ఆఖరి బంతి నోబాల్‌..  చేయాల్సిన పరుగులు 2.. బ్యాటర్‌ను ఔట్‌ చేసేందుకు రనౌట్‌ మాత్రమే మార్గం.. ఇలాంటి ఉత్కంఠ రేపిన మ్యాచులో ఆస్ట్రేలియా అమ్మాయిలు అద్భుతం చేశారు. టీమ్‌ఇండియాకు విజయాన్ని దూరం చేశారు. మూడు వన్డేల సిరీసును 2-0తో కైవసం చేసుకున్నారు. చివరికి స్మృతి మంధాన సూపర్‌ ఇన్నింగ్స్‌ వృథాగా మారింది.


మంధాన సూపర్‌ ఇన్నింగ్స్‌
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో మిథాలీ సేన 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఆఖరి ఓవర్లో మెలోడ్రామకు దారితీసిన పోరులో ఆస్ట్రేలియా విజయం అందుకుంది. 275 పరుగుల లక్ష్యాన్ని ఆఖరి బంతికి ఛేదించింది. మొదట స్మృతి మంధాన (86; 94 బంతుల్లో 11x4), రిచా ఘోష్‌ (44; 50 బంతుల్లో 3x4, 1x6) మెరుగ్గా ఆడటంతో టీమ్‌ఇండియా 7 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది.  అయితే ఛేదనలో బెత్‌ మూనీ (125*; 133 బంతుల్లో 12x4) సమయోచిత శతకానికి తహిలా మెక్‌గ్రాత్‌ (74; 77  బంతుల్లో 9x4), నికోలా కారె (39*; 38 బంతుల్లో 2x4)  విలువైన పరుగులు జత చేయడంతో ఆసీస్‌ ఆఖరి బంతికి విజయం అందుకుంది.


Also Read: అర్థం లేకుండా కోహ్లీ ఆట.. చెన్నైపై ఓడితే కెప్టెన్సీ నుంచి తీసేయనున్న ఆర్‌సీబీ!


మెలోడ్రామా స్టార్ట్‌
ఆసీస్‌ ఛేదనలో భారత బౌలర్లు మెరుగ్గా బౌలింగ్‌ చేశారు. కట్టుదిట్టంగా బంతులు విసిరారు. ఆస్ట్రేలియా బ్యాటర్లు పరుగులు చేయకుండా అడ్డుకున్నారు. అయినప్పటికీ బెత్‌ మూనీ మాత్రం పట్టువిడవలేదు. నిలకడగా ఒక్కో పరుగు చేసింది. సహచరులతో కలిసి ఇన్నింగ్స్‌ నిర్మించింది. టీమ్‌ఇండియా బౌలర్లూ పట్టు విడకపోవడంతో ఆఖరి ఓవర్లో ఉత్కంఠ రేగింది. విజయం అందుకోవాలంటే చివరి ఆరు బంతుల్లో ఆసీస్‌ 13 పరుగులు చేయాలి. అత్యంత సీనియర్‌ పేసర్‌ జులన్‌ బంతి అందుకుంది. తొలి బంతికి మూనీ 3 పరుగులు చేసింది. రెండో బంతికి కారె 2 పరుగులు తీసింది. మూడో బంతి నోబాల్‌ అయినా పరుగులేం రాలేదు. ఇక ఆఖరి 2 బంతుల్లో 3 పరుగులు చేయాల్సిన పరిస్థితి.


Also Read: నటరాజన్‌ స్థానంలో మరొకరిని తీసుకున్న సన్‌రైజర్స్‌.. ఎవరో తెలుసా?


ఇలా ముగిసింది
ఐదో బంతికి కారె 2 పరుగులే చేయడంతో ఆఖరి బంతికి 3 చేయాలి. రెండు చేస్తే మ్యాచ్‌ టై అయి సూపర్‌ ఓవర్‌కు దారితీస్తుంది. జులన్‌ ఆఖరి బంతిని విసరడంతో కారె భారీ షాట్‌ ఆడింది. మిడ్‌ వికెట్లో ఫీల్డర్‌కు చిక్కింది. కానీ బంతి నోబాల్‌ కావడంతో ఆమె బతికి పోయింది. ఒక పరుగూ వచ్చింది. చివరి బంతి ఫ్రీహిట్‌ కావడం.. రనౌట్‌ తప్ప మరేమీ చేయలేని స్థితి భారత్‌ది. కారె సులభంగా 2 పరుగులు చేసేసి ఆసీస్‌కు విజయం అందించింది.


Also Read: నేడు బెంగళూరుతో చెన్నై ఢీ.. హాట్ ఫేవరెట్ ఎవరంటే?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి