించారు. బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కావాలని, ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని చెప్పారు. కానీ కేంద్రం తరఫు నుంచి ఎలాంటి స్పందన రాలేదని మంత్రి పేర్కొన్నారు. బీజేపీ విధానాల వల్ల రోజురోజుకూ నిత్యావసరాల ధరలు పెరిగిపోతున్నాయని మంత్రి తెలిపారు. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ను అఖండ మెజార్టీతో గెలిపించాలని హరీశ్ రావు కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్, రజక నాయకులు పాల్గొన్నారు.
Also Read: Bandi Sanjay: దివ్యాంగులంటే కేసీఆర్‌కు ఎందుకంత చులకన? టీఆర్ఎస్‌పై బండి సంజయ్ ఆగ్రహం