ఆన్లైన్ టికెట్ల విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వంపై చేసి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతుంది. శనివారం రిపబ్లిక్ సినిమా ప్రీరిలీజ్ వేడుకలో పవన్ కల్యాణ్ తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు పేర్ని నాని, బొత్స సత్యనారాయణ, అనిల్ కుమార్ యాదవ్, వెల్లంపల్లి శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్ విమర్శలు చేశారు. సినీ పరిశ్రమ గురించి పవన్ కల్యాణ్ నిజాలు తెలుసుకోవాలని సమాచారశాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. తెలంగాణలో 519 థియేటర్లకు గాను 419 థియేటర్లు మాత్రమే తెరిచారన్నారు. ఏపీలో 1100 థియేటర్లలో 800 థియేటర్లు నడుస్తున్నాయని తెలిపారు. ఏపీలో 3 రోజులుగా 510 థియేటర్లలో లవ్ స్టోరీ అనే సినిమా ఆడుతోందన్నారు. ఈ సినిమాకు తెలంగాణలో కంటే ఏపీలోనే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయన్నారు. నిర్మాతలకు తెలంగాణ కంటే ఏపీలోనే ఎక్కువ షేర్ వస్తుందని తెలిపారు. సీఎం జగన్ లక్ష్యంగా పవన్ వ్యాఖ్యల ఉన్నాయన్నారు. పోరాట యోధుడైన పవన్ వాస్తవాలు గ్రహించాలన్నారు. ఏపీ ప్రభుత్వం సినీ పరిశ్రమను ఏం ఇబ్బందిపెట్టిందో చెప్పాలన్నారు. వైసీపీ ప్రభుత్వం అవాకులు, చెవాకులు పేలుతున్నారని పేర్ని నాని విమర్శించారు.
ఏపీలోనే ఎక్కువ షేర్
హీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంపై మీడియా చేసిన తప్పేంటని మంత్రి పేర్ని నాని అన్నారు. తెలంగాణ పోలీసులు చెప్పిందే మీడియా రాసిందని తెలిపారు. పీకేకు దమ్ముంటే తెలంగాణ పోలీసులను, కేసీఆర్, కేటీఆర్ ను తిట్టాలన్నారు. తన అభిమానుల సంఘం అధ్యక్షుడు పీకే అని ఎద్దేవా చేశారు. కోడికత్తి కేసును ఎన్‌ఐఏ చూస్తోందన్న మంత్రి... కేసు ఏమైందో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను అడగాలన్నారు. పవన్ రెండు చోట్ల పోటీచేసి ఓడిపోయారని ఎద్దేవా చేశారు. మా ఎన్నికల్లో ఓట్ల కోసమే పవన్ తిప్పలని మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో వకీల్‌సాబ్ సినిమాకు దిల్‌రాజుకు రూ.80కోట్లు వస్తే ఏపీలో రూ.55 కోట్లు, తెలంగాణలో రూ.25 కోట్లు వచ్చాయని పేర్ని నాని అన్నారు.
మంత్రి అనిల్ కుమార్ కామెంట్స్
సినిమా టికెట్లు అధిక ధరలు లేకుండా పారదర్శకంగా జరగాలనే ఏపీ ప్రభుత్వ నిర్ణయం ఎలా తప్పు అవుతుందని మంత్రి అనిల్ కుమార్ ప్రశ్నించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. ప్రభుత్వానికి పెద్ద హీరో అయినా, చిన్న హీరో అయినా ఒకటేనన్నారు. పవన్ కల్యాణ్ అయినా సంపూర్ణేశ్ బాబు అయినా ఒక్కటే అన్నారు. తాము సినిమా ఇండస్ట్రీని భయపెట్టడం ఏమిటన్నారు. ఒకటితో మొదలు పెట్టిన పవన్ మొన్న జరిగిన జడ్పీటీసీ/ఎంపీటీసీ ఎన్నికల్లోనూ ఒక మండలంలోనే గెలిచారని ఎద్దేవా చేశారు. ఇలాంటి వాళ్లను ప్రభుత్వం చాలామందిని చూసిందని మంత్రి అనిల్ కుమార్ అన్నారు. కేవలం పవన్ దృష్టిలో పెట్టుకుని సినిమా పరిశ్రమను ఎందుకు ఇబ్బంది పెడతామని అనిల్ అన్నారు. ఆయన వాదనల్లో పొంతన లేదన్నారు. ప్రభుత్వానికి ఏ హీరో సినిమా అయినా ఒకటేనని మంత్రి అనిల్ అన్నారు. మీరంతా కళామతల్లి ముద్దు బిడ్డలమని మీరే చెబుతారు కదా అలాంటప్పుడు పెద్ద హీరో సినిమాకు ఒక టిక్కెటు ధర చిన్న సినిమా హీరోకు ఒక ధర ఎందుకని ప్రశ్నించారు. టికెట్ రేటు అనేది పెద్దవాడికి ఒకలా.. చిన్నవాడికి మరోలా ఉండకూడదన్నారు.
సంపూర్ణేశ్ బాబు ట్వీట్
మంత్రి అనిల్‌కుమార్ వ్యాఖ్యలపై హీరో సంపూర్ణేశ్‌బాబు స్పందించారు. "మంత్రి అనిల్ గారు, మంచి మనసున్న మా పవన్‌కళ్యాణ్ గారితో సమానంగా నన్ను చూడటం ఆనందకరం. ఏ సమస్య వచ్చినా పెద్ద మనసుతో స్పందించే తెలుగు సినిమా పరిశ్రమ ఇప్పుడు కష్టాల్లో ఉంది. ముఖ్యంగా ఎగ్జిబిటర్లు బాధల్లో ఉన్నారు. అదే పెద్ద మనసుతో అవి పరిష్కారం అయ్యేలా చూడగలరు" అని సంపూర్ణేశ్ బాబు ట్వీట్ చేశారు.
Also Read: ‘జగన్ గురించి మాట్లాడితే తాటతీస్తాం, పనికిమాలిన స్టార్..’ పవన్‌పై వెల్లంపల్లి సంచలన వ్యాఖ్యలు
మంత్రి అవంతి కామెంట్స్
ముఖ్యమంత్రి, మంత్రులపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని, తక్షణమే క్షమాపణ చెప్పాలని మంత్రి అవంతి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. పవన్ తన వ్యాఖ్యాల ద్వారా పలుచనైపోతున్నారన్నారు. సినిమా వేదికను రాజకీయ వేదికగా మార్చారని విమర్శించారు. సినీ పెద్దలు చిరంజీవి, మోహన్ బాబుపై పవన్ మాట్లాడిన తీరు సరైంది కాదన్నారు. సినిమాల్లోకి వచ్చి పదేళ్ల కూడా అవ్వని పవన్ కళ్యాణ్ మొత్తం ఇండస్ట్రీ అంతటికీ నష్టం జరుగుతుందని ఎలా మాట్లాడతారన్నారు.