ఢిల్లీలోని రోహిణీ కోర్టు లోపల కాల్పులు చోటు చేసుకున్నాయి. కోర్టు రూం నెంబర్ 207లో ఈ ఘటన జరిగింది. దుండగులు చేసిన ఈ కాల్పుల్లో గ్యాంగ్‌స్టర్ జితేందర్ మాన్ గోగి దారుణ హత్యకు గురయ్యారు. కాల్పుల్లో ఆయన అక్కడికక్కడే మరణించారు. ఓ కేసులో రోహిణీ కోర్టుకు జితేందర్ మాన్ గోగి కోర్టుకు హాజరైన సందర్భంగా దుండగులు ఈ కాల్పులు జరిపారు. లాయర్ దుస్తుల్లో వచ్చిన ఇద్దరు దుండగులు తుపాకీలతో అదే పనిగా కాల్పులు చేశారు. జితేందర్ మాన్ గోగి ప్రత్యర్థులు మారు వేషాల్లో వచ్చి తమ పగ తీర్చుకున్నట్లుగా తెలుస్తోంది.
అయితే, ఈ రక్తపాతానికి తెగబడ్డ దుండగులు పోలీసుల తూటాలకు బలయ్యారు. కాల్పుల సమయంలో పెద్ద పెద్ద శబ్దం రావడంతో అంతా భయాందోళనకు గురయ్యారు. 30 నుంచి 40 రౌండ్ల కాల్పుల శబ్ధాలు వినిపించాయి. దీంతో కోర్టుకు వచ్చినవారంతా ఆ కాల్పుల హోరులో అటూ ఇటూ పరుగులు తీశారు. కాల్పుల ఘటనంతా కోర్టు రూముల్లోనే జరగడంతోనే ప్రస్తుతం సంచలనంగా మారింది.
గతంలోనూ భద్రతపై ఆరోపణలు
రోహిణీ కోర్టు గతంలో కూడా ఇలాంటి విషయంలో వార్తల్లోకి ఎక్కింది. 2017లో జరిగిన ఓ హత్య ఘటనలో భద్రతా సిబ్బంది తీరుపై లాయర్లు నిరసన చేశారు. కోర్టులోకి వెళ్లే సమయంలో జనాలను, లాయర్లను భద్రతా సిబ్బంది సరిగ్గా చెక్ చేయడం లేదని విమర్శలు వచ్చాయి. సీసీటీవీ కెమెరాల నిఘా లోపం కూడా ఉందని అప్పట్లో వార్తలు వచ్చాయి.