డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్, తొలిసారి కప్పు ముద్దాడాలని భావిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కాలం కలసిరావడం లేదు. ఐపీఎల్ రెండో అంచెలో వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోయారు. విచిత్రంగా ఈ రెండు జట్లకు వరుస ఓటములు రుచిచూపించినవి ఒకే జట్లు కావడం విశేషం. అవే చెన్నై, కోల్‌కతా. అందుకే ఈ పోరులో గెలిచి ప్లేఆఫ్స్ అవకాశాలను మెరుగు పర్చుకోవాలని ముంబయి, బెంగళూరు పట్టుదలగా ఉన్నాయి.
Also Read: అయ్యో మిథాలీ సేన! ఆఖర్లో మెలోడ్రామా.. ఇలా ఓడిపోతారనుకోలేదు!
ముంబయిదే పైచేయి
ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ముంబయిదే పైచేయి. ఇవి రెండూ 28 సార్లు తలపడగా ముంబయి ఏకంగా 17 సార్లు గెలిచింది. బెంగళూరు పది విజయాలకే పరిమితమైంది. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. చివరిసారి తలపడ్డ ఐదు మ్యాచుల్లో రోహిత్ సేన మూడు, కోహ్లీసేన రెండుసార్లు గెలిచాయి. ఒక మ్యాచులోనైతే సూపర్ ఓవర్లో ఫలితం తేలింది. ఈ సీజన్లో తలపడ్డ మొదటి మ్యాచులో బెంగళూరు గెలిచింది. ముంబయి నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్ల తేడాతో ఆఖరి బంతికి ఛేదించింది.
Also Read: వార్ వన్‌సైడ్.. బెంగళూరును ఆరు వికెట్లతో ఓడించిన చెన్నై!
అత్యంత కీలకం
ప్రస్తుత మ్యాచ్ రెండు జట్లకు అత్యంత కీలకం. ఎందుకంటే ఇప్పటికే ఇవి చెరో తొమ్మిది మ్యాచులు ఆడాయి. కోహ్లీసేన ఐదు గెలిచి పది పాయింట్లతో ఉంది. ముంబయి నాలుగు గెలిచి ఎనిమిది పాయింట్లతో ఆఖరి నాలుగులో ఉంది. నెట్ రన్‌రేట్ లేకపోవడంతో మిగతా వాటికన్నా వెనకబడింది. ఈ పోరులో రోహిత్ సేన గెలిస్తే పది పాయింట్లతో టాప్-4లోకి వెళ్తుంది. లేదంటే తర్వాత నాలుగు మ్యాచుల్లో తప్పక 3 గెలవాల్సిన పరిస్థితి వస్తుంది. కోహ్లీసేనదీ ఇంచుమించు ఇదే పరిస్థితి. 2 పాయింట్లు ఎక్కువే ఉండటం ఊరట కలిగించే విషయం.
Also Read: టీమిండియా బాటలో శ్రీలంక జట్టు.. ధోనీకి పోటీగా బరిలోకి మహేళ జయవర్దనే
అక్కడే బోల్తా పడుతున్నారు
అద్భుతమైన ఆటగాళ్లున్నా ఓడిపోవడంతో ముంబయి కసితో ఉంది. బెంగళూరు మ్యాచుకు పక్కా ప్రణాళికతో వస్తుంది. పైగా రోహిత్, డికాక్ మంచి ఫామ్‌లో ఉన్నారు. మిడిలార్డర్ విఫలమవ్వడంతో భారీ స్కోర్లు చేయలేకపోతోంది. సూర్యకుమార్, ఇషాన్ కిషన్, కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్య రాణించాల్సిన అవసరం ఉంది. బౌలింగ్‌లో బుమ్రా, బౌల్ట్ సైతం విఫలమవుతుండటం ఆశ్చర్యపరిచే విషయం. బెంగళూరు మ్యాచులో బౌల్ట్, బుమ్రా, రాహుల్ చాహర్ కీలకం అవుతారు. కోహ్లీ ఫామ్‌లోకి రావడం బెంగళూరుకు ఆనందం కలిగించే విషయం. పడిక్కల్ ఫామ్‌లోనే ఉన్నాడు. ఎటొచ్చీ మిడిలార్డరే విఫలమవుతోంది. మాక్సీ, ఏబీ విజృంభించాల్సిన అవసరం ఉంది. బౌలింగ్‌లో హర్షల్ పటేల్ ఫర్వాలేదనిపిస్తున్నా.. జేమీసన్, సిరాజ్ మరింత పక్కాగా బంతులేస్తే బెటర్.