‘‘ఆ ప్యానెల్‌లో ఉన్నవారంతా నా బ్యానర్‌లో పనిచేశారు. నా దగ్గర డబ్బులు తీసుకున్నారు. వాళ్లంతా గొప్ప నటులే. కానీ, వారు మా అసోసియేషన్‌లో మాత్రం పనిచేస్తారనే నమ్మకం నాకు లేదు. వారికి డబ్బలిచ్చి మళ్లీ నా సినిమాలో పెట్టుకుంటా. కానీ, వారు మాత్రం ‘మా’లో పనిచేయలేరు’’ అంటూ హీరో మంచు విష్ణు ప్రకాష్ రాజ్ ప్యానెల్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. మా ఎన్నికల నేపథ్యంలో విష్ణు శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విష్ణు తన ప్యానెల్ సభ్యులను మీడియాకు పరిచయం చేశారు. 


అధ్యక్ష పదవి బిరుదు కాదు.. బాధ్యత: విష్ణు మాట్లాడుతూ.. ‘‘కాలం మారుతుంది. కళాకారులం అలాగే ఉన్నాం. టాలెంట్ నమ్ముకుని ఉన్నాం. మేము కూడా మీలా సాధారణ వ్యక్తులమే. సినిమా వేరు, మేము వేరు. సినిమాల్లో పాత్రలు మాత్రమే చేస్తాం. ఇంటికి వెళ్లిన తర్వాత మీలా సాధారణ ప్రజలమే. అధ్యక్ష పదవి బిరుదు కాదు, బాధ్యత, చాలా పెద్ద బాధ్యత. ఆ బాధ్యత తీసుకోగలననే నమ్మకంతో నేను వస్తున్నా’’


నాన్నగారు సంతోషంగా లేరు: ‘‘MAA ఎన్నికల్లో పోటీ చేస్తున్నందుకు నాన్నగారు (మోహన్ బాబు) నన్ను ఆశీర్వదించారు. కానీ, ఆయన సంతోషంగా లేరు. ఆయన 47 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. సినిమాల్లో నటించడానికి ముందు ఆయన ఐదేళ్లు అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేశారు. ఆయన చాలా ఆవేదనతో ఉన్నారు. ఆయనకు తెలిసి ఆర్టిస్టులు ఎప్పుడూ ఇలా డివైడ్ కాలేదు. ఇంత బీభత్సం ఎప్పుడూ జరగలేదు. మేమంతా సర్‌ప్రైజ్ అయ్యాం’’ అని విష్ణు తెలిపాడు. 


దాసరి గారు 2015లోనే నన్ను ప్రెసిడెంట్ కావాలన్నారు: ‘‘2015-16 సంవత్సరంలో దాసరి నారాయణ రావు, మురళి మోహన్‌ నన్ను అధ్యక్షుడిగా నిలబడాలని కోరుకున్నారు. నువ్వే అధ్యక్షుడి చేయాలి. యంగ్ బ్లడ్ కావాలి అన్నారు. కానీ, నాన్నగారు వద్దన్నారు. మా అధ్యక్షుడు అంటే బాధ్యత, నువ్వు అందుకు టైమ్ కేటాయించలేవు. సమర్దులను ఎంపిక చేసుకోమని చెప్పారు. అప్పట్లో మార్పు కోసమే నన్ను అధ్యక్షుడిగా ఉండమన్నారు. పాతికేళ్ల కిందటి కంటే ఇప్పుడు విపరీతమైన సవాళ్లు ఉన్నాయి’’ అని తెలిపాడు. 


Also Read: లవ్‌స్టోరీ సమీక్ష: గుండె బరువెక్కించే సందేశం.. ప్రేమకథ రూపంలో..


ఎడ్యుకేషన్ పాలసీపై చర్చకు సిద్ధం: ‘‘మాలో ఉన్న 900 మందికి మెడికల్ ఇన్సురెన్స్ ఎందుకు ఇవ్వకూడదు? ఎడ్యుకేషన్ పాలసీ అంత ఈజీ కాదని అంటున్నారు. డిబేట్‌కు నేను సిద్ధం. నేను నటుడు, నిర్మాతనే కాదు విద్యావేత్తను కూడా. ఎడ్యుకేషన్ మీద నాకు చాలా నాలెడ్జ్ ఉంది. ఇండస్ట్రీలో అందరికీ అవకాశాలు కల్పించాలి. అవకాశాలు లేనివారికి వారం పది రోజులు పని కల్పించాలి. అదే నా ప్రయారిటీ. 900 మంది 2 వేల మంది అవ్వాలి. కొత్త అవకాశాలు, టాలెంట్ కావాలి’’ అని విష్ణు పేర్కొన్నాడు.


Also Read: జీవిత ప్రలోభ పెడుతోంది.. కమెడియన్ పృథ్వీరాజ్ ఫిర్యాదు, హీటెక్కిన ‘మా’ ఎన్నికలు


నా సొంత డబ్బుతో బిల్డింగ్ కడతా: ‘‘నాన్నగారు అధ్యక్షుడిగా అన్నప్పుడు అంతా అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఓ సీనియర్ నటుడిని చూపిస్తూ ఆయనకే మాదాపూర్, కొండపూర్ వద్ద ఎకరాలు ఉన్నాయి. ఆయనే రెండు ఎకరాలు ‘మా’కు ఇవ్వొచ్చు కదా, ప్రభుత్వాన్ని ఎందుకు అడుగుతున్నారు? అన్నారు. ఆ కలను నేను నెరవేరుస్తా. సొంత డబ్బుతో భవనం పూర్తి చేస్తా. స్థలం ప్రభుత్వాన్ని అడుగుతామా, ప్రైవేట్‌నా అనేది తర్వాత. నేను మల్టిప్టెక్స్, కల్యాణ మండపం కట్టను. మా పనిచేయడానికి అవసరమైన భవనాన్ని నిర్మిస్తాను’’ అని విష్ణు స్పష్టం చేశాడు. ఎన్నికల్లో పోటీకి ఇంత తాపత్రయం ఎందుకు పడుతున్నారనే ప్రశ్నకు విష్ణు బదులిస్తూ.. ‘‘నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడే రూ.50 కోట్లు సంపాదించాలని అనుకుంటున్నా’’ అని చలోక్తి విసిరాడు.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి