స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో సెన్సెక్స్ మరో కీలక మైలురాయిని చేరింది. శుక్రవారం సెన్సెక్స్‌ ఆరంభంలోనే 60 వేల పాయింట్ల మైలురాయిని సెన్సెక్స్ తాకింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ నిఫ్టీ కూడా 18 వేల మార్కును తాకేలా అడుగులు వేస్తోంది. అమెరికా మార్కెట్లు గురువారం భారీ లాభాల్లో ముగియడం.. దేశీయంగా పలు సానుకూల పరిణామాలు ఉండడంతో సెన్సెక్స్ ఎగబాకేందుకు కారణంగా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉదయం 9.30 సమయంలో సెన్సెక్స్‌ 375 పాయింట్ల లాభంతో 60,260 వద్ద, నిఫ్టీ 110 పాయింట్లు లాభపడి 17,933 వద్ద ఉన్నాయి.


ఈ ఏడాది ఫిబ్రవరిలో సెన్సెక్స్‌ 50 వేల మార్కును దాటగా.. కేవలం 6 నెలల్లో మరో 10 వేల పాయింట్లను సెన్సెక్స్ దాటేసింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లతో పోటీ పడుతోంది. హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఏసియన్ పెయింట్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టీసీఎస్‌, ఎల్‌ అండ్‌ టీ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్‌, బజాజ్‌ ఫినాన్స్, టైటన్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.


Also Read: Oyo Hotels IPO: జొమాటో బాటలో ఓయో! ఐపీఓకు రానున్న హోటల్‌ అగ్రిగేటర్‌ కంపెనీ


ఫెడ్‌ నిర్ణయాల తర్వాత ఆచితూచి
సూచీలు గరిష్ఠ స్థాయిల్లో కొనసాగుతుండటంతో మదుపర్లు, వ్యాపార వేత్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే సెన్సెక్స్‌ 60000 స్థాయిలో నిలకడగా కొనసాగుతుందో లేదో వేచిచూడాలని విశ్లేషకులు చెబుతున్నారు. బీఎస్‌ఈలో శుక్రవారం ఉదయం తొలి గంటలో 60 శాతం షేర్లు లాభాల్లోనే కొనసాగుతున్నాయి. అమెరికా ట్రెజరీ ఈల్డ్స్‌ రేట్ల పెంపుదల ఉంటుందన్న ఊహాగానాల నేపథ్యంలో మదుపర్లు ఆచూతూచి వ్యవహరించాలని పేర్కొంటున్నారు. అమెరికా ఫెడ్‌ నిర్ణయాలను జాగ్రత్తగా పరిశీలించాలని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ చీఫ్‌ మార్కెట్‌ స్ట్రాటజిస్టు ఆనంద్‌ జేమ్స్‌ అంటున్నారు.


Also Read: Banking Trojan Malware: ఆండ్రాయిడ్ ఫోన్‌లో బ్యాంకింగ్ చేస్తున్నారా.. అయితే జాగ్రత్త.. ఇలా అస్సలు చేయకండి!


మరో 2-3 ఏళ్లు బుల్‌రన్‌
భారత స్టాక్‌ మార్కెట్లలో మరో రెండు మూడేళ్లు బుల్‌ రన్‌ కొనసాగుతుందని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్‌ రీసెర్చ్‌ హెడ్‌ సంతోష్‌ మీనా అంచనా వేస్తున్నారు. ఇప్పుడు 60వేల మార్కును దాటేసిన సెన్సెక్స్‌ మరిన్ని శిఖరాలు అధిరోహిస్తుందని పేర్కొన్నారు.  మనమిప్పుడు 2003-2007 మధ్యనాటి సంప్రదాయ బుల్‌ మార్కెట్‌ దశలో ఉన్నామని వెల్లడించారు. అయితే కొన్నిరోజుల పాటు సూచీలు దిద్దుబాటుకు గురవ్వొచ్చని అంచనా వేశారు. అంతర్జాతీయ సూచీలైన డో జోన్స్‌, డాక్స్‌లోనూ నిరోధం ఉండటంతో దిద్దుబాటు అవుతున్నాయని తెలిపారు. అమెరికా బాండ్‌ ఈల్డ్స్‌ను బట్టి ఊగిలాట ఉండొచ్చని పేర్కొన్నారు. బుల్‌ రన్‌ ఇలాగే కొనసాగితే సెన్సెక్స్‌ లక్షకు చేరుకోవడం ఖాయం అన్నారు.


Also Read: Gold-Silver Price: గూడ్‌న్యూస్! తగ్గిన పసిడి ధర.. వెండి మాత్రం స్థిరంగా, నేటి తాజా ధరలివే..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి