సెకండ్ వేవ్ తర్వాత ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి కలిగించిన లవ్‌స్టోరీ సినిమా థియేటర్లలో విడుదలైంది. మజిలీ, వెంకీ మామ(కమర్షియల్ సక్సెస్) విజయాల తర్వాత నాగచైతన్య, ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల, సాయి పల్లవి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై మొదలైనప్పటి నుంచే అంచనాలు ఉన్నాయి. పాటలు సూపర్ హిట్ కావడం, టీజర్, ట్రైలర్లను ఇంట్రస్టింగ్‌గా కట్ చేయడంతో సెకండ్ వేవ్ తర్వాత ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసిన సినిమాగా లవ్ స్టోరీ నిలిచింది. బుకింగ్స్ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రహ్మాండంగా ఉన్నాయి. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? నాగచైతన్య హ్యాట్రిక్ హిట్ కొట్టాడా? శేఖర్ కమ్ముల, సాయి పల్లవిలు మళ్లీ మ్యాజిక్ చేశారా?


కథ: చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో తల్లి(ఈశ్వరి రావు) ఎంతో కష్టపడి రేవంత్‌ను(నాగచైతన్య) పెంచుతుంది. పుట్టినప్పటి నుంచి కులవివక్ష తనను వెంటాడుతూనే ఉంటుంది. పెరిగి పెద్దయ్యాక డ్యాన్స్ మీద ఇష్టంతో హైదరాబాద్ వచ్చి జుంబా సెంటర్ పెట్టి కష్టాలు పెడుతూ ఉంటాడు. ఇక మౌనికది(సాయి పల్లవి) మరో కథ. చిన్నప్పటి నుంచి ‘నువ్వేం చేయలేవు’ అనే మాటలు వింటూ పెరుగుతుంది. ఇంట్లో వాళ్లని ఎలాగోలా ఒప్పించి జాబ్ కోసం హైదరాబాద్ వస్తుంది. మౌనిక స్నేహితురాలు.. రేవంత్ జుంబా సెంటర్‌లో చేరుతుంది. అలా వారికి పరిచయం అవుతుంది. వారి కథ అక్కడ నుంచి ఎన్ని మలుపులు తిరిగింది? చివరికి వారి లవ్ స్టోరీ సుఖాంతం అయిందా? లాంటివి తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.


విశ్లేషణ: పేరుకే లవ్ స్టోరీ అని పెట్టారు కానీ.. నిజానికి ఈ కథలో ప్రధాన పాత్ర పోషించేది సమాజంలో మనకు రోజూ కనిపించే సమస్యలే. కుల వివక్ష, పరువు హత్యలతో పాటు మరో సున్నితమైన అంశాన్ని కూడా శేఖర్ కమ్ముల టచ్ చేశాడు. అది క్లైమ్యాక్స్‌కు ముందు మాత్రమే బయటపడుతుంది కాబట్టి ప్రస్తుతానికి సస్పెన్స్. 


నిజానికి శేఖర్ కమ్ముల గత సినిమాల కంటే ఇది కాస్త భిన్నమైనదనే చెప్పాలి. ఫిదా, హ్యాపీడేస్ సినిమాల్లో హీరో, హీరోయిన్ల మధ్య ఉండే మనస్పర్థలే కథలో విలన్లుగా ఉంటాయి. కానీ ఇందులో మాత్రం వారి చుట్టూ ఉండే పరిస్థితులు, మనుషులు విలన్ల పాత్ర పోషిస్తారు. హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమ పుట్టేసరికే సగం సినిమా దాటిపోతుంది. సినిమా ఫస్టాఫ్ కాస్త వేగంగా ఉన్నా.. సెకండాఫ్ కాస్త నెమ్మదిస్తుంది. చివరి 45 నిమిషాల్లో మాత్రం కథ మళ్లీ ఊపందుకుంటుంది.


నటీనటుల విషయానికి వస్తే.. నాగచైతన్య కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. రేవంత్ పాత్ర తన కెరీర్‌లోని ఉత్తమ క్యారెక్టర్లలో కచ్చితంగా నిలుస్తుంది. సాయిపల్లవి ముందు నిలబడగలడా? అని సినిమా ముందు కొన్ని సందేహాలు వచ్చినప్పటికీ తన పెర్ఫార్మెన్స్‌తో సినిమాను నిలబెట్టాడు. తనకు పెద్దగా అలవాటులేని డ్యాన్స్‌పై కూడా చైతన్య పట్టు సాధించాడు. సాయిపల్లవిని మ్యాచ్ చేసే విధంగా డ్యాన్స్ చేయడం ఈ సినిమా కోసం తను ఎంత హోం వర్క్ చేశాడో చెబుతుంది.


ఇక సాయిపల్లవి ఎప్పటిలాగే అద్భుతంగా నటించింది. సాయిపల్లవిలోని పొటెన్షియల్‌ను శేఖర్ కమ్ముల వాడినంతగా తెలుగు దర్శకులు ఎవరూ ఉపయోగించలేదంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఫిదాలో భానుమతి పూర్తిగా డైనమిక్ అమ్మాయి కాగా, లవ్ స్టోరీలో మౌనిక అలా కాదు. ప్రతి విషయానికి భయపడుతూ.. ఎవరైనా గట్టిగా అరిస్తే కళ్లు తిరిగి పడిపోయేంత అమాయకురాలు. ఇలా పూర్తిగా భిన్నమైన పాత్రను కూడా అలవోకగా పోషించింది.


రాజీవ్ కనకాల, ఈశ్వరి రావు, ఉత్తేజ్‌లు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. రాజీవ్ తన గత చిత్రాల కంటే భిన్నమైన క్యారెక్టర్ చేశాడు. సినిమా చివరిలో తన క్యారెక్టర్‌కు ఇచ్చే ట్విస్ట్ మాత్రం షాకింగ్ అని చెప్పాలి. ఇక మిగతా నటీనటులు కూడా చాలా సహజంగా నటించారు.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి